దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకున్న టీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఇక త్వరలోనే వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ వరంగల్ నగరంపై ఫోకస్ పెట్టారు.
ఇటీవల హైదరాబాద్ నగర అభివృద్ధిపై సమీక్షించిన మంత్రి కేటీఆర్ నగర వాసులకు న్యూ ఇయర్ గిప్ట్ ప్రకటించారు. కొత్త ఏడాదిలో హైదరాబాద్ జలమండలి ద్వారా 20వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటిని పంపిణీ చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో 20వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబర్ నెల బిల్లులో 20వేల లీటర్ల వరకు ఛార్జ్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెల్సిందే.
తాజాగా వరంగల్లో చేపట్టబోయే అభివృద్ధి మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈసందర్భంగా వరంగల్ వాసులకు కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఉగాది నుంచి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో ప్రయోగాత్మకంగా ప్రతీరోజు తాగునీటి సరఫరా చేస్తామని మంత్రి ప్రకటించారు.
నగర అభివృద్ధి కోసం వెయ్యి కోట్లతో పలు అభివృద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు. ప్రతీయేటా రూ.300 కోట్ల బడ్జెట్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత రోడ్లు.. డ్రైనేజీలకు వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశించారు.
అదేవిధంగా వరంగల్ కార్పొరేషన్లో అవసరమైన సిబ్బంది నియామకానికి అనుమతి ఇచ్చారు. గత ఆరేళ్లలో కేంద్రం ఇచ్చే నిధుల కంటే రాష్ట్ర ప్రభుత్వమే ఐదున్నర రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు.