https://oktelugu.com/

ABN RK : కర్ణాటక గెలుపు క్రెడిట్ చంద్రబాబు, టీకాంగ్రెస్ కు.. ఇదీ ఆర్కే మార్క్ జర్నలిజం

ఇక అప్పట్లో రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ సభలో పాల్గొన్న తర్వాత.. హైదరాబాద్ కు వెళ్ళినప్పుడు రాధాకృష్ణ ఆయనను ఒక హోటల్లో కలిశారు. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రజ్యోతి పేపర్ లో ప్రాధాన్యం పెరిగింది.

Written By:
  • NARESH
  • , Updated On : May 14, 2023 / 08:24 AM IST
    Follow us on

    ABN RK : భారతీయ జనతా పార్టీని తూర్పారపట్టాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మా తగ్గుతుందని తేల్చేశాడు. జగన్ మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని హితవు పలికాడు. కెసిఆర్ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని సూచించాడు. కాంగ్రెస్ నాయకులు ఐక్యతగా ఉంటే ఏదైనా చేయగలరని చాటి చెప్పాడు. చంద్రబాబు నాయుడు అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందని స్పష్టం చేశాడు. పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవాలని సూచించాడు. ఇలా సాగిపోయింది ఈ ఆదివారం ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు.

    కర్ణాటక విజయంతో..
    కర్ణాటక విజయంతో రాధాకృష్ణ ఒక్కసారిగా తన కలాన్ని ఝులిపించాడు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని బతికించిందని కితాబు ఇచ్చాడు. అంతేకాదు నియంతృత్వం ఎల్లకాలం పనికిరాదని స్పష్టం చేశాడు. అంతేకాదు దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది నేతల ఆధిపత్యం ఎక్కువైందని, దీనిని ఇక్కడి ప్రజలు ఎల్లకాలం సహించబోరని గుర్తు చేశాడు.. కానీ ఇక్కడ ఆర్కే మరిచిపోయింది ఏంటంటే.. ఆ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది కూడా ఉత్తరాది ప్రాంతాల్లోనే.. భారతీయ జనతా పార్టీ విద్వేష రాజకీయాలు చేస్తోంది అని చెప్పే ఆర్కే.. పాత్రికేయుడై ఉండి దక్షిణాది, ఉత్తరాది అని విభజించడం ఏంటో ఆయనకే తెలియాలి. ఇక అప్పట్లో రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ సభలో పాల్గొన్న తర్వాత.. హైదరాబాద్ కు వెళ్ళినప్పుడు రాధాకృష్ణ ఆయనను ఒక హోటల్లో కలిశారు. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రజ్యోతి పేపర్ లో ప్రాధాన్యం పెరిగింది. ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి తన పేపర్లో వీలున్నంతవరకు ఎక్కువ స్పేస్ కేటాయిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని రాధాకృష్ణ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నట్టు ఆయన రాసిన కొత్త పలుకులో కనిపిస్తోంది.
    కెసిఆర్, జగన్ కు చురకలు
    అటు తాను కోరుకున్న కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ అధికారంలోకి రానివ్వలేదు. తనకు ఎంతో ఇష్టమైన చంద్రబాబు నాయుడుని జగన్ మోహన్ రెడ్డి కోలుకోనివ్వలేదు. తన ప్రయోజనాలకు అడ్డుపడ్డ వీరిద్దరూ అంటే రాధాకృష్ణకు ఎక్కడ లేని కోపం. పైగా ప్రధాని పేపర్ తయారీకి కావాల్సిన ముడి సరుకుపై పన్నులు పెంచాడు. దీంతో ఈ ముగ్గురు అంటే రాధాకృష్ణకు విపరీతమైన కంటగింపు.. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ విజయాన్ని పురస్కరించుకొని ఈ ముగ్గురిపై ఒంటి కాలు మీద లేచాడు. ప్రధానిని మొన్నటిదాకా శక్తిమంతుడని కీర్తించిన ఇదే రాధాకృష్ణ.. ఓడిస్తే ఓడిపోలేనంత గొప్ప నాయకుడు కాదని రాసుకొచ్చాడు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఇంతకాలం ప్రత్యక్షంగా, సహకారం అందిస్తున్న బిజెపి పెద్దలు ఇప్పుడు కర్ణాటక ఫలితాలు చూసిన తర్వాత అయినా విజ్ఞత ప్రదర్శిస్తారని రాధాకృష్ణ రాసుకొచ్చాడు. అంటే ఇన్ డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకు మీరు మద్దతు ఇవ్వాల్సిందే అని ఒక అల్టిమేటం ఇచ్చాడు. అంతేకాదు ఒకానొక దశలో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసిపోతే బిజెపి అవసరం లేదని స్పష్టం చేశాడు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు కాబట్టి మోదీ మ్యాజిక్ అనేది తగ్గిపోయిందని ఆర్కే సూత్రీకరించాడు. అంతేకాదు కర్ణాటక రాష్ట్రంలో అవినీతి తీవ్రంగా ప్రబలినప్పటికీ ప్రధానమంత్రి ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేయడం సరికాదని రాధాకృష్ణ నేరుగా కౌంటర్ ఇచ్చాడు. ఈ విషయంలో మాత్రం అతనితో ఏకీభవించక తప్పదు. ఇదే సమయంలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకపోవడం ముమ్మాటికి నరేంద్ర మోదీ తప్పు అని తేల్చేశాడు. ప్రధాని తన చరిష్మాను తానే తొక్కేసుకుంటున్నాడని ఆర్కే కుండబద్దలు కొట్టాడు.
    దూకుడు తగ్గొచ్చు
    “ఇక కర్ణాటక విజయంతో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన దూకుడు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలి అనుకుంటున్న ఆయన కొంతమేర సైలెంట్ అయ్యే అవకాశం ఉంది. కెసిఆర్ సపోర్ట్ చేసిన కుమారస్వామి ఓడిపోవడం ఇందుకు కారణం అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి లు ఊదుతుంది. కాంగ్రెస్ పార్టీ బలపడుతుందా లేదా అనేది పక్కన పెడితే కర్ణాటక రాష్ట్రంలో కన్నుడిగులు ప్రజాస్వామ్యానికి నూతన ఉత్సాహాన్ని కలిగించారని” రాధాకృష్ణ రాసుకొచ్చాడు. ఏది ఏమైనప్పటికీ తనకు ప్రయోజనం కలిగించే పని నెరవేరడంతో రాధాకృష్ణలో నూతన ఉత్సాహం తొణికిసలాడుతోంది. అది ఆయన కొత్త పలుకులో ధ్వనించింది. మరి ఆయన కోరుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ బలపడుతుందా? ప్రధాని గ్రాఫ్ మరింత తగ్గుతుందా? తెలుగుదేశం పార్టీ, జనసేన మళ్లీ చేతులు కలుపుతాయా? తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా? ఈ ప్రశ్నలకు రాధాకృష్ణ చెప్పే సమాధానం ఒక తీరుగా ఉండవచ్చు. కానీ కాలం చెప్పేదే అంతిమం కాబట్టి.. మరి కొద్ది రోజులు ఓపిక పడితే ఈ ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానం లభిస్తుంది.