మన కంటికి కన్పించని అద్భుతాలు విశ్వంలో ఏదో ఒకచోట నిత్యం జరుగుతూనే ఉంటాయి. వాటిని తెలుసుకునేందుకు పరిశోధకులు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఆకాశంలో జరుగుతున్న అద్భుతాలను శోధించడంతోపాటు వాటిని మానవళికి పరిచయం చేస్తుంటారు.
నేడు కూడా ఆకాశంలో ఓ అద్భుతం జరుగబోతుంది. దాదాపు నాలుగేళ్ల క్రితం ఇలాంటి అద్భుతమే ఆకాశంలో జరిగింది. మళ్లీ అద్భుతమైన అవకాశం మనకే దక్కింది. ఈ అవకాశం మిస్ అయితే మన లైఫ్ లో ఇకపై చూసే అవకాశం ఉండదు.
ఎందుకంటే ఈ అద్భుతం మళ్లీ జరుగాలంటే మరో 400ఏళ్లు పడుతోంది. ఇంతకీ ఆ అద్భుతం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. నేటి(సోమవారం) రాత్రి ఆకాశంలో గురు.. శని గ్రహాల కలయిక జరుగబోతుంది. ఈ రెండు గ్రహాల కలయిక చాలా అరుదుగా జరుగుతుంది.
రెండు గ్రహాలు ఆకాశంలో ఒకే చోటకు వచ్చినట్లు కనిపిస్తే దానిని సంయోగం అని అంటారు. ఆ సమయంలో రెండు గ్రహాలు సాధారణ దూరం కంటే చాలా దగ్గరగా కనిపిస్తాయి. చివరగా ఇలాంటి సంయోగం 1623 సంవత్సరంలో జరిగింది.
ఈ రెండు గ్రహాలు దగ్గరికి వచ్చినప్పుడు కూడా వీటి మధ్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. భూమికి గురు గ్రహం 89కోట్ల కిలో మీటర్లు దూరంలో ఉంటుంది. భూమిపై నుంచి చూసినప్పుడు అవి ప్రకాశవంతమైన నక్షత్రంలాగా ఒకేలా కనిపిస్తాయి.
భారత్‌లో సాయంత్రం 5.21 గంటల నుంచి రాత్రి 7.12 గంటల వరకు ఈ మహా కలయికను చూడొచ్చు టెలిస్కోప్, బైనాక్యులర్లతో అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించవచ్చు. 400 ఏళ్ల తర్వాత చోటు చేసుకుంటున్న ఈ ఘటన చరిత్రలో నిలిచిపోనుంది.