దేశంలో కరోనా మారణహోమం పతాక స్థాయికి చేరడంతో.. జనం బెంబేలెత్తిపోతున్నారు. నిత్యం లక్షలాది కేసులు.. వేలాది మరణాలు సంభవిస్తుండడంతో భయంగుప్పిట్లో బతుకుతున్నారు. ఇది చూస్తున్న విదేశీయులు భారత్ పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నారు. ఇక, ఇండియాకు రావాలని పిలిస్తే హడలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మేం రాలేం బాబోయ్ అంటున్నారు!
విదేశాలకు చెందిన ఎంతో మంది ఉద్యోగులు భారత్ లో పనిచేస్తున్నారు. వీరితోపాటు కొత్తవారు కూడా దిగుమతి కావాల్సి ఉంది. అయితే.. కరోనా కల్లోలంతో ఇక్కడున్న చాలా మంది స్వదేశాలకు వెళ్లిపోయారు. వారంతా.. ఇప్పట్లో తిరిగి రాలేమని చెబుతున్నారట. కొత్తగా ఉద్యోగాల్లో చేరాల్సిన వారు కూడా.. ఇదే మాట చెబుతున్నారట. మరికొందరైతే.. ఇండియాలో ఉద్యోగమే వద్దంటూ ఆఫర్లను తిరస్కరిస్తున్నారట.
వీరిలో అమెరికా, ఆస్ట్రేలియాతోపాటు యూరోపియన్, పలు ఆసియాదేశాలకు చెందినవారు ఉన్నట్టు చెబుతున్నారు. ఓ అమెరికన్ లేడీ ఇండియన్ కంసెనీలో సీఎక్స్ఓ పొజిషన్ ను కూడా తిరస్కరించిందట. మరో ఆస్ట్రేలియన్, బ్రెజిల్ దేశస్తులు కూడా తాము ఇండియాకు రాలేమని చెప్పారట. ఇలా.. ఇండియాలో ఉద్యోగం వదులుకోవడానికి సిద్ధపడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందట.
దీంతో.. కీలకమైన ఉద్యోగులను వదులుకోవడానికి ఇష్టం లేని సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని కోరుతున్నాయట. పరిస్థితి మొత్తం చక్కబడిన తర్వాతనే ఇండియాకు తిరిగిరావాలని, అప్పటి వరకూ స్వదేశం నుంచే పని చేయాలని కోరుతున్నాయట. ఎలక్ట్రిక్ వెహికల్స్, రీటైల్, బయోటెక్, టెక్నాలజీ రంగాలకు చెందిన ఉద్యోగులకు ఈ ఆఫర్ ఇస్తున్నాయట.
ఇక, ఓ అమెరికన్ కొత్త ఉద్యోగి భారీ ఆఫర్ ను తిరస్కరించినట్టు సమాచారం. అతనికి చాలా మంచి సాలరీని ఆఫర్ చేసిన కంపెనీ.. ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించింది. పరిస్థితులు అన్నీ చక్కబడిన తర్వాతనే ఇండియా రావాలని కోరిందట. అయితే.. వేవ్ ల మీద వేవ్ లు వచ్చి పడుతున్న నేపథ్యంలో.. పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందోనని అతడు ఉద్యోగమే వద్దని చెప్పాడట.
ఈ విధంగా.. ఇండియాలో ఉద్యోగాలు వదులుకుంటున్న వారి సంఖ్య రానురానూ పెరుగుతోందని అంటున్నారు. సెకండ్ వేవ్ ఇప్పట్లో తగ్గుముఖం పట్టే పరిస్థితులు కనిపించట్లేదు. ఇంతలోనే థర్డ్ వేవ్ కు సైతం సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు నిపుణులు. ఇదే జరిగితే.. మరికొందరు ఉద్యోగాలను వదిలి వెళ్తారేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.