
ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్టు కరోనా రూపాంతరం చెందుతూ విరుచుకుపడుతూనే ఉంది. మొదటి వేవ్ ను ఎలాగోలా గట్టెక్కామన్న ప్రభుత్వాలు, ప్రజలకు సెకండ్ వేవ్ తో మరింత బలంగా తయారై ముసురుకుంది. లక్షల మందికి సోకుతూ వేల మంది ప్రాణాలు తీస్తోంది. ఇప్పుడు మొదటి వేవ్ నే కాస్త బెటర్ అన్న అభిప్రాయాన్ని మేధావులు వ్యక్తం చేస్తున్నారు. మొదటి వేవ్ లో 60 ఏళ్ల పైబడిన వారు.. ధీర్ఘకాలిక రోగులనే కరోనా పట్టుకెళ్లిపోయింది. కానీ నేడు యువతను బలితీసుకుంటుండడం కలవరపెడుతోంది.
తాజాగా వైద్య, పరిశోధక నిపుణులు మరో బాంబు పేల్చారు. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మూడో వేవ్ ముప్పు కూడా ఉందని.. అది శీతాకాలం వరకు విస్తరించవచ్చన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మూడో వేవ్ ఉంటుందని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా హెచ్చరికలు జారీ చేశారు.
ప్రస్తుతం సెకండ్ వేవ్ ఎంత లేదన్నా కనీసం మూడు నెలలు దేశాన్ని అతలాకుతలం చేస్తుందని సీసీఎంబీ డైరెక్టర్ తెలిపారు. మే నెలాఖరు వరకు దీని తీవ్రత భారీగా పెరుగుతుందని ఆయన అన్నారు. అది కూడా ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే అని హెచ్చరించారు.
ఇక కరోనా సెకండ్ వేవ్ జూన్ మొదటి వారం నుంచి కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సీసీఎంబీ డైరెక్టర్ తెలిపారు. కరోనా మొదటి దశతో పోల్చితే సెకండ్ వేవ్ లో కరోనా తీవ్రంగా మారిందని.. వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన అన్నారు.
ఇప్పటినుంచే దేశ ప్రజలంతా కరోనా ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని.. ప్రతి ఒక్కరూ మహమ్మారికి దూరంగా ఉండకపోతే మూడో వేవ్ కు ఖచ్చితంగా బలి అవుతారని సీసీఎంబీ హెచ్చరికలు జారీ చేసింది.
దీన్ని బట్టి రెండు వేవ్ లతోనే కరోనా అంతం అనుకుంటే పొరబడ్డట్టే. దీనికోసం వెంటనే కరోనా వ్యాక్సిన్లను భారీగా ఉత్పత్తి చేసి అందరికీ వెంటనే వ్యాక్సిన్లు వేస్తేనే కరోనాను కట్టిడి చేయగలం. లేకపోతే ఇది మరింత ప్రబలి వినాశనానికి దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.