ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వరుసగా జరుగుతున్న దేవతా విగ్రహాల ధ్వంసంపై సీఎం జగన్ స్పందించారు. రాజకీయాలకు దేవుడిని వాడుకుంటున్నారని జగన్ ఆరోపించారు. ఏపీలో రాజకీయ ప్రయోజనాల కోసమే దేవుడి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు.
ఏపీలో కొందరు కుట్రలు చేస్తున్నారని జగన్ హెచ్చరించారు. రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని.. ప్రజలంతా ఇది గమనించి ఇలా రాజకీయాల కుట్రలు భాగం కావదని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
సంక్షేమ పథకాలతో ప్రజలకు ఓవైపు ప్రభుత్వం చేరువ అవుతుంటే.. ప్రభుత్వం చేసే మంచి పనులు చూడలేకనే ప్రతిపక్షాలు ఈ కుట్రలు చేస్తున్నాయని జగన్ విమర్శించాడు. ప్రభుత్వంపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఏపీలోని ఆలయాలపై వరుస దాడులు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. తిరుపతిలో అపచారం, అంతర్వేది రథం దగ్ధం.. నిన్న రామతీర్థలో రాములోరి తలను నరికేయడం.. విజయవాడలో సీతమ్మ విగ్రహ ధ్వంసం ఇలా సీఎం జగన్ సంక్షేమ పథకాల ప్రారంభానికి ముందుగానే ఈ దాడులు సాగుతుండడం వైసీపీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనివెనుక కుట్ర కోణం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం సంచలనమైంది.