ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తన పోరాటాన్ని వదలడం లేదు. ఏపీ సీఎం జగన్ తో ఢీకొంటూనే ఉన్నారు. జగన్ సర్కార్ నో చెప్పినా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి దుమారం రేపారు. దీన్ని హైకోర్టు నిన్న కొట్టివేయడంతో వదలకుండా హైకోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేశాడు. ఈరోజు గట్టిగా వాదనలు వినిపించేందుకు రెడీ అయ్యారు.
ఇక ఈ క్రమంలోనే ఏపీలో ఎన్నికల నిర్వహణకు విఘాతం కలిగించి పంచాయితీ ఎన్నికలు అడ్డుకోవడానికి జగన్ సర్కార్ చెప్పినట్టు చేశాడని ఆరోపిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త సంచాలకుడు (జేడీ) జీవీ సాయిప్రసాద్ ను విధుల నుంచి ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ తొలగించడం దుమారం రేపింది. కీలకమైన జేడీ లాంటి వ్యక్తిపై ఇలాంటి తీవ్రమైన చర్యలు కమిషన్ చరిత్రలోనే ఇదే మొదటి సారి అని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇతర ప్రభుత్వ శాఖల్లో ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా విధులు నిర్వహించడానికి వీల్లేదంటూ కమిషనర్ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.
ఈయన జగన్ సర్కార్ కు సహకరిస్తున్నారని.. అందుకే 30 రోజులు సెలవుపెట్టి చెప్పాపెట్టకుండా పోయాడని నిమ్మగడ్డ ఈ తీవ్ర చర్య తీసుకున్నారు. ఈయనను తొలగించినా జగన్ సర్కార్ ప్రభుత్వశాఖల్లోకి తీసుకుంటుందని స్కెచ్ వేసి మరీ నిమ్మగడ్డ నిషేధం విధించడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జేడీ వెళ్లిపోవడంతోపాటు ఉద్యోగులంతా మూకుమ్మడిగా సెలవుపై వెళితే కమిషన్ కార్యకలాపాలు స్తంభించి ఎన్నికలకు విఘాతం కల్పించొద్దని జేడీ తెరవెనుక పెద్ద ప్రణాళిక రచించారని నిమ్మగడ్డ ఆరోపించారు. అందుకే ఈ సస్పెండ్ చేశారు.
ఎన్నికల కోడ్ ఉన్నా కూడా జగన్ సర్కార్ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించడంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటికీ జగన్ సర్కార్ మాత్రం రెండో విడత అమ్మఒడి పథకాన్ని నిన్న ప్రారంభించడంపై నిమ్మగడ్డ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అమ్మఒడిపై గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు నిమ్మగడ్డ వెళ్లినట్లు సమాచారం. జగన్ సర్కార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని.. ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చాక సంక్షేమ పథకాన్ని అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది.