Cotton Candy: పీచు మిఠాయి అంటే పిల్లలనుంచి పెద్దవారి వరకు లొట్టలేసుకుని తింటారు. అంత రుచిగా ఉంటుంది. నోటిలో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. ముఖ్యంగా పిల్లలు పీచు మిఠాయి అంటే ఇష్టపడతారు. ఎక్కడ కనిపించినా కొనాలని మారాం చేస్తారు. అయితే కొనుగోలుదారులకు ఆకట్టుకునేందుకు రకరకాల రంగులు చల్లుతారు. ఆసక్తికరంగా మార్చుతారు. అయితే ఇలా మార్చేందుకు రసాయనాలు వాడుతున్నారని పరిశోధనల్లో తేలుతోంది. ప్రజారోగ్యానికి భంగం వాటిల్లడంతో చాలా రాష్ట్రాలు పీచు మిఠాయిలను నిషేధిస్తున్నాయి. గతంలో పాండిచ్చేరి ప్రభుత్వం నిషేధించగా.. తాజాగా తమిళనాడు సర్కార్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇటీవల చెన్నై నగరవ్యాప్తంగా ఆహార భద్రత తనిఖీ అధికారులు పీచు మిఠాయి విక్రయాలపై ఫోకస్ పెట్టారు. వాటి నాణ్యత ప్రమాణాలు తనిఖీ చేశారు. పెద్ద ఎత్తున నమూనాలను స్వాధీనం చేసుకున్నారు. ల్యాబ్ కు తరలించి పరిశోధనలు చేశారు. అయితే పీచు మిఠాయిల్లో రోడమైన్ బి అనే కెమికల్ ను గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం ఈ కెమికల్ వినియోగించినట్లు పరిశోధనలో తేలింది. ఇది చిన్నారుల ఆరోగ్యం పై పెను ప్రభావం చూపుతుందని గుర్తించారు. దీనిని నిషేధించడమే ఉత్తమమని ప్రభుత్వానికి సిఫారసులు చేశారు.
అయితే ఈ నివేదికలో అందుకున్న తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వీటి విక్రయాలపై పూర్తిగా నిషేధం విధించింది. ఎక్కడైనా విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రజారోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ప్రజలు ఈ విషయంలో సహకరించాలని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ కోరారు. వీటిల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో ఇతర రాష్ట్రాలు సైతం అప్రమత్తం అవుతున్నాయి. పీచు మిఠాయి విక్రయాలపై దృష్టి పెడుతున్నాయి.