https://oktelugu.com/

వీఆర్వోల వ్యవస్థ రద్దుతో అవినీతి అంతం అవుతుందా?

వీఆర్వోల వ్యవస్థను రద్దు చేస్తే అవినీతి అంతం అవుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.  సెప్టెంబర్ 7న వీఆర్వో వ్యవస్థ రద్దు చేస్తూ చట్టం చేశారు. కానీ,  లంచాలకు మరిగిన కొందరి వల్ల వీఆర్వోల వ్యవస్థనే రద్దు చేయడం సరికాదనే చర్చ అధికారవర్గాల్లో సాగుతోంది. లంచాలకు అలవాటుపడ్డ వారిపై చర్యలు తీసుకోకుండా వీఆర్వోల వ్యవస్థను రద్దు చేస్తే అవినీతి పోతుందా ? అంటే ఖచ్చితంగా పోదు. ఈ విషయం కేసీఆర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 14, 2020 10:50 am
    Follow us on

    VRO Corruption

    వీఆర్వోల వ్యవస్థను రద్దు చేస్తే అవినీతి అంతం అవుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.  సెప్టెంబర్ 7న వీఆర్వో వ్యవస్థ రద్దు చేస్తూ చట్టం చేశారు. కానీ,  లంచాలకు మరిగిన కొందరి వల్ల వీఆర్వోల వ్యవస్థనే రద్దు చేయడం సరికాదనే చర్చ అధికారవర్గాల్లో సాగుతోంది. లంచాలకు అలవాటుపడ్డ వారిపై చర్యలు తీసుకోకుండా వీఆర్వోల వ్యవస్థను రద్దు చేస్తే అవినీతి పోతుందా ? అంటే ఖచ్చితంగా పోదు. ఈ విషయం కేసీఆర్ కు  కూడా తెలుసు.నిజంగా కెసిఆర్ కు అవినీతిని  రూపుమాపాలి అని ఉంటే .. వ్యవస్థలను రద్దు చేయడం కాదు. వ్యవస్థలో లొసుగులను  అడ్డంపెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడే ఉద్యోగులను ఉద్యోగం నుంచి పీకేయాలి… అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి…   కటకటాల వెనక్కి నెట్టాలి …  తప్పు చేయాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా ప్రభుత్వ చర్యలుండాలి …  తప్పు చేస్తే చిప్పకూడు తప్పదనే భయం పుట్టాలి…గుండెల్లో రైళ్లు పరుగెట్టించాలి… కింద డైనమెట్లు పేలాలి….ప్రభుత్వ చర్యలు ఆ విధంగా ఉంటే…  అక్రమార్కులకు కళ్లెం పడుతుంది.  అంతే తప్ప వ్యవస్థలను రద్దు చేస్తూ పొతే అవినీతి ఎలా అంతమవుతుంది ?

    Also Read: కర్ర విరగలేదు.. పామును చంపిన కేసీఆర్?

    తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్ పాసుపుస్తకాల బిల్లు 2020, వీఆర్వో ల రద్దు  బిల్లు ప్రవేశ పెడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో…. ” చారిత్రకమైన,  అద్భుతమైన,  ప్రగతికి బాటలు వేసే బిల్లు ఇది. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి రైతులు, నిరుపేదలు, నోరు లేని వారికి అండగా ఉండే అవినీతిరహిత,  సరళీకృత చట్టాన్ని సభలో ప్రవేశ పెడుతున్నందుకు… తెలంగాణ వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉన్నానో ఇప్పుడూ   అంతే సంతోషంగా ఉన్నాను.  రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వర్తించే బిల్లు ప్రవేశపెట్టడం నా పూర్వజన్మ సుకృతం”  అని సీఎం కెసిఆర్ అన్నారు. నిజమే, ఈ బిల్లు పాస్ అవడం వల్ల కలిగే ప్రయోజనం  తెలంగాణ ప్రజలకంటే…కేసిఆర్ కే ఎక్కువ. ఎందుకంటే, అది ఏ విధమైన ప్రయోజనమో  ఆయనకు మాత్రమే తెలుసు. (అందుకే…  శాసనసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టినందుకు కెసిఆర్ సంతోష పడింది,  పూర్వజన్మ సుకృతంగా భావించిందీ. )

    రెవెన్యూ వ్యవస్థలో వీఆర్వోలేనా లంచాలు తీసుకుంటున్నది ? (నేను కొందరు వీఆర్వోలను సమర్ధించడం లేదు )ఈ నెల 7న అసెంబ్లీలో వీఆర్వోల వ్యవస్థ రద్దు బిల్లును ప్రవేశపెట్టి అవినీతి గురించి కెసిఆర్ మాట్లాడుతున్న సమయంలోనే  మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్  112 ఎకరాలకు ఎన్వోసి ఇచ్చేందుకు  కోటి 12 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇదే అవినీతి వ్యవహారంలో నర్సాపూర్ ఆర్డీవో అరుణా రెడ్డి,  ఎమ్మార్వో సత్తార్,  ఏ డి  సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ వసీం, బినామీ  జీవన్ గౌడ్ కూడా అరెస్టు అయ్యారు.

