ప్రత్యర్థుల ఎత్తులను చిత్తుచేయడం..
పొరుగు దేశాలతో స్నేహహస్తం కొనసాగించడం..
సరిహద్దుల్లో శత్రుదేశాలకు దీటైన జవాబు ఇవ్వడం..
దేశ ప్రజల కోసం ఎంతటి నిర్ణయాలైనా తీసుకోవడం..
……..అదంతా మోడీకే చెల్లింది.
సింహం లాంటి రూపు ఆయన సొంతం..
పులి లాంటి కళ్లు ఆయన సొంతం..
ఆయనే ఓ ట్రెండ్ సెట్టర్..
ఆయన డ్రెస్సులు పబ్లిక్కు అట్రాక్షన్..
ఆహార్యం తెలిపే తెల్లగడ్డం..
ఆయన అందానికే అందం తెచ్చే కుర్తా పైజామా..
………ఇవన్నీ మోడీ సొంతం.
నరేంద్ర దామోదర్ దాస్ మోడీ.. మన దేశ ప్రధానమంత్రి. ఆయన ఏదీ చెప్పరు.. చేసి చూపిస్తారు అంతే. ప్రజల బాధలను ముందే తెలుసుకుంటారు. ముందే ఆ సమస్యలకు పరిష్కారమూ చూపుతారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు ప్రజల కష్టసుఖాలు అన్నీ తెలుసు. అందుకే.. ప్రజల మనస్సుల్లో మోడీ జీగా ముద్రపడ్డారు.
Also Read: న్యాయవ్యవస్థలోనూ అమరావతి భూకుంభకోణం లింకులు?
మోడీ 2001–-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశూభాయి పటేల్, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోదీకి తిరుగులేకుండాపోయింది. 2012 శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. 2000 నుంచి 2014 మే 21 నాడు రాజీనామా చేసేవరకు కూడా ఆయనే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టారు. 2014 మే 26న ప్రధానమంత్రి పీఠం అధిష్టించారు. 2019 ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.
తన ఐదేళ్ల పాలన తర్వాత.. 2019లో రెండో దఫా ఎన్నికలకు వెళ్లిన ఆయన .. తానే విజయం సాధిస్తానని ఎక్కడా చెప్పలేదు. సైలెంట్‌గా తనపని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు. చివరకు బంపర్ మెజార్టీ సాధించి రెండోసారి సింహాసనం ఎక్కారు. దేశంలో ఆరేళ్ల క్రితం మొదలైన నమో మానియా ఇంకా తగ్గలేదు. మోడీ క్రేజ్ ఇసుమంతయినా తగ్గలేదు. 2014లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ.. మరోసారి అంతే విశ్వాసంతో 2019 ఎలక్షన్లకు వెళ్లారు. తన ఐదేళ్ల పాలనపై మెజార్టీ ప్రజలు సంతోషంగా ఉన్నారన్న విశ్వాసంతో ముందుకు నడిచారు. విజయం సాధించారు. అక్కడ ఆ ఇంద్రుడు.. ఇక్కడ ఈ నరేంద్రుడు.. అన్నట్టు అఖండ మెజార్టీతో సింహాసనాన్ని మరోమారు అధిష్టించారు.
కొందరు మోడీ గ్రాఫ్ తగ్గిపోయిందన్నారు.. మళ్లీ 2004 పునరావృతం అవుతుందన్నారు… కానీ 2019 ఎలక్షన్ల ఫలితాలు మాత్రం విమర్శకుల నోళ్లు సైతం మూయించాయి. 543 స్థానాలకు గాను.. ఏకంగా బీజేపీ 303 స్థానాలను కైవసం చేసుకుని ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. గతం కంటే 21 సీట్లు అధికంగా గెలుచుకుని సత్తా చాటింది. మే 23న విడుదలైన భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలలతో మరోసారి ప్రపంచమంతా నరేంద్రమోడీ పేరు మార్మోగిపోయింది. 303 స్థానాలతో బీజేపీకి రికార్డు స్థాయి విజయం లభించింది. భాగస్వామ్య పక్షాలతో కలిపి బీజేపీ కూటమి ఎన్డీఏకు 353 సీట్లు వచ్చాయి. రెండుసార్లు అధికారం చేపట్టిన నరేంద్ర మోడీ ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రిపుల్ తలాక్ చట్టంతో మొదలు.. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు.. సిటిజన్‌షిప్ సవరణ చట్టం అమలు.. అయోధ్య వివాదానికి పరిష్కారం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలు సాధించారు. సుపరిపాలన, శాంతిభద్రతల నియంత్రణ, అభివృద్ధికి సంబంధించిన పలు చట్టాలు.. సవరణలను ఆమోదించడం చేశారు. ఏళ్ల తరబడి దేశంలో నలిగిపోయిన 58 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశారు. వాటిలో ఇవి కొన్నింటి గురించి తెలుసుకుందాం..
