https://oktelugu.com/

ఆంధ్ర భూ సర్వే కు.. తెలంగాణ భూసర్వేకు తేడా ఇదే?

రెండు తెలుగు రాష్ట్రాల్లో భూ సమగ్ర సర్వే చేయడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి భూమికి… అది వ్యవసాయ భూమి అయినా, ఇంటి స్థలం అయినా- దాని విస్తీర్ణం, హద్దులు, హక్కుల వివరాలు తెలిపే రికార్డులు ఉండాలి. వాటి ఆధారంగా ఆ భూమిని గుర్తించగలగాలి. అప్పుడే ఆ భూమిపై ఎవరికైనా హక్కులు స్పష్టంగా ఉంటాయి. వివాదాలు ఉత్పన్నం కావు. వచ్చినా ఈ రికార్డుల ఆధారంగా పరిష్కరించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్య్రం రాకముందు భూముల సర్వే, సెటిల్మెంట్‌ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 21, 2020 10:03 am
    Follow us on

    రెండు తెలుగు రాష్ట్రాల్లో భూ సమగ్ర సర్వే చేయడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి భూమికి… అది వ్యవసాయ భూమి అయినా, ఇంటి స్థలం అయినా- దాని విస్తీర్ణం, హద్దులు, హక్కుల వివరాలు తెలిపే రికార్డులు ఉండాలి. వాటి ఆధారంగా ఆ భూమిని గుర్తించగలగాలి. అప్పుడే ఆ భూమిపై ఎవరికైనా హక్కులు స్పష్టంగా ఉంటాయి. వివాదాలు ఉత్పన్నం కావు. వచ్చినా ఈ రికార్డుల ఆధారంగా పరిష్కరించవచ్చు.

    తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్య్రం రాకముందు భూముల సర్వే, సెటిల్మెంట్‌ జరిగాయి. ప్రతి గ్రామానికి ఒక పటం/నక్ష, ప్రతి భూ విభాగానికి కొలతలు, హద్దుల వివరాలతో కూడిన సమాచారం(ఫీల్డ్‌ మెజర్మెంట్‌ బుక్‌- ఎఫ్‌ఎమ్‌బీ/టీపన్‌) సిద్ధం చేశారు. ఆ భూమికి పట్టాదారు ఎవరు, అది ప్రభుత్వ భూమా, ఈనామా తదితర వివరాలతో ‘సెటిల్మెంట్‌ రికార్డు’ తయారు చేశారు. అందులో సగానికిపైగా రికార్డులు చినిగిపోయాయి. కొన్నింటిలో అక్షరాలు చెరిగిపోయాయి. కొన్ని వందల గ్రామాలకు పటం/నక్షాలు లేవు. ఈ రికార్డులే ఇప్పటికీ భూమి హక్కులు, హద్దుల నిర్ధారణకు ఆధారాలు.

    స్వాతంత్య్రం వచ్చిన తరవాత రీ సర్వేకు ప్రయత్నాలు జరిగాయి. అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌లో 17,563 రెవిన్యూ గ్రామాలు ఉండగా, 131 గ్రామాల్లోనే రీ సర్వే చేశారు. తెలంగాణలో 10,829కు గాను 905 గ్రామాల్లోనే రీ సర్వే జరిగింది. రికార్డులను అనుసరించి ఒక భూభాగాన్ని గుర్తించాలంటే కొన్నిసార్లు రోజులకొద్దీ సమయం పడుతోంది. ఒక్కో శాఖ దగ్గర ఆ భూమికి సంబంధించి ఒక్కో రకమైన వివరాలు ఉన్నాయి. సర్వే, సెటిల్మెంట్‌, భూ రికార్డుల శాఖ దగ్గర సర్వే, సెటిల్మెంట్ రికార్డులు ఉంటాయి. రెవిన్యూ శాఖ వద్ద హక్కుల రికార్డులు, గ్రామ రెవిన్యూ లెక్కలు ఉంటాయి.

    భూమిపై లావాదేవీల వివరాలు రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్వహించే రికార్డ్‌ ఆఫ్‌ హోల్డింగ్స్‌ (ఆర్‌ఓహెచ్‌)లో ఉంటాయి. ఇంటిస్థలాల వివరాలు స్థానిక సంస్థలైన పంచాయతీ, పురపాలక సంఘం రిజిస్టర్లో నమోదు చేస్తారు. అటవీ భూముల వివరాలు అటవీ శాఖ వద్ద ఉంటాయి. ఒక భూ విభాగానికి సంబంధించిన వివరాలు వివిధ శాఖలు నిర్వహిస్తున్న రికార్డుల్లో వేరువేరుగా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ లో భూముల సమగ్ర సర్వే(రీసర్వే) ప్రాజెక్టు సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ‘రీ సర్వే’ పైలట్‌ ప్రాజెక్టు సాగిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో సీఎం జగన్‌ దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

