నటీనటులుః నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, నరేష్ వీకే తదితరులు
దర్శకత్వంః అనుదీప్ కె.వి.
నిర్మాతంః నాగ్ అశ్విన్
సంగీతంః రతన్
సినిమాటోగ్రఫీః సిద్ధం మనోహర్
రిలీజ్ డేట్ః 11 మార్చి, 2021
Also Read: మూవీ రివ్యూః గాలి సంపత్
బేవార్స్ బ్యాచ్ అధ్యక్షుణ్ణి జాతిరత్నం అంటూ నిందించడం అందరికీ తెలిసిందే. అదే పేరు సినిమాకు పెట్టేసి.. టైటిల్ తోనే క్యూరియాసిటీ క్రియేట్ చేసింది టీమ్. అంతేనా.. ఒక్కరు కాదు.. ఏకంగా మూడు జాతిరత్నాలు ఉన్నాయని చెప్పేయడం.. వారెవరో కాదు, నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ అని ప్రకటించడంతో ఇదేదో పేలిపోయే యవ్వారంలానే ఉందే అనుకున్నారు ఆడియన్స్. ఆ తర్వాత రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో బ్లాస్టింగ్ జరగడం ఖాయమనే అభిప్రాయానికి వచ్చేశారు చాలా మంది. ఇలా.. సూపర్ బజ్ తో శివరాత్రి సందర్భంగా రిలీజైందీ చిత్రం. మరి.. ఈ జాతిరత్నాలు ఏం చేశాయనేది చూద్దాం…
కథః అల్లర చిల్లరగా తిరుగుతూ.. పనీపాట లేని బేవార్స్ బ్యాచ్ గా ముద్రపడిపోతారు శ్రీకాంత్ (నవీన్ పోలిశెట్టి), దర్శి, రామకృష్ణ. వీళ్ల యవ్వారం పీక్ స్టేజ్ కు చేరడంతో ఇంట్లో ప్రెజర్ పెరుగుతుంది. దీంతో ఇజ్జత్ కోసమైనా ఉద్యోగం చేయాలని హైదరాబాద్ బాట పడతారు ముగ్గురు. వీరిలో శ్రీకాంత్ పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంటుంది. రెండు నెలల్లో ఉద్యోగం సంపాదించకుంటే.. ఇంటికి వెళ్లి తండ్రినడిపే కంగన్ హాల్ లో పనిచేయాల్సి ఉంటుంది. అదే సమయంలో చిట్టి (ఫారియా అబ్దుల్లా)తో లవ్ ఎఫైర్ మొదలవుతుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితుల్లో అనూహ్యంగా ఓ కేసులో చిక్కుకుంటారు వీరు ముగ్గరు. ఆ కేసు ఏంటీ? దాన్నుంచి ఎలా బయటపడ్డారు? ఇంతకీ ఉద్యోగం సంపాదించారా? అన్నది మిగతా కథ.
కథనంః జాతిరత్నాలు ముగ్గురినీ ఆవారా బ్యాచ్ గా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు అనుదీప్. పనీపాటా లేనివారికి ఇళ్లలో ఎలాంటి ట్రీట్ మెంట్ ఉంటుందో అందరికీ తెలిసిందే. దాన్ని చక్కగా చూపించిన దర్శకుడు.. వాళ్లను సరైన సమయంలోనే హైదరాబాద్ బస్సెక్కించాడు. అక్కడ ఉద్యోగం కోసం పడే తిప్పలు, అనూహ్యంగా కేసులో ఇరుక్కోవడం యాక్సెప్టబుల్ గానే ఉంది. ఇక, సెకండ్ హాఫ్ లో ఎవర్ గ్రీన్ బ్రహ్మీ ఎంట్రీతో సినిమా మరో లెవల్ కు చేరింది. తాము నేరం చేయలేదని నిరూపించుకునే క్రమం నవ్వులు పూయిస్తుంది. ఇక, క్లైమాక్స్ మొత్తం మంచి కామెడీ పండించాడు దర్శకుడు. మొత్తంగా.. శివరాత్రి వేళ అద్భుతమైన జాతిరత్నాలను ఆడియన్స్ కు పరిచయం చేశాడు అనుదీప్.
Also Read: ‘శ్రీకారం’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?
పెర్ఫార్మెన్స్ః అంతకు ముందు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన నవీన్ పొలిశెట్టి.. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయతో తానేంటో నిరూపించుకున్నాడు. ఆ సినిమా ద్వారా మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ అనంతరం జాతిరత్నాలుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ద్వారా తన యాక్టింగ్ కెపాసిటీని మరింతగా పెంచుకున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ ను మరో రేంజ్ లో ప్రదర్శించాడు. ఇక, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ యాజ్ యూజువల్ గా దంచేశారు. తెలంగాణ స్లాంగ్ లో తమదైన టైమింగ్ తో చెలరేగిపోయారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా చక్కగా నటించింది. ఆమె గ్లామర్ ఆకట్టుకుంటుంది. ఇక హాస్యబ్రహ్మ బ్రహ్మానందం సినిమాకు అదనపు ఆకర్షణ. చాలా కాలం తర్వాత తెరపై కనిపించిన ఆయన.. సెకండాఫ్ లో కనిపించి సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ లో చిట్టి-శ్రీకాంత్ లవ్ తోపాటు కామెడీ పంచులు హైలెట్ గా నిలుస్తాయి. తాము నేరం చేయలేదని నిరూపించుకోవడానికి జాతిరత్నాలు పడే పాట్లు హిలేరియస్ గా ఉంటాయి. అక్కడక్కడా కాస్త స్లో అయినప్పటికీ.. కామెడీ జోరులో అదేం పెద్దగా ప్రభావం చూపదు. మొత్తంగా.. ఈ సినిమా ద్వారా దర్శకుడు అనుదీప్ తానేంటో నిరూపించుకున్నాడు. పండగ జోష్ తోపాటు వీకెండ్ కూడా ముందుండడంతో జాతిరత్నాలు మరింత మెరిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
బలాలుః ముగ్గురి పెర్ఫార్మెన్స్, కామెడీ పంచులు, దర్శకత్వం
బలహీనతలుః కొన్ని సన్నివేశాలు
రేటింగ్ః 3/5
లాస్ట్ లైన్ః మెరిసిన ‘జాతిరత్నాలు
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్