
చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరినీ వేధించే ఆరోగ్య సమస్యల్లో జలుబు కూడా ఒకటి. ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా జలుబు త్వరగా తగ్గదు. వర్షం పడుతున్నా, వాతావరణం చల్లగా ఉన్నా జలుబు బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జలుబు చిన్న ఆరోగ్య సమస్యే అయినప్పటికీ ఈ సమస్య వల్ల పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. సాధారణ జలుబు ఉన్నవాళ్లు జింక్ బిళ్లలు చప్పరించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే కొన్ని వంటింటి చిట్కాలను పాటించడం ద్వారా జలుబు సమస్య నుంచి తక్కువ సమయంలో బయటపడవచ్చు.
జలుబుతో బాధ పడుతున్న సమయంలో సాధారణ నీటిని తాగటం కంటే వేడినీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. వేడినీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగినా ఇమ్యూనిటీ పెరిగి మంచి ఫలితం ఉంటుంది. నీటిలో దాల్చినపొడిని కలిపి తీసుకోవడం ద్వారా కూడా వీలైనంత తక్కువ సమయంలో జలుబు నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
జలుబును త్వరగా తగ్గించుకోవడానికి ఆవిరి పట్టడం ద్వారా పరిష్కారం లభిస్తుంది. ఆవిరి పట్టడం ద్వారా ముక్కులో మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకోవడంతో పాటు తక్కువ సమయంలో మంచి ఫలితం ఉంటుంది. ఆవిరి పట్టే సమయంలో జండూబామ్, పసుపు, యూకలిప్టస్ ఆయిల్ లాంటివి వినియోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పసుపు కలుపుకుని తాగిన పాలు సైతం ఈ జలుబు సమస్య నుంచి తక్కువ సమయంలో మనకు ఇమ్యూనిటీని ఇస్తాయి.
జలుబుతో బాధ పడేవాళ్లలో చాలామందిని తుమ్ముల సమస్య కూడా వేధిస్తూ ఉంటుంది. జలుబు ఉన్నవారు తులసిని తీసుకుంటే తుమ్ముల సమస్య తక్కువ సమయంలో తగ్గుముఖం పడుతుంది. తులసి తీసుకోవడం వల్ల దగ్గు, జలుబుతో పాటు నోటి నుంచి వచ్చే దుర్వాసన సమస్య నుంచి సైతం బయటపడవచ్చు. మిరియాల పాలు సైతం జలుబును త్వరగా తగ్గించడంలో సహాయపడతాయి.