    అయితే, రీ సర్వేలో వచ్చిన వివాదాల పరిష్కారం ఇంకా పూర్తికావాల్సి ఉంది. మరోవైపు భూమి రికార్డుల ప్యూరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత 2021లో రీ సర్వేను ప్రారంభిస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. అయితే, అనూహ్యంగా షెడ్యూల్‌ను మార్చారు. సోమవారం సీఎం పుట్టిన రోజు. ఆ రోజు నుంచే ‘రీ సర్వే’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాలని రెండు నెలల క్రితమే నిర్ణయించారు. ప్రాజెక్టు వ్యయం రూ.987 కోట్లు. ఇందులో కేంద్రం డీఐఎల్‌ఆర్‌ఎమ్‌పీ కింద రూ.200 కోట్లు మంజూరు చేసింది. ‘సౌమిత్వ’ పథకం కింద మరికొన్ని నిధులు ఇవ్వనుంది. భూముల సమగ్ర సర్వేకు ‘వైఎ్‌సఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం’ అని పేరు పెట్టారు. మూడేళ్ల కాల వ్యవధిలో(2023 జనవరి) రాష్ట్రమంతా(అటవీ భూములు మినహా) సమగ్ర భూ సర్వే పూర్తిచేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. భూముల సర్వేకోసం రాష్ట్రవ్యాప్తంగా 70 కార్స్‌ బేస్‌స్టేషన్‌లు ఏర్పాటు చేయబోతున్నారు. వీటికి అనుసంధానంగా పనిచేసేలా జీఎన్‌ఎ్‌సఎస్‌ రోవర్స్‌ కొనుగోలుకు టెండర్లు పిలిచారు. అయితే, ఇది కూడా కోలిక్కిరాలేదు. మరోవైపు, ఏపీ సర్కారు సమకూర్చుకున్న కార్స్‌ నెట్‌వర్క్‌ పనితీరుపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో డ్రోన్‌ సర్వే కూడా చేయించాలని సర్కారు నిర్ణయించింది. దీనికిగాను సర్వే ఆఫ్‌ ఇండియా(ఎ్‌సవోఐ)తో డ్రోన్‌ ఒప్పందం చేసుకున్నారు.

    డ్రోన్‌ల ద్వారా భూముల హైడెఫినిషన్‌ ఫొటోలను తీస్తారు. వాటిని అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ప్రాసె్‌సచేసి ఫొటోలను ముద్రిస్తారు. వాటి ఆధారంగా భూమిపై సర్వేనెంబర్‌, సబ్‌ డివిజన్‌ల వారీగా రైతుల సమక్షంలో కొలుస్తారు. దీనికి కూడా అత్యాధునిక జీఎన్‌ఎ్‌సఎస్‌ రోవర్స్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. రోవర్స్‌ ఆధారంగా భూమిపై కంట్రోల్‌ పాయింట్స్‌ను ఎంపిక చేస్తారు. తర్వాత ఆ భూమికి సంబంధించిన స్కెచ్‌ తయారు చేస్తారు. అనంతరం భూమికి అక్షాంశ, రేఖాంశాలను నిర్దేశిస్తారు. 11 అంకెల విశిష్ట సంఖ్యను జారీ చేస్తారు. సర్వేసందర్భంగా తలెత్తే వివాదాలను అప్పీల్స్‌ విభాగాల పరిశీలనకు పంపిస్తారు. అప్పీల్స్‌ కూడా గ్రామస్థాయిలోనే పరిష్కరించేలా రాష్ట్ర సర్వే, సరిహద్దు చట్టం-1923 రూల్స్‌లో మార్పులు ప్రతిపాదించారు. సర్వే, సరిహద్దుల చట్టంలోనూ పలు సవరణలు ప్రతిపాదిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురానున్నారు.

    *తెలంగాణలో భూసమగ్ర సర్వే ఇలా.?
    తెలంగాణ ప్రభుత్వం భూపరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చింది. 1985లో యన్టీఆర్ చేపట్టిన సంస్కరణల తరువాత ఇవే అతి పెద్ద సంస్కరణలు. తెలంగాణలో మొత్తం 1 లక్షా 12 వేల చదరపు కిలోమీటర్ల భూమి, అంటే సుమారు 2 కోట్ల 75 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇందులో 1.55-1.6 కోట్ల ఎకరాలు వ్యవసాయ భూమి, 66.56 లక్షల ఎకరాలు అటవీ భూమి ఉంది. మిగతా రకరకాలు అంటే ప్రభుత్వ భూమి, గ్రామ కంఠాలు, పట్టణాల కింద, ప్రజా ఉమ్మడి ఆస్తుల కింద ఉంది.

    ప్రభుత్వ నిర్ణయాల్లో అతి పెద్దది సమగ్ర భూ సర్వే. దాదాపు 150 ఏళ్ల క్రితం నిజాం రాజుల కాలంలో, బ్రిటిష్ ప్రభుత్వ సూచనతో తెలంగాణలో భూ సర్వే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అవే రికార్డులు ఆధారం. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ రైతుల భూపంచాయితీలు తీర్చాలని భూ సర్వే చేశారు. దానిని ‘ధరణి’ వెబ్సైట్ లోనూ పొందుపరిచారు. దాని ఆధారంగానే తెలంగాణలో ఇక భూ రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించారు.

    తెలంగాణలో ఉన్న ప్రతీ అంగుళం భూమినీ కొలుస్తామనీ, ప్రతీ సర్వే నంబరుకూ కచ్చితమైన కొలమానం, అక్షాంశాలూ, రేఖాంశాలూ (లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్) ఆధారంగా ఇస్తామనీ, దాని వల్ల సరిహద్దు తగాదాలు ఉండబోవనీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. వంద శాతం ఎవరూ రికార్డులు మార్చలేని విధంగా డిజిటలైజ్ చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు.