‘సాగర’ మథనం: తెలంగాణలో ఎన్నికల వాతావ‘రణం’

నల్లగొండ జిల్లాలో ఇప్పుడు ఎన్నికల వాతావ‘రణం’ కనిపిస్తోంది. అటు నాగార్జున సాగర్‌‌ బై ఎలక్షన్‌.. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలతో జిల్లాలో వేడి రాజుకుంది. ఈ రెండు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు అక్కడే మకాం వేశాయి. ఇప్పుడు నల్లగొండ జిల్లా చుట్టూరానే రాజకీయాలు తిరుగుతున్నాయి. అటు సాగర్‌‌ బై పోల్‌.. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల తీరును ఓసారి పరిశీలిస్తే.. * మూడు పార్టీలకూ ఛాలెంజ్‌లా మారిన బైపోల్‌ నాగార్జున సాగర్ బై ఎలక్షన్.. మూడు ప్రధాన పార్టీలకు […]

Written By: NARESH, Updated On : February 17, 2021 1:27 pm
Follow us on

నల్లగొండ జిల్లాలో ఇప్పుడు ఎన్నికల వాతావ‘రణం’ కనిపిస్తోంది. అటు నాగార్జున సాగర్‌‌ బై ఎలక్షన్‌.. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలతో జిల్లాలో వేడి రాజుకుంది. ఈ రెండు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు అక్కడే మకాం వేశాయి. ఇప్పుడు నల్లగొండ జిల్లా చుట్టూరానే రాజకీయాలు తిరుగుతున్నాయి. అటు సాగర్‌‌ బై పోల్‌.. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల తీరును ఓసారి పరిశీలిస్తే..

* మూడు పార్టీలకూ ఛాలెంజ్‌లా మారిన బైపోల్‌
నాగార్జున సాగర్ బై ఎలక్షన్.. మూడు ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతోంది. అక్కడ ఎలాగైనా గెలిచి తీరాలని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. సిట్టింగ్ సీటు కాపాడుకోవాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. సాగర్‌‌లో గెలిస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఈజీ అవుతుందని బీజేపీ భావనలో ఉంది. ఇప్పటికే దుబ్బాకలో గెలుపుతో బీజేపీ మంచి ఊపు మీద ఉంది. దానికితోడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా మరింత బూస్టింగ్‌ ఇచ్చినట్లు అయింది. తమ సీనియర్ లీడర్ జానారెడ్డి విజయం సాధిస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఇలా మూడు పార్టీలు సాగర్ ఉప ఎన్నికను.. తమ భవిష్యత్ రాజకీయాలకు గీటురాయిగా పెట్టుకున్నాయి. గతేడాది డిసెంబర్ 1న నోముల నర్సింహయ్య చనిపోవడంతో సాగర్‌‌లో ఉప ఎన్నిక జరుగుతోంది. త్వరలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

* పరువు కోసం పాకులాట
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరుస ఫెయిల్యూర్స్‌తో దెబ్బతిన్న టీఆర్ఎస్.. సాగర్‌‌లో పరువు కోసం ప్రయత్నిస్తోంది. దుబ్బాకలో గెలిచి తీరుతామన్న ధీమాతో సీఎం కేసీఆర్ ప్రచారానికి వెళ్లలేదు. కానీ.. అక్కడ బీజేపీ గెలిచింది. తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇచ్చింది. 48 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో అలర్టయిన కేసీఆర్.. సాగర్‌‌లో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నారు. అక్కడ కూడా ఓడిపోతే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కష్టమవుతుందని ఆ పార్టీ లీడర్లే అంటున్నారు. అందుకే ఎలక్షన్ షెడ్యూలు రాకముందే కేసీఆర్.. సాగర్ పరిధిలో పర్యటించి, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులకు శంకుస్థాపన చేసి, అక్కడి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. జిల్లాకు దాదాపు రూ.200 కోట్ల వరాలు ప్రకటించారు. సాగర్‌‌లో తమ అభ్యర్థి గెలిస్తే రెండు పార్టీలకు ఒకేసారి చెక్ పెట్టినట్లు అవుతుందని టీఆర్ఎస్ లీడర్లు భావిస్తున్నారు. వరుస విజయాలతో దూకుడుగా ఉన్న బీజేపీని కట్టడి చేసినట్లేనని అంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని రెండోసారి ఓడించడం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి లేకుండా పోతుందని చెబుతున్నారు.

* ఓడితే కాంగ్రెస్ కనుమరుగే..
తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కాంగ్రెస్ బలహీనపడుతోంది. దుబ్బాకలో థర్డ్ ప్లేస్‌కు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫోర్త్ ఫ్లేస్‌కు పడిపోయింది. దీనికితోడు.. రాష్ట్ర నేతలు ఎవరికివారుగా వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ కేడర్ డీలా పడుతోంది. పీసీసీ కొత్త అధ్యక్షుడిని నియమించాలని హైకమాండ్ భావించినా.. తర్వాత ఆ ఆలోచన విరమించుకుంది. బై ఎలక్షన్ తర్వాతే నియమిస్తామని ప్రకటించింది. దీంతో సాగర్ ఎలక్షన్‌ను హైకమాండ్ సీరియస్‌గా తీసుకున్నట్లు అర్థమవుతోంది. అందుకే.. జానారెడ్డిని పోటీ చేయమని స్వయంగా ఏఐసీసీ పెద్దలు కోరినట్టు ప్రచారం జరుగుతోంది. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా ఇంటికే పరిమితమైన జానారెడ్డి.. సాగర్ సీటు ఖాళీ తర్వాత మళ్లీ తెర మీదికి వచ్చారు. నియోజకవర్గంలో మళ్లీ పట్టు సాధించేందుకు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగర్ లో గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగా పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ లీడర్లు లెక్కలు వేస్తున్నారు. ఓడిపోతే పార్టీ ఉనికే డేంజర్​లో పడుతుందని అంటున్నారు.

* బీజేపీ టార్గెట్‌ 2023
దేశంలో ఒక్కో రాష్ట్రంలో పాగా వేసుకుంటూ దూసుకెళ్తున్న బీజేపీ.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌, ఆ తర్వాత తెలంగాణను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకే సాగర్ ఉప ఎన్నికను ఆ పార్టీ సీరియస్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం. అక్కడ గెలిస్తే.. 2023 టార్గెట్‌ను సాధించొచ్చని భావిస్తోంది. సెంట్రల్ పార్టీ కూడా అదే కోణంలో రాష్ట్ర నాయకత్వాన్ని గైడ్ చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకోవడం, అందులో ఏకంగా సీఎం కేసీఆర్ కూతురు కవిత, ఆయన బంధువు వినోద్ కుమార్‌ను బీజేపీ ఓడించడంతో హైకమాండ్ చూపు తెలంగాణపై పడింది. మొన్న దుబ్బాకలో టీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకోవడంతో కమల దళంలో జోష్ ఒక్కసారిగా పెరిగింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 సీట్ల నుంచి ఏకంగా 48 సీట్లకు బలాన్ని పెంచుకుంది. దీంతో ఇదే ఊపు కొనసాగిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ లీడర్లు భావిస్తున్నారు. ఈ వరుసలో వచ్చిన నాగార్జున సాగర్ బై ఎలక్షన్‌ను 2023 ఫైనల్‌కు ముందు జరిగే సెమీ ఫైనల్‌గా బీజేపీ భావిస్తోంది. అందుకే అభ్యర్థి ఎంపిక నుంచే ఆచితూచి అడుగులేస్తోంది.

* గ్రాడ్యుయేట్‌ ఫైట్‌
మరోవైపు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌ నోటిఫికేషన్‌ రావడంతో పొలిటికల్‌ పార్టీలు ప్రచారం స్పీడప్‌ చేశాయి. ముఖ్యంగా అన్ని పార్టీలూ నల్లగొండలో ఉండిపోయాయి. సిట్టింగ్‌ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్‌‌ఎస్‌ పకడ్బందీ వ్యూహాలు పన్నుతోంది. మరోవైపు బీజేపీ కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. ప్రతీ 25, 50 మంది ఓటర్లకు ఇన్‌చార్జీలను నియమించింది. కాంగ్రెస్‌ కూడా మూడు నియోజకవర్గాలకు కలిపి క్యాండిడేట్‌ పరిచయ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే గ్రాడ్యుయేట్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీలకు చెందిన లీడర్లు ఓటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీలుగా టీఆర్‌‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి, బీజేపీ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణిరుద్రమ, ఇండిపెండెంట్లు తీన్మార్‌‌ మల్లన్న, సుధగాని హరీశ్‌ శంకర్‌‌గౌడ్‌, టీజేఎస్‌, యువ తెలంగాణ పార్టీ లీడర్లు బరిలో నిలుస్తున్నారు. ఇప్పటికే గ్రాడ్యుయేట్ల ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది.

-శ్రీనివాస్. బి