Baththa Movie review: మక్కల్ సెల్వన్ గా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతికి.. దక్షిణాదిలోనే కాదు.. బాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈయన చేసే ప్రతి సినిమా విభిన్నంగా ఉంటుంది. అందువల్లే ఈయనకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. డిఫరెంట్ స్టోరీలను ఎంచుకోవడం.. సన్నివేశాలకు తగ్గట్టుగా యాక్టింగ్ చేయడం ఇతడికి కేక్ వాక్ లాంటిది. తాజాగా విజయ్ సేతుపతి(Vijay Sethupathi) బత్తా(Baththa Movie) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ లో చూద్దాం.
కథ ఎలా ఉందంటే..
1980 కాలంలో మద్రాస్ ఏరియాలో భక్తవత్సలం అలియాస్ బత్తా(విజయ్ సేతుపతి) రౌడీయిజం చేస్తుంటాడు. జనాలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాడు. తనకు ఎవరైనా అడ్డుగా వస్తే తీవ్రంగా కొడుతూ ఉంటాడు. ఇదే సమయంలో జ్యోతి అనే వ్యక్తిపై విజయ్ సేతుపతి దాడి చేస్తాడు. దానిని శబరి (మాస్టర్ సాయి పృధ్వీరాజ్) అనే విద్యార్థి చూస్తాడు. ఇప్పటినుంచి బత్తా పేరు వినిపిస్తే చాలు శబరి భయపడిపోతుంటాడు. అతడు కొట్టిన దృశ్యాలు కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో శబరి భయం భయంగా స్కూలుకు వెళుతూ ఉంటాడు. కొద్దిరోజులు అయిన తర్వాత శబరి చదివే పాఠశాలకు సమ్మర్ హాలిడేస్ ఇస్తారు.
బత్తా కు భార్య కన్నిమ(లిజో మోల్ జోస్), తేను అనే కూతురు ఉంటారు. తేను ను బత్తా విపరీతంగా ప్రేమిస్తూ ఉంటాడు. అయితే ఆమెకు ఓణీల వేడుక జరపాలని అనుకుంటాడు. ఏర్పాట్లు చేస్తుండగా అతడికి దారుణమైన పరిస్థితి ఎదురవుతుంది. అనుకోకుండా అతడు శబరి చదివే పాఠశాలకు అత్యంత రహస్యంగా వెళ్తాడు. బత్తా అక్కడికి వెళ్తున్న సమయంలో శబరి కూడా స్కూల్ కి వస్తాడు. ఒక టీచర్ తన నుంచి లాక్కొని దాచిపెట్టిన బొమ్మను తెచ్చుకోవడానికి స్టాఫ్ రూమ్ లోకి వెళ్తాడు శబరి. అక్కడి బాత్రూంకు బయట నుంచి తలుపు వేస్తాడు శబరి. అదే సమయంలో లోపలి నుంచి ఎవర్రా నేను లోపల ఉన్నాను.. తలుపు ఎందుకు వేశారు.. ఇంతకీ నేను ఎవరో తెలుసా.. బత్తాను.. బయటికి వస్తే చంపేస్తాను.. అని విజయ్ సేతుపతి గట్టిగా కేకలు వేస్తాడు. దీంతో శబరి మరోసారి తీవ్రంగా భయపడతాడు. అయితే విజయ్ సేతుపతి ఎంత గట్టిగా అరిచినా సరే బయటికి ఎవరికీ పెద్దగా వినపడదు. స్కూలుకు సెలవులు ఇవ్వడంతో లోపలికి ఎవరూ రారు. మరోవైపు విజయ్ సేతుపతి కనిపించకపోవడంతో.. ఆయన భార్య.. కూతురిలో ఆందోళన మొదలవుతుంది. ఈ నేపథ్యంలో అతని కోసం పోలీసులు.. అతని బృందంలో పనిచేసే వారంతా వెతుకుతారు..
విజయ్ సేతుపతి బయటికి వచ్చాడా.. బందీగా ఎన్ని రోజులు అందులో ఉన్నాడు.. అతడు బయటపడ్డాడా.. అన్ని రోజులపాటు ఎలా బతికి బట్ట కట్ట కలిగాడు.. బయటికి వచ్చిన తర్వాత అతడు ఎలాంటి మార్పును చూపించాడు.. తాను బాత్రూంలో ఉండగానే బందీగా ఉంచిన వ్యక్తి ఎవరో విజయ్ సేతుపతి కనుక్కోగలిగాడా.. అసలు విజయ్ సేతుపతి రహస్యంగా స్కూల్ బాత్రూం దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. అక్కడికి ఎందుకు వెళ్లావు అని అడిగితే ఎందుకు సమాధానం చెప్పడు.. ఈ విషయాలను ఒక్కొక్కటిగా వివరించుకుంటూ దర్శకుడు అత్యంత హ్యూమన్ ఎమోషన్ తో ఈ సినిమాను రూపొందించారు.
