ఏపీలో ఎన్నికల సీజన్ ప్రారంభం కావడంతో ఎస్‌ఈసీ తన మార్క్ పాలనను చూపిస్తున్నారు. ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు నడుస్తున్నాయంటే పెత్తనం అంతా ఎన్నికల కమిషన్‌దే ఉంటుంది. ఇప్పుడు ఆ హక్కులను ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాడుతున్నారు. అధికారుల మీద ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.
Also Read: ‘సాగర’ మథనం: తెలంగాణలో ఎన్నికల వాతావ‘రణం’
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. నేడు మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. చివరిది.. నాలుగో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్. ఈ నెల 21వ తేదీన ఆరంభం కానుంది. దీంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినట్టవుతుంది. మూడేళ్ల తరువాత గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధుల పాలనకు శ్రీకారం చుట్టినట్టవుతుంది. ఆ వెంటనే మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియను చేపట్టడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో దశలవారీగా పోలింగ్ ఆరంభం కానుంది.
ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు ఎస్‌ఈసీ. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడంతో ఇప్పుడు మున్సిపల్ ఆఫీసర్లను బదిలీ చేస్తున్నారు. ఈ మధ్య గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గుమ్మళ్ల సృజన బదిలీ అయ్యారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. ప్రస్తుతం ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆమెను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే రిలీవ్ కావాలని సూచించారు. 2013 బ్యాచ్ ఐఎఎస్ అధికారిణి సృజన ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారు. సెలవు ముగిసిన వెంటనే జీఏడీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
Also Read: ఆ పార్టీలతోనే దీదీకి నష్టం
గుమ్మళ్ల సృజన స్థానంలో మరో ఐఏఎస్ అధికారిణికి ప్రభుత్వం గ్రేటర్ విశాఖ కమిషనర్ బాధ్యతలను అప్పగించింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా కొనసాగుతున్న ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాగలక్ష్మిని జీవీఎంసీ కమిషనర్‌గా నియమించింది. 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి నాగలక్ష్మి నియామకానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంగీకరించారు. నాగలక్ష్మితో పేరును సూచిస్తూ సాధారణ పరిపాలన శాఖ ప్యానెల్ పంపించిన ప్రతిపాదనలపై ఆయన ఆమోదముద్ర వేశారు. ఆ వెంటనే ఆమెను జీవీఎంసీ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలు సమీస్తున్న క్రమంలో ఇంకా ఎన్ని బదిలీలు ఉంటాయో చూడాలి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్