
తెలంగాణ ప్రభుత్వానికి రాష్ర్ట హైకోర్టు మొట్టికాయలు వేసింది. వివిధ ప్రశ్నలు సంధించి ఇరకాటంలో పెట్టింది. కరోనా నిరోధానికి ఏం చర్యలు తీసుకుంటున్నారని అడిగింది. తమ ఆదేశాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలను వివరిస్తూ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) హైకోర్టుకు మంగళవారం నివేదిక సమర్పించింది.
పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సల ధరలు ఒకే విధంగా ఉండాలన్న ఆదేశాలు అమలు చేశారా? ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సల గరిష్ట ధరలను సవరిస్తూ తాజా జీవో ఇచ్చారా? కరోనాపై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదు? కొత్త ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లు ఇంకెప్పుడు అమలులోకి వస్తాయి? అని హైకోర్టు నిలదీసింది. మూడో దశకు ఏ విధంగా సిద్ధమవుతున్నారని అడిగింది. ఆదేశాల అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మహారాష్ర్టలో ఒకే జిల్లాలో 8 వేల మంది పిల్లలు కరోనా బారిన పడ్డారని గుర్తు చేసింది.
ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, సిబ్బంది పెంపునకు ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రశ్నించింది. అన్ని భవిష్యత్తులో చేస్తారా? ఇప్పుడేం చేయరా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులు బంగారం తాకట్టు పెట్టి ఆస్పత్రుల ఫీజులు చె ల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్పత్రుల లైసెన్సులు రద్దు చేసినా రోగులకు తిరిగి డబ్బులు ఇప్పించారా అని ప్రశ్నించింది. బుధవారం విచారణకు హెల్త్ సెక్రటరీ, డీజీపీ సహా సంబంధిత అధికారులు హాజరు కావాలని తెలిపింది.
మూడో వేవ్ కు ఎలా సన్నద్ధమవుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నీలోఫర్ ఆస్పత్రిలో 200 పడకలు ఏర్పాటు చేస్తే సరిపోతుందా? అసలు థర్డ్ వేవ్ గురించి ఏ మేరకు సదుపాయాలు ఏర్పాటు చేశారని సూటిగా నిలదీసింది. మే 17న విచారణలో చాలా ప్రశ్నలు అడిగింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స రేట్లను నిర్ణయిస్తూ కొత్త జీవో విడుదల చేయాలని కోరింది. జీవో విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన చాలా ఆదేశాలు పాటించలేదని ప్రశ్నించింది. కరోనాపై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని అడిగింది.