దాదాపు సంవత్సర కాలంగా కరోనా మహమ్మారితో ఫైట్ చేస్తున్న ప్రజలందరికీ ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. ఇన్నాళ్లు కేంద్రం వ్యాక్సిన్ తయారీదారుల నుంచి కొని దేశంలోని ఫ్రంట్ లైన్ వారియర్స్, వైద్యులకు మొదట ఇప్పించింది. ఇప్పుడు రెండో దశలో ప్రజాప్రతినిధులకు ఇవ్వబోతోంది.
ఇప్పుడు మార్చి 1 నుంచి దేశంలోని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టీకాకు సంబంధించి కేంద్రం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఒక్కో డోసు ధరను రూ.250గా నిర్ణయించింది. ఇందులో టీకా ధరతోపాటు.. సర్వీస్ చార్జి ఇమిడి ఉంటుందని తెలిపింది.
వ్యాక్సిన్ రూ.150 కాగా.. సర్వీసు చార్జిగా ఒక్కో వ్యక్తి నుంచి రూ.100 ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేస్తాయని కేంద్రం తెలిపింది.
కొవిడ్ టీకా రెండు డోసుల్లో వేసుకోవాల్సి ఉండడంతో ప్రేవేటులో ఒక్కో వ్యక్తి రూ.500 ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేసే వ్యాక్సిన్ కు అయ్యే ఖర్చును మాత్రమే కేంద్రం భరిస్తోంది.
దేశంలో మార్చి 1 నుంచి 60 ఏళ్ల పైబడినవారు, 45-60 ఏళ్ల మధ్యన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ను కేంద్రం ఉచితంగా వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
ఇక టీకా కొనుగోలు సామర్థ్యం ఉన్న వారికి ప్రైవేటు ఆస్పత్రుల్లో వేసుకునే వెసులుబాటు కల్పించాలని కొన్ని వర్గాల నుంచి కేంద్రానికి వినతులు వచ్చాయి. దీంతోపాటు వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా ఆలస్యం కాకుండా ఉండేందుకే కేంద్రం ప్రైవేటులో వ్యాక్సిన్ ధరను నిర్ణయించి దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రైవేటు ఆస్పత్రులు పాటించి ఈ టీకాను రూ.250కి వేయాల్సి ఉంటుంది.