Wedding Kit: ఇటీవల సామూహిక వివాహాలు జరిపించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం పెళ్లి కూతుళ్లకు కన్యత్వ పరీక్ష నిర్వహించింది. ఈనిర్ణయం వివాదాస్పదమైంది. అయితే కానుకల కోసం మళ్లీ పెళ్లి చేసుకునే వారిని గుర్తించేందుకే ఇలా చేశామని సమర్థించుకుంది.. తాజాగా వధువులకు ఇచ్చే మేకప్ కిట్టలో కండోమ్స్, గర్భ నిరోధక మాత్రలు ఉంచి మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.
పేదలకు ఉచితంగా…
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం చేపట్టిన సామూహిక వివాహ పథకం మరోసారి వివాదంలో చిక్కుకుంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కన్య వివాహ/ నిఖా యోజన పథకం కింద సోమవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. ఈ పథకం ద్వారా 296 జంటలు ఒకటయ్యాయి. కాగా కొత్తగా పెళ్లైన వధువులకు ఈ పథకం కింద అందించిన మేకప్ కిట్ బాక్స్‌లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు పంపిణీ చేశారు. మేకప్ కిట్ తెరిచి చూసిన వధువులు వాటిలో కండోమ్స్, బర్త్ కంట్రోల్ పిల్స్ చూసి షాక్‌కు గురయ్యారు. దీంతో సీఎం చౌహా¯Œ నపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ముందుజాగ్రత్త అని సమర్థింపు..
అయితే దీనిపై జిల్లా అధికారి భుర్సింగ్ రావత్ స్పందించారు. కుటుంబ నియంత్రణకు సంబంధించి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య అధికారులు కండోమ్‌లు, గర్భనిరోధక మందులను పంపిణీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలను పంపిణీ చేసే బాధ్యత తమది కాదని. కుటుంబ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ వీటిని అందజేసే అవకాశం ఉందన్నారు. తాము కేవలం ముఖ్యమంత్రి కన్యా వివాహ/నిఖా యోజన కింద లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలోకి రూ.49 వేలు ట్రాన్స్‌ఫర్ చేస్తామని, పెళ్లి సమయంలో ఆహారం, వాటర్, టెంట్, వాటికి సంబంధించి రూ. 6 వేలు అందిస్తామని తెలిపారు. అయితే పంపిణీ చేసిన ప్యాకెట్లలో ఏముంటుందో తమకు తెలీదని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కన్య వివాహ/ నిఖా యోజన పథకాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2006 ఏప్రిల్‌లో ప్రారంభించింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాల మహిళలకు పెళ్లికి సాయం అందించాలనే నేపథ్యంలో దీనిని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా వధువు కుటుంబానికి ప్రభుత్వం రూ.55 వేలు అందిస్తుంది. అయితే ఇటీవల అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి.