ఓ నమ:శివాయ అంటూ శైవక్షేత్రాలు మారుమోగాయి. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో కోలాహలంగా మారాయి.
తెలంగాణలోని ప్రఖ్యాత వేములవాడ రాజన్న ఆలయం, కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం, రామప్ప ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులతో శైవక్షేత్రాలన్నీ అలరాలుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు
మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. క్యూలైన్లలో తమను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల కుటుంబాలకు ఆటంకాలు లేకుండా దర్శనం కల్పిస్తున్నారని.. తమను గంటల కొద్దీ క్యూలైన్లలో నిలుచోబెడుతున్నారని వాపోయారు. పోలీసులకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం మల్లన్న క్షేత్రం, శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరస్వామి ఆలయం, అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయం, మహానంది, కోటప్పకొండలోని త్రికూటేశ్వర స్వామి ఆలయాలకు వేకువజామునుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీశైలంలో అర్ధరాత్రి 2 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి.
మహా శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధిలో హెలికాప్టర్ సేవలను బుధవారం ప్రారంభించారు. 14 వ తేదీ సాయంత్రం వరకు ఈ హెలికాప్టర్ అందుబాటులో ఉంటుంది. జిల్లా ప్రజా పరిషత్ చైర్మెన్ శ్రీమతి అరుణ, ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ లు శ్రీ ఆర్.అంజయ్య, శ్రీ బి.సత్య ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ రిజ్వాన్ భాషా షేక్ లు హెలిప్యాడ్ వద్ద పూజ చేసి హెలిప్యాడ్ సేవలను ప్రారంభించారు.
– – ఛార్జీల వివరాలు
వేములవాడ నుండి నాంపల్లి వరకు 7 నిమిషాల గగనతల ప్రయాణం చేసేందుకు ప్రతి ఒకరి వద్ద నుంచి రూ.3 వేలు చొప్పున టిక్కెట్ ను వసూలు చేయనున్నారు.వేములవాడ నుంచి నాంపల్లి మీదుగా మధ్య మానేరు డ్యామ్ అందాల వీక్షించేందుకు వీలుగా 15 నిమిషాల గగనతల ప్రయాణానికి ఒక్కరికి రూ. 5500 వసూలు చేయనున్నారు.