https://oktelugu.com/

ఏ పత్రిక చూసినా ఏమున్నది గర్వకారణం?

ఏ పత్రిక చూసినా ఏమున్నది గర్వకారణం అని ఇప్పుడు జర్నలిస్టులంతా నిట్టూరుస్తున్న పరిస్థితి దాపురించింది. ఎందుకంటే కరోనా ధాటికి అన్నింటికంటే దెబ్బ పడింది ‘పత్రికలపైనే’. కరోనా మొదలు కాగానే పత్రికల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని ప్రచారం జరగడంతో జనాలు వేసుకోవడం మానేశారు. దీంతో సర్క్యూలేషన్ పడిపోయింది. ఈ క్రమంలోనే టీడీపీకి అనుకూలంగా ఉండే తెలుగులోనే నంబర్ 1 పత్రిక జిల్లా సంచికలను (టాబ్లాయిడ్) ఎత్తివేసి బ్రాడ్ షీట్లకు మార్చేసింది. వందల మంది జర్నలిస్టులను రోడ్డున పడేసింది. ఉద్యోగాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 4, 2021 / 09:00 PM IST
    Follow us on

    ఏ పత్రిక చూసినా ఏమున్నది గర్వకారణం అని ఇప్పుడు జర్నలిస్టులంతా నిట్టూరుస్తున్న పరిస్థితి దాపురించింది. ఎందుకంటే కరోనా ధాటికి అన్నింటికంటే దెబ్బ పడింది ‘పత్రికలపైనే’. కరోనా మొదలు కాగానే పత్రికల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని ప్రచారం జరగడంతో జనాలు వేసుకోవడం మానేశారు. దీంతో సర్క్యూలేషన్ పడిపోయింది. ఈ క్రమంలోనే టీడీపీకి అనుకూలంగా ఉండే తెలుగులోనే నంబర్ 1 పత్రిక జిల్లా సంచికలను (టాబ్లాయిడ్) ఎత్తివేసి బ్రాడ్ షీట్లకు మార్చేసింది. వందల మంది జర్నలిస్టులను రోడ్డున పడేసింది. ఉద్యోగాలు పోయి వారంతా ధర్నాలు చేసిన పరిస్థితిని మనం చూశాం..

    Also Read: విజయసాయిరెడ్డి చేసిన పనికి వెంకయ్యనాయుడు ఏం చేశాడంటే?

    ఇక అగ్రపత్రిక బాటలోనే అదే టీడీపీ అనుబంధ దమ్మున్న పత్రిక కూడా నడిచింది. జర్నలిస్టులను ‘హోల్డ్’ పేరుతో సాగనంపి కరోనా తగ్గితే తీసుకుంటామని ఇప్పటికీ ఏడాది గడిచినా వారిని పిలవలేదు.. జీతాలు ఇవ్వలేదు. అలా వందల మంది జర్నలిస్టులను ఆ దమ్మున్న జర్నలిస్ట్ సారథ్యంలో నడుస్తున్న పత్రిక చాకచక్యంగా వదిలించుకుంది.

    ఇక ఈ రెండు టీడీపీ అనుకూల అగ్రపత్రికలను ఎదురించి కరోనా టైంలోనే అధికార పార్టీల పత్రికలు జిల్లా సంచికలను (టాబ్లాయిడ్) ప్రారంభించేశాయి. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల పత్రికలు కావడం.. ఆర్థికంగా ఉండడంతో ఈ పత్రికలు బాగానే నిలబడ్డాయని అందరూ అనుకున్నారు.

    కానీ ట్విస్ట్ ఏంటంటే కొన్ని నెలల కిందటే తెలంగాణ అధికార పార్టీ పత్రికలో ట్రాన్స్ ఫర్ల పేరిట సగం జర్నలిస్టులను తగ్గించేశారు. ఇక ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ పత్రిక మాత్రం జర్నలిస్టులను తీసివేయకుండా టాబ్లాయిడ్ లను ఎత్తివేయకుండా ఇన్నాళ్లు బాగానే కాపు కాసింది.

    కానీ ఇప్పుడు నష్టాలు వచ్చాయో లేక.. భారం మోయలేకపోతున్నారో కానీ ఏపీ అధికార పార్టీ పత్రిక కూడా తగ్గించుకునే పనిలో పడిందని జర్నలిస్టులు వాపోతున్నారు. తాజాగా జిల్లాల్లో ఉన్న జర్నలిస్టులను రాష్ట్రం ఇటు మూల ఉంటే అటు మూలకు ట్రాన్స్ ఫర్లు పేరిట సాగనంపుతున్నారు. అంతేకాదు.. రేపటి నుంచి (5వ తేది) నుంచి ఆ పత్రిక జిల్లా సంచిక( టాబ్లాయిడ్)ను ఎత్తివేసి మిగతా టీడీపీ పత్రికలలాగే బ్రాడ్ షీట్ మెయిన్ పేజీలోనే వార్తలను కలిపేస్తోంది. అంటే జిల్లా సంచికలు లేకుండా ఇస్తుందన్నమాట.. దీని తర్వాత ఎక్కువగా ఉన్న జర్నలిస్టులను కూడా తీసివేస్తుందన్న మాట..

    Also Read: ఆ పార్టీల మధ్య అండర్‌‌ స్టాండింగ్‌ లోపిస్తోందా..?

    ఇలా ప్రతిపక్ష పార్టీల పత్రికలే కాదు.. అధికార పార్టీ పత్రికలకు కూడా పత్రికలు నడపడం ఇప్పుడు కానకష్టమవుతోంది. ఏ పత్రిక చూసినా ఏమున్నది గర్వకారణం అని జర్నలిస్టులు మిత్రులు వాపోతున్నారు.ట్రాన్స్ ఫర్లు అయిన వారు ఇక పూర్తిగా ఈ అగాథం లాంటి జర్నలిజాన్ని వదిలేసి వేరే వ్యాపారాలు చూసుకుంటామంటున్నారు.

    మొత్తం వ్యవస్థలను కుప్పకూల్చే పత్రికలనే కరోనా కూల్చేసింది.. ఆ కరోనా ధాటికి జర్నలిస్టులను పత్రికా యాజమాన్యాలు రోడ్డున పడేశాయి. మొత్తంగా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఇప్పుడు జర్నలిస్టులు రోడ్డున పడడానికి పెరిగిన డిజిటల్ వార్త స్రవంతి ఒక కారణం కాగా.. పత్రికలకు ఆదరణ లేక ఎదురైన గడ్డు పరిస్థితులు మరో కారణంగా చెప్పొచ్చు.

    ఉద్యోగాలు కోల్పోయిన జర్నలిస్టులు అధైర్యపడకుండా అందివచ్చిన డిజిటల్ మీడియాను అందిపుచ్చుకుంటే వారి జీవితాలు బాగుపడుతాయి. ఈ జర్నలిజమే వద్దనుకుంటే సుబ్బరంగా కష్టపడి ఏదైనా పని చేసుకోవచ్చు. ఇదే జరిగితే.. మొత్తం జర్నలిజం, జర్నలిస్టులు అనే వారు తగ్గిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మార్పుకు అనుగుణంగా మారిన వారే ఈ ఇండస్ట్రీలో నెగ్గగలుగుతారు.. ఆ మార్పును అందిపుచ్చుకోని వారు కనుమరుగైపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

    -నరేశ్