    ఇదే 112 ఎకరాల అక్రమ వ్యవహారంలో రిటైర్డ్ కలెక్టర్ ధర్మారెడ్డి పాత్ర కూడా బహిర్గతమవుతోంది. మేడ్చల్ జిల్లా కీసర మండలం తహసీల్దార్ నాగరాజు 28 ఎకరాల భూమికి పట్టాదార్ పసుపుస్తకాలిచ్చేందుకు  గత నెలలో 1కోటి 10లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇతను గతంలోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెండై తిరిగి విధుల్లో చేరాడు. ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా చేరి తహసీల్దార్ అయ్యాడు. మూడు నెలల క్రితం షేక్ పేట తహసీల్దార్ సుజాత 40 కోట్ల విలువ చేసే భూవ్యవహారంలో లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కారు. పట్టాదార్ పాసుపుస్తకం ఇవ్వకుండా వేధించినందుకు 10నెలల క్రితం తహసీల్దార్  విజయారెడ్డిపై    అబ్దుల్లాపుర్ మేట్ లో రైతు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 4 ఏళ్ల క్రితం అంబర్ పేట్ తహసీల్దార్  సంధ్యారాణి 4 లక్షలు లంచం తీసుకుంటూ అరెస్ట్ అయ్యారు. పెద్దపల్లి ఎమ్మెల్యే  దాసరి మనోహర్ రెడ్డి కొడుక్కి వరంగల్ రూరల్ జిల్లాలో 85 ఎకరాల ప్రభుత్వ భూమిని తహసీల్దార్  అక్రమంగా కట్టబెట్టిన వ్యవహారాన్ని గ్రామస్తులు బట్టబయలు చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. పెద్దపల్లి ఆర్డీఓ గా పనిచేసిన ఓ లంచగొండి, రామగుండం మండలంలో ప్రాజెక్ట్ కింద భూమి కోల్పోయిన నిర్వాసితుల భూపరిహారం చెల్లింపుల్లో 47కోట్లు మింగినందుకు ఇతన్ని  కలెక్టర్ దేవసేన ప్రభుత్వానికి సరెండర్ చేస్తే… సరెండర్ కాకుండా పైరవీ చేసుకొని మరోచోట ఆర్డీఓ గా విధులు నిర్వహిస్తున్నాడన్న చర్చ అధికార వర్గాల్లో ఉంది.

    ఇలా చెప్పుకుంటూ పొతే లంచగొండుల లిస్ట్… కెసిఆర్ ఉద్యమం చేసినంత పొడుగుంటది. ఇటువంటి, రెవెన్యూ వ్యవస్థలో వీఆర్వో నుంచి వివిధ స్థాయిల్లో ఉన్న కొందరు ఎమ్మార్వోలు, ఆర్డీఓలు , కలెక్టర్ లు లంచాలకు మరిగి నిస్సిగ్గుగా అవినీతికి పాల్పడుతుంటే.. తిమింగలాలను వదిలి,  చిన్న చేపలను శిక్షిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ జనాలకు ఏం సంకేతమిస్తున్నట్టు ?  కెసిఆర్… వీఆర్వో ల వ్యవస్థ లాగే ఎమ్మార్వో లు, ఆర్డీఓలు, కలెక్టర్ల వ్యవస్థ ను రద్దు చేస్తాడా ? చెయ్యడు.

    Also Read: కేంద్రంపై కేసీఆర్ కోపం నిజమా? నాటకమా?

    ఇలా ఎవరైనా ప్రశ్నిస్తే  అది నాచేతిలో లేదంటడేమో ! కాని, తల్చుకోవాలేగాని కెసిఆర్ తోని అయితది. ఎందుకంటే….కెసిఆర్ తెగించి కొట్లాడి  తన చేతిలోలేని తెలంగాణను సావునోట్లే తలపెట్టి సాధించలేదా ? సకల జనుల సమ్మె అంటే… నౌకర్లు బందుజేసి ఇంట్ల కూసోలేదా? కెసిఆర్ పిలుపిస్తే ట్యాంకుబండ్ మీద లాఠీలకు తూటాలకు భయపడకుంట తెలంగాణ ప్రజలు మిలియన్ మార్చ్ చేయలేదా ? కెసిఆర్ చెప్తే రోడ్లమీద వంటావార్పు చేసి రోడ్లను దిగ్భంధించలేదా ? బస్సుల నడువనిచ్చిండ్రా ? రైళ్లను కదులనిచ్చిండ్రా ? తెలంగాణ ఏర్పాటుకు అడుగడుగునా అడ్డుపడ్డ సమైఖ్యా ఆంధ్రుల  కుతంత్రాలను తుత్తునియలు చేసి, కేంద్రం మేడలు వంచి తెలంగాణ ఇయ్యక తప్పని పరిస్థితిని కల్పించలేదా  ? ఇన్ని చేసిన కెసిఆర్ ! పిడికెడు మంది అవినీతి పరుల భరతం పట్టేందుకు… లంచగొండులపై, అవినీతి వ్యవస్థలపై కెసిఆర్ యుద్ధం ప్రకటించి కత్తి పడితే… తెలంగాణ సమాజం కెసిఆర్ వెనక నిలబడదా? తలుచుకోక కని ! తలచుకుంటే కెసిఆర్ ఈమాత్రం చేయగలడు.

    -శ్రీరాముల కొంరయ్య 

    Note: Views expressed by author are his own, not of publishers
    రచయిత అభిప్రాయాలు తన వ్యక్తిగతం, ప్రచురణ కర్తలకు చెందినవి కావు