అద్భుతంగా రూపొందించారు
ఒక మనిషి రాక్షసుడిగా మారడం పెద్ద కష్టం కాదు. కానీ రాక్షసుడి నుంచి మనిషిగా మారడం చాలా కష్టం. అలా మారిపోనంతవరకు ఆ మనిషి గర్వంతో విర్రవీగుతూ ఉంటాడు. ఒక్కసారిగా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే.. తన బలహీనత అర్థమవుతుంది. సహాయం కోసం ఎవరినైనా ప్రాధేయ పడేందుకు సిద్ధమవుతాడు. క్షమాగుణాన్ని అలపరుచుకుంటాడు. విజయ్ సేతుపతి తనకు ఈ పరిస్థితి ఎదురు కావడంతో ఎలా మారిపోయాడు.. ఈ సన్నివేశాలను దర్శకుడు చాలా అందంగా రూపొందించాడు. రౌడీయిజం.. కుటుంబం.. అనుబంధం ఈ మూడింటి మధ్య దృశ్యాలను దర్శకుడు చాలా చక్కగా రూపొందించాడు. అయితే మధ్యలో కొన్ని సన్నివేశాలు నిదానంగా ఉన్నప్పటికీ.. తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది కాబట్టి.. సినిమాను అదేపనిగా చూడాలి అనిపిస్తుంది. మరోవైపు విజయ్ సేతుపతి స్కూల్ బాత్రూంలో ఇరుక్కుపోయిన తర్వాత.. కథ మరో మలుపుతీసుకుంది. ఇక ఇక్కడి నుంచి చివరి వరకు దర్శకుడు ఉత్కంఠను కలిగించడంలో నూటికి నూరు శాతం విజయవంతం అయ్యాడు.
విజయ్ సేతుపతిని బంధించింది శబరి అనే విషయం తెలుస్తుందా.. ఆ విషయం తెలిస్తే ఆ కుర్రాడిని ఏం చేస్తాడు.. ఇవన్నీ కూడా ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగిస్తుంటాయి. విజయ్ సేతుపతి మనిషిగా మారడం.. భార్య ఎదుట తలవంచుకొని నన్ను క్షమించు అనే దృశ్యాలు.. కన్నీళ్లను తెప్పిస్తాయి. విజయ్ సేతుపతి.. శబరి మధ్య ఉన్న అనుబంధాన్ని స్క్రీన్ మీద చూపించిన విధానం కూడా గొప్పగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే మహారాజా సినిమా మాదిరిగానే ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుంది. ఇక ముగింపు సన్నివేశాలలో విజయ్ సేతుపతి స్కూల్ బాత్రూం కి ఎందుకు వెళ్లాడు అనే ప్రశ్నలకు సమాధానం చెబుతాయి. ఇక విజయ్ సేతుపతి ఎందుకు రౌడీగా మారిపోయాడు.. తనకు ఉన్న కల ఏంటి.. దానిని సాకారం చేసుకోవడానికి అతడు ఏం చేశాడు.. ఈ దృశ్యాలు గుండెను కదిలిస్తాయి.. బాత్రూం నుంచి బయటికి వచ్చిన తర్వాత విజయ్ సేతుపతి ఆకలికి తట్టుకోలేక పచ్చడి మెతుకులు తింటాడు. ఆ సమయంలో అతడి భార్య కారంగా ఉందా అని అడిగితే.. అమృతం మాదిరిగా ఉందని చెబుతుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల ఫీలింగ్ కూడా చివర్లో అలానే ఉంటుంది.
నటీనటుల ప్రదర్శన ఎలా ఉందంటే
విజయ్ సేతుపతి మరోసారి తన సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. తనను స్టార్ నటుడు అనకూడదని.. ఫర్ఫెక్ట్ యాక్టర్ అని మాత్రమే అనాలని ఈ చిత్రం ద్వారా మరోసారి నిరూపించాడు. తనకు విపరీతమైన స్టార్ డం ఉన్నప్పటికీ.. బాత్రూంలో ఇరుక్కుపోయిన వ్యక్తిగా.. సహాయం కోసం వేడుకొనే పాత్రను అంగీకరించడం ఒక రకంగా అతనికి నటన పట్ల ఉన్న మక్కువ కు నిదర్శనం శబరిగా మాస్టర్ సాయి పృధ్వీరాజ్ అదరగొట్టాడు. లిజో మోల్ జోస్ పాత్ర కూడా సినిమాకు తగ్గట్టుగా ఉంది.
ఈ సినిమాకు తరుణి తరణ్ దర్శకత్వం వహించారు. గతంలో ఇతడు విజయ్ సేతుపతి తో కలిసి నడువుల కొంజం పక్కత్త కానొం, సీత కత్తి అనే సినిమాలను రూపొందించారు. ఈ సినిమాలో కూడా అతడి రైటింగ్ అదరగొడుతుంది. ఈ సినిమా నిడివి దాదాపు 156 నిమిషాలు. 45 నిమిషాల సినిమాను మొత్తం బాత్రూంలో నడిపించడం మామూలు విషయం కాదు.. ఆయన ఈ సినిమా ఉత్కంఠ గా ఉంటుంది. ఇక సాయి అభ్యంకర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
ఈ సినిమా ఓటీటీ లో నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను నిరభ్యంతరంగా కుటుంబ సభ్యులతో కలిసి చూడొచ్చు.
విజయ్ సేతుపతి, మాస్టర్ సాయి పృధ్వీరాజ్ నటన
కథనంతోపాటు ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు.. భావోద్వేగాలు.. క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన బలం.
ఎంట్రీ సీన్లు.. మధ్యలో సినిమా కొంచెం స్లోగా ఉండటం మైనస్ పాయింట్లు..
ఫైనల్ టచ్.. బత్తా .. గుండె తట్టి లేపే సినిమా