
కరోనా క్రైసిస్.. లాక్డౌన్ వల్ల చిత్రపరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లింది. తొమ్మిది నెలలుగా థియేటర్లు మూతపడగా.. ఆరేడు నెలలు షూటింగులు వాయిదా పడ్డ సంగతి అందరికీ తెల్సిందే. టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే సినిమా సందడి మొదలైంది. థియేటర్ల ఓపెన్ కు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా నిర్వాహాకులు మాత్రం వాటిని పూర్తిస్థాయిలో తెరవడం లేదు.
థియేటర్ల ఓపెనింగ్ పై కేంద్ర ప్రభుత్వం చేసిన మార్గదర్శకాలు నిర్వాహకులు కొరకరానికొయ్యగా మారాయి. పూర్తిగా కరోనా నిబంధనలు పాటించడంతోపాటు 50శాతం మాత్రమే అక్యుపెన్సీతో నడిపించాలని సూచించాయి. దీంతో థియేటర్ల యాజమాన్యాలు ఓపెనింగ్ పై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోవడం లేదు.
ఓటీటీ.. ఏటీటీ అంటూ ప్రేక్షకుడి దగ్గరికే సినిమాలు వస్తున్నాయి. దీంతో మునిపటిలా ప్రేక్షకులు థియేటర్లు వస్తారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే మునుపటిలా ప్రేక్షకులను థియేటర్ల రప్పించేందుకు టాలీవుడ్లోని పెద్దలంతా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ‘టాలీవుడ్ బోనంజా’ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
టాలీవుడ్ బోనంజాలో భాగంగా బీ.. సీ సెంటర్లలో కొన్ని థియేటర్లను ఎంపిక చేసి పాత సినిమాలను ప్రదర్శించనున్నారు. టాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సృష్టించిన బాహుబలి.. మగధీర.. రంగస్థలం.. టెంపర్ వంటి సినిమాలను ప్రదర్శించనున్నారు. అయితే వీటిని ఫ్రీగా ప్రదర్శించాలా? లేదా ఒకే టికెట్ పై ఈ సినిమాలన్నింటిని ప్రదర్శించాలనేది మాత్రం తేలాల్సి ఉంది.
డిసెంబర్ నెలఖారు వరకు థియేటర్లలో వందశాతం అక్సుపెన్సీకి అనుమతి వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈక్రమంలోనే స్టార్ హీరోలతో ప్రేక్షకులు థియేటర్లకు రావాలని కోరేలా ఓ వీడియో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. గత సినిమాల మాదిరిగానే థియేటర్ల ఎదుట పెద్ద పెద్ద కటౌట్స్.. క్షీరాభిషేకాలతో హంగామా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక క్రిస్మస్.. సంక్రాంతికి నాటికి కొత్త సినిమాలను రిలీజు చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.