https://oktelugu.com/

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా? బలమెంత?

ఏపీలోని విశాఖ స్టీల్ పరిశ్రమను ప్రైవేటీకరిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్.. అట్టుడుకుతున్న ఆంధ్రాను చూసి ధైర్యం చేసి మరీ తిరుపతి ఉప ఎన్నికల బరిలో నిలుస్తోంది. స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరించవద్దని ఏపీ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. విశాఖలో అయితే ఇంకా ఆందోళన ఉధృతం అవుతోంది. అయితే ఇంత వ్యతిరేకత  ఏపీలో బీజేపీపై ఉన్నా కూడా తిరుపతిలో బీజేపీ అభ్యర్థిని నిలబెడుతుండడం చర్చనీయాంశమైంది. అటు బీజేపీ.. ఇటు జనసేనలు కమిట్ అయ్యి ఈ సీటులో బీజేపీని […]

Written By:
  • NARESH
  • , Updated On : March 13, 2021 / 03:15 PM IST
    Follow us on

    ఏపీలోని విశాఖ స్టీల్ పరిశ్రమను ప్రైవేటీకరిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్.. అట్టుడుకుతున్న ఆంధ్రాను చూసి ధైర్యం చేసి మరీ తిరుపతి ఉప ఎన్నికల బరిలో నిలుస్తోంది. స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరించవద్దని ఏపీ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. విశాఖలో అయితే ఇంకా ఆందోళన ఉధృతం అవుతోంది.

    అయితే ఇంత వ్యతిరేకత  ఏపీలో బీజేపీపై ఉన్నా కూడా తిరుపతిలో బీజేపీ అభ్యర్థిని నిలబెడుతుండడం చర్చనీయాంశమైంది. అటు బీజేపీ.. ఇటు జనసేనలు కమిట్ అయ్యి ఈ సీటులో బీజేపీని పోటీకి నిలబెట్టడమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక బీజేపీకి అనేక రకాలుగా పరీక్ష కానుంది. ఇక్కడ బీజేపీ గెలుస్తుందా? లేదా అన్న డౌట్లు అందరిలోనూ ఉన్నాయి. ఈ  బీజేపీకి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? బీజేపీ బలం ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

    ఏపీలోని పంచాయతీ ఎన్నికల్లో జనసేన సత్తా చాటగా.. బీజేపీ తేలిపోయింది. దీన్ని బట్టి బీజేపీ కంటే జనసేననే బెటర్ అన్న అంచనాలున్నాయి. అయితే జనసేన వైదొలిగి బీజేపీ నిలబడడాన్ని జనసైనికులు అస్సలు తట్టుకోవడం లేదు. బీజేపీపై ఏపీ ప్రజల్లో పీకల్లోతు కోపం ఉంది. దీంతో తిరుపతిలో గెలుపు బీజేపీకి అంత ఈజీ కాదు.. అదే సమయంలో టీడీపీని తోసిరాజని రెండో స్థానం కష్టమేనన్న అంచనాలున్నాయి. ఇక డిపాజిట్ కూడా దక్కదు అనే వారు కూడా ఉన్నారు.

    తెలంగాణలోని దుబ్బాక, జీహెచ్ఎంసీలో గెలుపుతో బీజేపీ జోష్ మీదుంది. ఏపీలోనూ అలాగే గెలుస్తామని అంటున్నా ‘విశాఖ స్టీల్ పరిశ్రమ’ ఎఫెక్ట్ బాగా పడుతోంది. జీరో నుంచి మొదలైన బీజేపీ ప్రస్థానం ఏపీలో ఎదగడం కష్టమేనని అంటున్నారు. ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన చరిత్ర బీజేపీ నేతల సొంతం. అలాంటిది ఇప్పుడు చరిత్రను తిరగరాస్తుందా. ? పునరావృతం చేస్తుందా అన్నది తిరుపతి ఉప ఎన్నికతో తేలిపోనుంది.

    నెలరోజులుగా సోషల్ ఇంజినీరింగ్ లో రాటుదేలిన సునీల్ దియోధర్ వంటి బీజేపీ నేతలు గత కొద్ది నెలలుగా తిరుపతిలో మకాం వేసి బూత్ లెవల్ రిపోర్టులను తెప్పించుకొని మరీ కష్టపడుతున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణే ఇప్పుడు బీజేపీ కొంప ముంచే పరిణామంగా మారిందంటున్నారు.

    ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు టీడీపీని ఢీకొట్టినంత బలంగా వైసీపీని కొట్టడం లేదు. జగన్ పై అంత తీవ్రంగా పోరాడడం లేదన్న అపవాదును మూటగట్టుకున్నారు. అయితే తిరుపతిలో ప్రధాన పోటీ జగన్ వైసీపీ పార్టీతోనే కావడంతో ఇప్పుడు టీడీపీ ప్లేసును భర్తీ చేయడమే సోము వీర్రాజు ముందున్న అసలు సవాల్ గా మారింది.

    తిరుపతిలో కులాల పరంగా చూస్తుంటే బీజేపీ తో పోలిస్తే జనసేనకు కొంత అడ్వాంటేజ్ ఉందనే విశ్లేషణలు సాగుతున్నాయి. అయినా టికెట్ తీసుకోవడం చూస్తే ఈ పరిణామం వైసీపీకి మేలు చేసేలా ఉందన్న వాదన కూడా వ్యక్తమవుతోంది.

    తెలంగాణలో బండి సంజయ్ దూకుడుగా వెళుతూ అధికార టీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యగా మారి ప్రత్యామ్మాయంగా ప్రజల ముందు కనపడుతూ విజయాలు అందుకుంటున్నారు. దీంతో ఇప్పుడు సోము వీర్రాజుపై ఒత్తిడి పెరిగింది. బండి సంజయ్ కు సమానంగా సోము వీర్రాజు నిలబడుతాడా? అన్నది తిరుపతి ఉప ఎన్నిక తేల్చనుంది.

    గతంలో చిరంజీవి సైతం తిరుపతిలో గెలిచారు. ఆ సామాజికవర్గం ఆయనకు అండగా నిలబడింది. అందుకే తిరుపతిలో జనసేన అభ్యర్థి నిలబడితే ఫలితం వేరే ఉండేదని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సీటు బీజేపీకి పోవడంతో ఇప్పుడు జనసేన నేతలు ఇష్టం లేని ఈ బంధాన్ని నిలబెడుతారా? పడుగొడుతారా? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జీమెచ్ఎంసీలో వదులకొని తిరుపతిలోనూ త్యాగం చేసిన జనసైనికులు ఖచ్చితంగా ఆగ్రహంతో ఉంటారని.. బీజేపీకి సహకరించే పరిస్థితి లేదని అంటున్నారు.

    దీంతో తిరుపతిలో గెలుపు బీజేపీకి అంత ఈజీ కాదన్న ప్రచారం సాగుతోంది. బలమైన పరీక్షలో బీజేపీ గెలుస్తుందా? అసలు డిపాజిట్ అయినా దక్కుతుందా.? 2019లా రిపీట్ అవుతుందా? అన్నది తేలిపోనుంది. ఏపీ భవిష్యత్ రాజకీయాలకు తిరుపతి ఉప ఎన్నిక కీలకం కానుంది. బీజేపీ భవితవ్యం కూడా తేలనుంది.