Ram Mandir: భారతీయుల 500 ఏళ్ల కల నెరవేరబోతోంది. అయోధ్యలో అభినవ రాముడు కొలువుదీరబోతున్నాడు. జనవరి 22న మధ్యాహ్నం 12:29:08 గంటలకు బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా నిర్వహించనున్నారు. ఈమేరకు అయోధ్యలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట చేయబోతున్న మోదీ 11 రోజుల అనుష్టానం దీక్షలో ఉన్నారు. ఇక అపురూప ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కాబోతోంది. ఈ వేడుకలకు ప్రధాని మోదీతోపాటు దేశ విదేశాలనుంచి అతిరథ మహారథులు విచ్చేయనున్నారు. అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కేవలం 7 వేల మందికి మాత్రమే దక్కింది. 22న భక్తులు ఎవరూ అయోధ్యకు రావొద్దని తీర్థ క్షేత్ర ట్రస్టు సూచించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా భద్రతా కారణాల దృష్ట్యా భక్తులు రావొద్దని కోరింది. ఈ నేపథ్యంలో అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట ఉత్సవాన్ని దేశమే కాకుండా, ప్రపంచం వీక్షించేలా న్యూస్ చానెళ్లు, యూట్యూబ్ చానెళ్ల ప్రతినిధులు ఇప్పటికే అయోధ్యలో వాలిపోయారు. దాదాపు వారం రోజులుగా ఏర్పాట్లు, ఇతర పూజా కార్యక్రమాలు, అయోధ్యలోని విశేషాలను లైవ్ కవరేజీ చేస్తున్నారు.
ఇప్పుడు సీల్వర్ స్క్రీన్‌పై..
ఇక టీవీ చానెళ్లతోపాటు జనవరి 22న నిర్వహించే బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని సిల్వర్ స్క్రీన్‌పై వీక్షించే అవకాశం కల్పింనున్నాయి పలు సంస్థలు. ప్రముఖ మల్టీఫ్లెక్స్ సంస్థలు, పీవీఆర్, ఐమ్యాక్స్ భక్తులకు ఈ అవకాశం కల్పించబోతున్నాయి. కేవలం రూ.100 చెల్లించి అయోధ్యలో జరిగే అద్భుత ఘట్టాన్ని వీక్షించే అవకాశం కల్పిస్తున్నాయి.
70 నగరాలు.. 170 థియేటర్లు..
దేశ వ్యాప్తంగా 70 ప్రధాన నగరాల్లోని 170 కంటే ఎక్కువ థియేటర్లలో అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట పండుగను వీక్షించేలా ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట వేడుక ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. ఈ మొత్తం వేడుకను బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశాన్ని కేవలం రూ.100తో మల్టీప్లెక్స్ సంస్థలు కల్పించబోతున్నాయి.
ప్రత్యక్షంగా చూడాలని ఆకాంక్ష…
రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రతీ హిందువు ప్రత్యక్షంగా చూడాలని భావిస్తారు. కానీ, ఆ అవకాశం అందరికీ లేనందున, దానిని కొంతైనా తీర్చాలన్న లక్ష్యంతో మల్టీప్లెక్స్ సంస్థలు బిగ్ స్క్రీన్‌పై ఆ మహత్తర ఘట్టాన్ని వీక్షించే అవకాశం కల్పిస్తున్నాయి. తద్వారా ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీవీఆర్ ఐమాక్స్ కో సీసీవో గౌతం దత్తా వివరించారు. ఆయా మల్టీప్లెక్స్‌ల అధికారిక వెబ్‌సైట్లలో, బుక్‌మైషో ప్లాట్‌ఫాం నుంచి ఈ టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది.