Homeఅత్యంత ప్రజాదరణఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదంటే?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదంటే?

తెలంగాణలో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. ఈ క్రమంలోనే ఓటింగ్ సరళి.. పడిన ఓట్లను బట్టి గెలుపు ఎవరిది అనేది దాదాపు క్లియర్ కట్ గా తెలిసిపోయింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్ తప్పదన్న చర్చ సాగుతోంది. ఇక దుబ్బాక, జీహెచ్ఎంసీలో గెలిచి ఈ రెండు సీట్లలో ధీమాతో ఉన్న బీజేపీకి ఈసారి కష్టమేనంటున్నారు. కాంగ్రెస్ అంతంత మాత్రంగానే ఉన్న ఈ రెండు సీట్లలో ఇద్దరు ప్రొఫెసర్ల గెలుపు ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఇంతకీ వారు ఎవరు? ఎందుకు గెలవబోతున్నారన్నది చూద్దాం..

తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటరు తీర్పు బ్యాలెట్లలో నిక్షిప్తమైంది. మరికొద్ది గంటల్లోనే ఫలితం రాబోతోంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాధారణ ఎన్నికల వలె మొదటి సారి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఆర్ఎస్ లో కొంత అలజడి మొదలైంది అని చెప్పవచ్చు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలిచి ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని స్పష్టమైన సంకేతాలు పంపాలని వ్యూహాలు రచించారు. ఇందులో భాగంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి సిట్టింగ్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని మరోసారి బరిలోకి దించారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం లో అనూహ్యంగా పి.వి కూతురు వాణి దేవి నిఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. వాణి దేవి గెలుపును మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లకు అప్పగించారు.

మంత్రులు సభలు సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారాన్నిహోరెత్తించారు. ప్రధానంగా ఈ ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటలతూటాలు పేలాయి. రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని టీఆర్ఎస్ ఆరోపిస్తే టీఆర్ఎస్ అసమర్థ పాలన వల్లే తెలంగాణ ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని బీజేపీ ఆరోపించింది. ఐటీఐఆర్ సహా విశాఖ ఉక్కు వరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ లక్ష్యంగా పదునైనవిమర్శలు చేశారు. ఈ విమర్శలకు బీజేపీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూటీఆర్ఎస్ పై ప్రతి విమర్శలు చేశారు.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.. వరంగల్,ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో నిలవగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 93 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. పట్టభద్రులు ఎటువైపు నిలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటింగ్ కు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండడంతో తెర వెనుక మంతనాలు ప్రారంభించారు. ఎక్కువ శాతం పట్టభద్రులు రాజధాని హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో నివాసం ఉంటున్నారు. విద్య, ఉపాధి,ఉద్యోగ, వ్యాపార తదితర రంగాల్లో స్థిరపడేందుకు గ్రామాలను వదిలి వెళ్లినా ఓటు నమోదు మాత్రం తమ గ్రామంలోనే చేసుకున్నారు. ఈఎన్నికల్లో వారి ఓట్లు కీలకం కానున్నాయి.

విజయంపై ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టభద్రులుఎవరి వైపు నిలిచారో తేలాలంటే రేపు కౌంటింగ్ లో తేలనుంది. ప్రధానంగా చూస్తే.. నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌లో గిరిజన నేత రాములునాయక్‌కు టికెట్‌ ఇవ్వడం కలసి వస్తుందని, పోలింగ్‌ సరళి కూడా ఇదే చెబుతోందని గాంధీభవన్‌ వర్గాలంటున్నా యి. సామాజిక కోణంలో ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీని ఆదరించారని కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెబుతున్నారు. రంగారెడ్డి–హైదరాబాద్‌–మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్, బీజేపీల నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులుండటం, మరో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నేతకు తాము టికెట్‌ ఇవ్వడం లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. పాలమూరు జిల్లాలో స్థానికత పనిచేసిందని, రాజకీయంగా తమ అభ్యర్థి చిన్నారెడ్డి అనుభవజ్ఞుడు కావడం లాభించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌పై ఎలాగూ వ్యతిరేకత ఉందన్న ధీమా కాంగ్రెస్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

-నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌లో కోదండరాం గెలుపు ఖాయమా?
పోలింగ్‌ జరిగిన సరళిని బట్టి నల్లగొండ నుంచి ప్రొఫెసర్‌ కోదండరాం గెలుస్తారనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఇక్కడ ప్రథమ ప్రాధాన్యత ఎవరికి వేసినా, రెండో ప్రాధాన్యత కింద ప్రొఫెసర్‌ను ఎంచుకున్నారనే చర్చ జరుగుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో ఆయనకున్న సంబంధాలు, తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్రను పరిగణనలోనికి తీసుకుని పట్టభద్రుల పోలింగ్‌ జరిగిందనే వాదన ఆసక్తిని కలిగిస్తోంది.

-హైదరాబాద్‌–రంగా రెడ్డి–మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ యేనా?
హైదరాబాద్‌–రంగా రెడ్డి–మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ గెలుపుపై కూడా పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రథమ ప్రాధాన్యత ఎవరికి వేసినా, రెండో ప్రాధాన్యత కింద నాగేశ్వర్‌ను ఎంచుకున్నారనే ప్రచారం పట్టభద్రుల్లో సాగుతోంది.. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్ని ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వస్తాయి… వారికి ప్రథమ ప్రాధాన్యత కింద వచ్చిన ఓట్లలో తమకు ఎన్ని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు వస్తాయన్న దానిపై ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular