Medical Kidnapping Case: అతడు ఆమె గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. త్వరలో పెళ్లికూడా చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఆమెకు డబ్బులు అవసరం పడ్డాయి. సర్దుబాటు చేయమని ప్రియుడిని అడిగింది. అడిగింది ప్రియురాలు కాబట్టి అతడు కూడా సర్దుబాటు చేశాడు. సర్దుబాటు చేసిన డబ్బును తిరిగి ఇవ్వమనందుకు అతడు నివ్వెరపోయే విధంగా ఆమె వ్యవహరించింది. ఫలితంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
తీసుకుని డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరిన ప్రియుడిని.. తాజా ప్రేమికుడితో కలిసి ఓ యువతీ కిడ్నాప్ చేసేందుకు యత్నించింది. సంఘటన ఘట్కేసర్ పరిధిలో జరిగింది. మేడిపల్లి కి చెందిన కీసర అవినాష్ రెడ్డి పీర్జాదిగూడ బుద్ధ నగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమార్తె అరోషికా రెడ్డి అలి యాస్ అన్షిత రెడ్డి గతంలో ప్రేమించుకున్నారు. 2016 నుంచి 2021 వరకు వీరి మధ్య ప్రేమ, స్నేహం కొనసాగాయి. ఈ నేపథ్యంలో అన్షితా రెడ్డి తన అవసరాల కోసం ఆ అవినాష్ రెడ్డి వద్ద 25 లక్షలు తీసుకుంది. ఈ క్రమంలో అతన్ని దూరం పెట్టేసింది. మాదాపూర్ లో ఉండే సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ తో స్నేహం ఏర్పరచుకుంది. ఈ విషయం తెలుసుకున్న అవినాష్ రెడ్డి ఆమెతో విభేదించాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రేపు, మాపు అంటూ గడువు ఇచ్చిన అన్షితా రెడ్డి.. ఎలాగైనా అతడిని అంతం చేయాలని భావించింది. చక్రధర్ గౌడ్ తో కలిసి కిడ్నాప్ నకు పథకం వేసింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఘట్కేసర్ లోని వరంగల్_ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న ఒక హోటల్ వద్దకు వస్తే తీసుకున్న డబ్బులు ఇస్తామని అవినాష్ రెడ్డికి ఫోన్ చేశారు.
వారి మాటలు నిజమే అని నమ్మిన అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు. అవినాష్ రెడ్డి కారు దిగగానే తన అనుచరులతో మాటువేసి ఉన్న చక్రధర్ గౌడ్.. అతడిని బలవంతంగా కారులోకి ఎక్కించారు. ఈ సందర్భంగా వారి మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఘర్షణ జరిగి స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో కిడ్నాపర్లు అక్కడి నుంచి పారిపోయారు. బాధితుడు అవినాష్ రెడ్డి అక్కడి నుంచి తప్పించుకుని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తక్షణమే స్పందించిన పోలీసులు చక్రధర్ గౌడ్, తడి కారు డ్రైవర్ మామిండ్ల గౌతమ్ ను పీర్జాదిగూడలో అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇక చక్రధర్ గౌడ్ కు గతంలోనే పెళ్లయింది. ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అన్షితా రెడ్డిని అతడు ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. కాగా ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘట్కేసర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.