BJP: రామ మందిరం నిర్మాణం దిశగా అడుగులు వేసింది. ఇటీవల ద్వారకలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ముంబైలో సముద్రంపై అతిపెద్ద వంతెన నిర్మించింది. మధ్యప్రదేశ్లో శివుడి ఆలయాన్ని అభివృద్ధి చేసింది. ఉత్తరప్రదేశ్ రూప చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఉత్తర భారత దేశంలో బిజెపి సమూల మార్పులు తీసుకొచ్చింది. ఫలితంగా ఈసారి జరిగే ఎన్నికల్లో అక్కడ గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని, మూడోసారి అధికారంలోకి వస్తామని బిజెపి నాయకులు ఆశాభావంతో ఉన్నారు. ఉత్తరాది సరే.. మరి దక్షిణాది పరిస్థితి ఏంటి.. దక్షిణ భారతదేశంలో బిజెపి అనుకున్నట్టుగా పరిస్థితులు ఉన్నాయా? భారతదేశం మొత్తం అలుముకున్నట్టుగా మోడీ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఉన్నదా? అంటే ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. బిజెపి 2014, 2019 ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో సీట్లను సాధించలేదనే చెప్పాలి.
కర్ణాటకలో..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమిపాలైంది. ఇది పార్లమెంట్ ఎన్నికలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో బిజెపి క్లీన్ స్వీట్ చేసినంత పనైంది. కానీ ఈసారి అక్కడ అంత సులువుగా ఉండదని తెలుస్తోంది. అయితే తక్కువలో తక్కువ 10 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని అక్కడి విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో లాగా సమష్టిగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణలో..
ఇక తెలంగాణ రాష్ట్రంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలను బిజెపి గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తక్కువ స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ పార్టీ కూడా దాదాపు పదికి మించి స్థానాలు గెలుచుకోవాలని భావిస్తోంది. అలాంటప్పుడు బిజెపి గత ఎన్నికలలో నాలుగు సీట్లు సాధిస్తుందా? లేక ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందా? లేక అంతకుమించి పడిపోతుందా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది. కవిత అరెస్టు రాజకీయంగా లాభం చేకూర్చుతుందని బిజెపి నాయకులు భావిస్తున్నారు.
కేరళలో..
కేరళ రాష్ట్రంలో ఉనికిని చాటుకునేందుకు బిజెపి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం నాలుగు పార్లమెంటు స్థానాలపై బిజెపి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయితే కేరళ రాష్ట్రంలో అన్ని ఎంపీ స్థానాలను కాంగ్రెస్ కూటమి గెలుచుకుంటుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. అంటే ఈసారి కూడా కేరళ రాష్ట్రంలో పాగా వేయాలనే బిజెపి కోరిక నెరవేరకపోవచ్చు.
తమిళనాడులో..
తమిళనాడు రాష్ట్రంలో అన్నాడీఎంకే బీజేపీకి దూరమైంది. ఆ రాష్ట్రంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు బిజెపి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాదయాత్ర నిర్వహించారు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలో ప్రజల మద్దతు అంతంతమాత్రంగానే ఉందని తెలుస్తోంది. మరో వైపు సర్వేలు కూడా అధికార డిఎంకె పార్టీ ఎక్కువ సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని స్పష్టం చేస్తున్నాయి. అంటే ఈసారి కూడా తమిళనాడులో ప్రభావం చూపించాలనే బిజెపి ఆకాంక్ష నెరవేరకపోవచ్చు…
ఆంధ్రప్రదేశ్ లో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటుతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. 2014 లాగానే ఇక్కడ బిజెపి.. టిడిపి, జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుంది. 2014లో పొత్తు పెట్టుకుని ఈ మూడు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కొద్దిరోజులపాటు వీటి మధ్య బంధం సజావుగానే నడిచింది. ఆ తర్వాత టిడిపి, బిజెపి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఆ రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. 2019 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు ఏపీలో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ఇప్పుడు త్వరలో జరిగే ఎన్నికలకు మళ్ళీ పొత్తు పెట్టుకున్నాయి. అయితే ఈసారి ఎలాంటి ఫలితాలు పొందుతాయో వేచి చూడాల్సి ఉంది. సర్వే సంస్థలు మాత్రం కూటమి పార్టీల అంచనా కంటే భిన్నంగా ఫలితాలను వెలువరిస్తున్నాయి.