‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’ అంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండూ కష్టంతో కూడినవే. ఇక నిరుపేదలైతే ఇల్లు కొనుక్కోవడం అంటే వారికి కలగానే చెప్పాలి. ఇప్పుడున్న మెటీరియల్ రేటు.. కూలీల కాస్ట్.. వింటేనే దిమ్మతిరిగిపోతుంటుది. ఎంత లేదనుకున్నా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలంటే రూ.30 లక్షల వరకు కావాల్సిందే. అయితే ఇల్లు లేని నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీం కింద సొంతింటి కల సాకారం చేయనుంది. ఈ పథకం కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, మిడిల్ క్లాస్ పీపుల్ ఇల్లు కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించింది. అంతేకాదు మొదటిసారి ఇల్లు కొన్న వారికి వడ్డీ రాయితీ కూడా కల్పించింది.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఈ స్కీం వచ్చే ఏడాది మార్చి వరకు అమలులో ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హౌసింగ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ మాత్రం ఈ పథకాన్ని వినూత్నంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ స్కీం కింద ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి విక్రయిస్తోంది. అది కూడా కేవలం రూ.3.50 లక్షలకే. ఇలా ఇప్పటికే ఆ ప్రభుత్వం 3,500 ఇళ్లు నిర్మించింది. వాటిని నిరుపేద ప్రజలకు అమ్ముతోంది. కొనాలనుకునే వారు ఈనెల 1 నుంచే బుకింగ్ చేసుకోవాలని ఆ గవర్నమెంట్ సూచించారు. అక్టోబర్ 15లోపు దరఖాస్తు చేసుకున్న వారికే ఈ అవకాశం కల్పిస్తోంది. అయితే ఈ పథకానికి కొన్ని కండీషన్స్ అప్లై చేసింది.
ఈ పథకం ద్వారా ఇల్లు కొనాలనుకునే వారి వార్షిక ఆదాయం రూ.3.5 లక్షల లోపు ఉండాలి. పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే ఇందుకు అర్హులని ప్రకటించింది. అంతేకాదు అర్హులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ.3.50 లక్షలకు ఇల్లు కట్టివ్వడమే కాకుండా ఆ సొమ్మును ఒకేసారి చెల్లించే స్థోమత లేని వారి కోసం ఈఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చింది. మూడేళ్లలోపు ఆ సొమ్మును చెల్లించాలని సూచించింది. దీంతో ఇప్పుడు ఈ హౌసింగ్ స్కీం ఫుల్ పాపులర్ అయింది.
ఏ పేదవాడికైనా కూడు, గూడు అవసరం. కూడు ఎలాగోలా సంపాదించుకున్నా గూడు కట్టుకోలేని దుస్థితి. అందుకే మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ హౌసింగ్ స్కీం అమలు దిశగా ఆలోచన చేయాలని కోరుతున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో తమకు ఓ నీడ దొరుకుతుందని అంటున్నారు. మరి మన ప్రభుత్వాలు కూడా రూ.3.50 లక్షలకే ఇల్లు ఇచ్చే విధంగా ఆలోచన చేస్తాయని ఆశిద్దాం..!