– 2014 సంవత్సరంలో పేదలకు బ్యాంకు ఖాతాలు, ఉచిత గ్యాస్ కనెక్షన్, ఉచిత విద్యుత్ కనెక్షన్, మరుగుదొడ్లు, ఇళ్లు అందించారు. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. వన్ ర్యాంక్ వన్ నేషన్, వన్ నేషన్ వన్ టాక్స్ -జీఎస్టీ లాంటివి అమలు చేశారు. రైతులకు కనీస మద్దతు కల్పించే డిమాండ్లను నెరవేర్చడంలో అంకితభావం చూపించారు.
Also Read: ఆశ్చర్యం.. మన ఎంపీలు జీతాల్లో కోత?
– తక్షణ విడాకులిచ్చే ఇస్లాం సంప్రదాయ ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే ముస్లిం మహిళల (మ్యారేజ్ రైట్స్ ప్రొటెక్షన్) బిల్లు –2019ను జూలై 25న లోక్‌సభ, 30న రాజ్యసభ ఆమోదించాయి. తలాక్ అనేది కాల దోషం పట్టిన మధ్యయుగం నాటి సంప్రదాయం. ట్రిపుల్ తలాక్‌ను అడ్డుపెట్టుకొని చాలా మంది ముస్లిం మగాళ్లు తమ భార్యల అభిప్రాయంతో సంబంధం లేకుండానే విడాకులు ఇచ్చారు. భార్యలను అనాగకరికంగా వదిలించుకునే ఈ దురాచారాన్ని మోడీ ప్రభుత్వం కూల్చివేసింది.
– జమ్మూకాశ్మీర్‌కు స్పెషల్ స్టేటస్ కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసే తీర్మానాన్ని, జమ్మూకాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లు–2019ను ఆగస్టు 6న పార్లమెంట్ ఆమోదించింది. దీంతో జమ్మూకాశ్మీర్‌పై 70 ఏళ్లుగా ఏ రాజకీయ పార్టీ చేయని సాహసాన్ని మోడీ సర్కార్ చేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్‌ను పూర్తిగా ఇండియాలో కలిపేశారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్న ప్రధాని నరేంద్రమోడీ… జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించడం ద్వారా ఆ దిశగా కీలక అడుగే వేశారు. అప్పటివరకూ జమ్ముకశ్మీర్‌లో దాయాది పాకిస్తాన్ చేస్తున్న ఆగడాలకు చెక్ పడింది. ఉగ్రవాదుల కదలికలు తగ్గిపోయాయి. పరిస్థితి మొత్తం కేంద్రం చేతుల్లోకి వచ్చేసింది. ఈ విషయంలో అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మోడీ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో దేశయువత దృష్టిలో హీరోగా నిలిచిపోయారు మోడీ.
– ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని అయోధ్యపై తీర్పు ఎన్డీయే 2 మొదటి ఏడాదిలోనే వచ్చింది. దీనిని పరిష్కరించేందుకు కాంగ్రెస్ ఏనాడూ ముందుకు రాలేదు. కానీ.. ప్రధాని మోడీ చొరవతో సుప్రీంకోర్టు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పరిష్కరించింది. అయోధ్యలోని రామ జన్మభూమి–బాబ్రీ మసీదు భూయాజమాన్య వివాదంపై సుప్రీం కోర్టు నవంబర్ 9న తుది తీర్పు వెల్లడించింది. 2.77 ఎకరాల వివాద స్థలం హిందువులే చెందుతుందని చరిత్రాత్మక తీర్పునిచ్చింది. మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సూచించింది.
– రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోడీ పేరు.. దేశంలోనే కాదు, ప్రపంచమంతా మార్మోగిపోయింది. అగ్రరాజ్యాధినేతలు సైతం మోడీని ప్రశంసల్లో ముంచెత్తారు. మోడీ తమ స్నేహితుడనీ.. గ్లోబల్ లీడర్‌గా మారుతున్నారని కితాబిచ్చారు. భీకర ఫామ్‌లో ఉన్న మోడీ.. ఇక తొలిదఫాను మించి విదేశీ పర్యటనలు చేస్తారని అంతా భావించారు. ఇక రెండో టర్మ్‌లో ప్రధాని మోడీ ఎవరి ఊహలకూ అందడంలేదు. విదేశీ పర్యటనల విషయంలోనూ అందరికీ షాకిస్తూ విభిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోడీ ఏ విదేశీ పర్యటనకూ వెళ్లకపోగా.. ఇతర దేశాధినేతలే ఇక్కడకు వచ్చారు.
– 2019, సెప్టెంబర్ 23న అమెరికాలోని హ్యూస్టన్‌లో ప్రవాస భారతీయుల నేతృత్వంలో ప్రధాని కోసం ఏర్పాటు చేసిన హౌడీ మోడీ కార్యక్రమం ఒక సెన్సేషన్. ఇంతవరకూ అమెరికాలో ఏ విదేశీ నేతకూ లభించని గ్రాండ్ వెల్కమ్.. ఈ ప్రోగ్రాం ద్వారా ప్రధాని మోడీకి లభించింది. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొని మోడీ తన ఆప్తమిత్రుడని ప్రకటించారు. దీంతో మోడీ పేరు విశ్వవ్యాప్తం అయ్యింది. ఇక ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండ్రోజుల భారత పర్యటనకు వచ్చారు. ఫిబ్రవరి 24న గుజరాత్‌కు వచ్చిన ట్రంప్.. ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిర్మించిన మొతెరా క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో… ప్రధాని మోడీతో కలిసి వేదిక పంచుకున్నారు. ఈ వేదిక ద్వారా మరోసారి తమ స్నేహబంధాన్ని చాటుకున్నారు. కీలక ఒప్పందాలు చేసుకున్నారు.
Also Read: పార్లమెంట్ సాక్షిగా ఏపీకి కేంద్రం హామీ
– పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్లలో మైనార్టీలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు భారత్ పౌరసత్వం ఇవ్వడానికి వీలు కల్పించే పౌరసత్వ చట్టానికి సవరణలు చేశారు.
– చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని ఏర్పాటు చేయడం వల్ల సైనిక దళాల మధ్య సమన్వయం పెరిగింది. అటు మిషన్ గగన్‌యాన్ కోసం కూడా భారత్ తన సన్నాహాలను వేగవంతం చేసింది.
– దేశంలోని రైతులు, వ్యవసాయ కూలీలు, చిన్న షాపుల వారు, అసంఘటిత రంగాల కార్మికులు, అందరికీ 60 ఏళ్ల వయసు నిండిన తర్వాత, ప్రతి నెలా 3 వేల రూపాయల ఫించన్ క్రమం తప్పకుండా చెల్లిస్తామని భరోసా ఇవ్వడం దేశ చరిత్రలో మొదటిసారి.
– చర్చల పేరుతో వెన్నుపోటు పొడిచిన డ్రాగన్ చైనాపై భారత్ ముప్పేట దాడికి దాగింది. మొదటి సారి 59 చైనా యాప్‌ల నిషేధంతో కమ్యూనిస్ట్ దేశం ఆర్థిక పునాదులను కదిలించింది. రెండోసారి 118కి పైగా చైనా యాప్‌లను బహిష్కరిస్తూ మోడీ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దుల్లోనూ చైనా వేస్తున్న ఎత్తుగడలకు దీటుగా సమాధానం ఇచ్చేందుకు మన సైన్యానికి సర్వ అధికారాలు కల్పించారు మోడీ. దీంతో సైన్యం ఏ మాత్రం తగ్గకుండా చైనాకు ఎప్పటికప్పుడు బదులు ఇస్తూనే ఉంది. ఎల్ఓసీ వెంట మన భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న చైనాను అడ్డుకుంటూనే ఉంది.
– కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి దాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ‘స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్’ నిధులు రిలీజ్ చేశారు. వైరస్‌ను కంట్రోల్ చేసేందుకు ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేశారు. తబ్లిగి జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న 960 మంది ఫారినర్ల టూరిస్ట్ వీసాలను బ్లాక్ లిస్టులో పెట్టారు. వీసా ఆంక్షలు మే 22 నుంచి సడలించి విదేశాల్లో చిక్కుకున్న ఇండియన్లు వచ్చేలా అనుమతిచ్చారు. వలస కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఎస్టీఆర్ఎఫ్ నిధులు ఖర్చు చేసేలా రాష్ట్రాలకు అనుమతిచ్చారు. 14.3 లక్షల మంది వసల కూలీలకు ఆశ్రయం కల్పించారు. 37,000లకు పైగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేయించారు. బస్సుల్లో వలస కూలీలు అంతర్రాష్ట్ర తరలింపునకు అనుమతులిచ్చారు. మే 1 నుంచి 2,600 శ్రామిక్ రైళ్లలో 35 లక్షలకు పైగా వలస కూలీలను వారి ప్రాంతాలకు తరలించారు. ఇటీవల రూ.20 లక్షల కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు.
మొత్తంగా దేశభక్తిలో.. హిందుత్వ శక్తిని సంఘటితం చేయడంలో.. ప్రజలను ఒక్కతాటిపైకి తేవడంలో.. ప్రత్యర్థులకు వెన్నుచూపని మొండి పట్టుదలలో మోడీ దేశానికే స్ఫూర్తిగా నిలిచాడు. వెన్నుచూపని భారతీయుడిగా నిలబడ్డారు. అందుకే మోడీ పిలుపునివ్వగానే యావత్ భారత్ లాక్ డౌన్ లోకి వెళ్లింది. ఆయన పిలుపుతో చప్పట్లు కొట్టింది.. ఆయన వెంట నడిచింది. ప్రధాని నరేంద్రమోడీ పుట్టినరోజు (సెప్టెంబర్ 17) సందర్భంగా ఆయనకు మనసారా oktelugu.com తరుఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Namo modi a backless indian
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com