ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ యమ రంజుగా సాగుతోంది. మొదటి టెస్టులో చిత్తుగా ఓడిన భారత్.. రెండో టెస్టుకు వచ్చేసరికి అంతే చిత్తుగా ఆస్ట్రేలియాను ఓడించి సత్తా చాటింది. విరాట్ కోహ్లీ పితృత్వ సెలవులతో రెండో టెస్టుకు దూరమవ్వడంతో టీమిండియా గెలుస్తుందా లేదా అన్న టెన్షన్ అభిమానులను కంగారు పెట్టింది.కానీ తాత్కాలిక కెప్టెన్ రహానే జట్టును ముందుండి నడిపించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.
కీలకమైన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా విజయం సాధించి తిరిగి రేసులోకి వచ్చింది. నాలుగు టెస్టుల సిరీస్ లో 1-1తో ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని సమం చేసింది. ఈ క్రమంలోనే మూడో టెస్టుకు టీమిండియా మరింత కసిగా రెడీ అవుతోంది.
ఇక క్వారంటైన్ పూర్తి చేసుకున్న స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ తాజాగా బుధవారం జట్టులో చేరాడు. దీంతో సిడ్నీ టెస్టులో భారత జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మను ఎవరి ప్లేసులో తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.
టెస్టులో పెద్దగా సత్తాచాటని రోహిత్ శర్మ, వన్డే, టీట్వంటీలో మాత్రం అద్భుతమైన పరుగులు సాధించాడు. గత దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ లోనూ ఓపెనర్ గా రాణించాడు. ఐపీఎల్ లో గాయంతో ఆస్ట్రేలియాతో వన్డే, టీట్వంటీ సిరీస్ లకు దూరమయ్యాడు. ఇప్పుడు ఫిట్ నెస్ నిరూపించుకొని జట్టులోకి వచ్చాడు.
రోహిత్ జట్టులోకి వస్తే ఎవరికి చెక్ చెబుతారనే ఆసక్తి ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ హనుమ విహారిలో ఒకరు ఖచ్చితంగా వైదొలుగుతారని.. రోహిత్ కు స్థానం దక్కుతుందని తెలుస్తోంది.
రోహిత్ తో చర్చించాక అతడు ఏ స్థానంలో ఆడుతాడనే విషయంపై చర్చిస్తామని కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. రోహిత్ నిర్ణయం బట్టే టీమిండియాలో మార్పులు చేర్పులు ఉండనున్నాయి.