PDA : బీజేపీ వ్యతిరేక కూటమికి ఆప్ షాక్.. రాహుల్ గాంధే కారణం

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ధీటుగా పురుడుబోసుకోనున్న కూటమికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పేట్రియాట్రిక్ డెమోక్రటిక్ అలయెన్స్.. పీడీఏ పేరిట రూపుదిద్దుకోనున్న కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ ఝలక్ ఇచ్చింది. విపక్ష కూటమికి నాయకుడిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్నుకుంటే మద్దతిచ్చేది లేదని తేల్చిచెప్పింది.

Written By: Dharma, Updated On : June 26, 2023 1:01 pm
Follow us on

PDA : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ధీటుగా పురుడుబోసుకోనున్న కూటమికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పేట్రియాట్రిక్ డెమోక్రటిక్ అలయెన్స్.. పీడీఏ పేరిట రూపుదిద్దుకోనున్న కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ ఝలక్ ఇచ్చింది. విపక్ష కూటమికి నాయకుడిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్నుకుంటే మద్దతిచ్చేది లేదని తేల్చిచెప్పింది. ఇటీవల బిహార్ లో బీజేపీ వ్యతిరేక పక్షాల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 15 పార్టీలు భేటీకి హాజరయ్యాయి. అన్ని పార్టీల కలయికతో పాటు అందర్నీ ఏకతాటిపైకి తెచ్చిన జేడీయూ అధ్యక్షుడు, బిహార్ సీఎం నితీష్ కుమార్ ను పీడీఏ కన్వీనర్ గా ఎన్నుకున్నట్టు తెలుస్తోంది.

సిమ్లాలో జరిగే తదుపరి సమావేశంలో ఈ కూటమికి పూర్తిస్థాయిలో ఓ రూపురానుంది. అయితే ఈ కూటమికి కాంగ్రెస్ ఒప్పుకుంటుందా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్న. గత 19 సంవత్సరాలుగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) మనుగడలో ఉంది. యూపీఏ చైర్ పర్సన్ గా సోనియా గాంధీ కొనసాగుతున్నారు. తాజాగా కాంగ్రెస్ తో పాటు 15 రాజకీయ పార్టీలు తెరపైకి వచ్చి పీడీఏ ఏర్పాటుకు నిర్ణయించాయి. కానీ కాంగ్రెస్ సమ్మతే ఇప్పుడు అసలుసిసలు ప్రశ్న. తమ పార్టీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ నేతలు కోరే అవకాశముంది. అయితే కాంగ్రెస్ అయితే తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని ఆప్ ప్రకటించింది. ఏకంగా ట్విట్టర్ లోనే ఆ పార్టీ కీలక నేత ప్రియాంక కక్కర్ వెల్లడించారు.

విపక్ష కూటమి సమావేశానికి ఆప్ అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ఢిల్లీలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు మద్దతు తెలుపుతాయని భావించింది. సమావేశానికి ఢిల్లీ ప్రధాని అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మన్, ఎంపీ సంజయ్ సింగ్, రాఘవ్ చడ్డా హాజరయ్యారు. మనలో ఉన్న విభేదాలన్నీ పక్కనపెట్టి ఎన్డీఏను గద్దెదించుతామని కేజ్రీవాల్ కాంగ్రెస్ నేత రాహుల్ ను కోరారు. ఢిల్లీలో కేంద్రం ఆర్డినెన్స్ విషయంలో మద్దతును కోరారు. కానీ రాహుల్ నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీనిపై కూలంకుషంగా చర్చించి చెబుతామని మాత్రమే రాహుల్ చెప్పుకొచ్చారు. దీంతో రాహుల్ వ్యవహార శైలిపై ఆప్ మండిపడుతోంది. రాహుల్ కు విపక్ష కూటమి పగ్గాలు అప్పగిస్తే తాము అంగీకరించేది లేదని.. ఆ కూటమిలో కలవమని కూడా ఆప్ ప్రకటించింది. దీంతో  విపక్షాలకు గట్టి షాక్ తగిలింది.