
ఏపీ సీఎం జగన్ ఢీ అంటే ఢీ అంటున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఏకంగా జగన్ సర్కార్ వద్దంటున్నా ఎన్నికల కమిషనర్ గా జిల్లాల పర్యటనకు రావడం సంచలనమైంది.
తాజాగా కడప జిల్లాలో నిమ్మగడ్డ రమేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ తండ్రి అయిన వైఎస్ రాజశేఖర్రెడ్డిని నిమ్మగడ్డ గుర్తు చేసుకున్నాడు. వైఎస్ హయాంలో తను ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేశానని.. వైఎస్ అధికారుల పట్ల లౌకికంగా వ్యవహరించారని.. జగన్ లా కాదంటూ పరోక్షంగా దెప్పిపొడిచాడు.
వైఎస్‌కు రాజ్యాంగం పట్ల గొప్ప గౌరవం ఉందని, కీలక అంశాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించారని నిమ్మగడ్డ అన్నారు.. ఏ వ్యవస్థని ఎప్పుడూ తప్పు పట్టలేదన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేయడం వల్లే తన జీవితంలో ఒక గొప్ప మలుపు అని నిమ్మగడ్డ రమేశ్ తెలిపారు. తనకు వైఎస్ఆర్ ఆశీస్సులు ఉన్నాయన్నారు.
వైఎస్ దగ్గర పనిచేసినప్పుడు తానెప్పుడూ ఇబ్బంది పడలేదని నిమ్మగడ్డ హాట్ కామెంట్స్ చేశారు. ఏ వ్యవస్థని ఎప్పుడూ తప్పుపట్టలేదని.. రాజ్యాంగ వ్యవస్థల పట్ల వైఎస్ఆర్ కు ఎంతో గౌరవం ఉందని కొనియాడారు. అంటే జగన్ కు లేదని పరోక్షంగా ఎత్తిచూపినట్టైంది.
ఇలా జగన్ ను విమర్శించేందుకు ఏకంగా ఆయన తండ్రినే బూచీగా నిమ్మగడ్డ చూపారు. జగన్ కు, వైఎస్ఆర్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని పరోక్షంగా సెటైర్లు వేశారు.