ఆశలు..కోరికలు.. ఎక్కువగా ఉండి.. ఆశించిన జీతం తక్కువగా ఉండే మధ్యతరగతి జీవితాల కష్టాలు మాములుగా ఉండవు. రోజంతా కష్టపడి.. పైసా పైసా కూడబెట్టుకొని బ్యాంకులో సేవింగ్ చేద్దామనుకుంటున్న సగటు మిడిల్ క్లాస్ మ్యాన్ కు ధరల పెరుగుదల కుంగదీస్తోంది. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి ప్రజలకు ఇంకా పన్నులు కట్టాలని పిలుపునివ్వడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇటీవల తన స్వగ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై నెట్టింట్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతున్నాయి.
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇటీవల ఉత్తరప్రదేశ్లో పర్యటించారు. ఆయన స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా పలు విషయాలు వెల్లడించారు. ప్రభుత్వానికి పన్నులు కట్టాలని అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. తనకు రూ.5 లక్షల జీతం వస్తుందని, అయితే అందులో వివిధ పన్నుల రూపంలో రూ.2,70,000 ప్రభుత్వానికే వెళ్తుందని అన్నారు. నాకంటే టీచర్లు ఎక్కువగా సేవింగ్స్ చేస్తారని చెప్పొకొచ్చారు. అందువల్ల ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి పన్నులు చెల్లించి తోడ్పడాలన్నారు.
అయితే రాష్ట్రపతి కోవింద్ చేసిన వ్యాఖ్యలపై కొంతమంది లా పాయింట్ బయటికి తీశారు. వాస్తవానికి రాష్ట్రపతికి ఎలాంటి పన్నులు ఉండవని, ఆయన జీతానికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుందని అంటున్నారు. అలాంటప్పుడు ఆయన ప్రభుత్వానికి పన్నులు ఎలా కడుతారని చర్చిస్తున్నారు. కొందరైతే రాష్ట్రపతి పదవిలో ఉండి అబద్దాలు చెబతున్నారని ట్రోలింగ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఓ వైపు పెట్రోల్, నిత్యావసరాల ధరలతో ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరోక్షంగా అనేక రకాలుగా పన్నులు చెల్లిస్తున్నారు. అయితే పెట్రోల్ ధరల పెరుగుదలపై ప్రజల నుంచి వస్తున్న విమర్శలపై రాష్ట్రపతి ఇలా వ్యాఖ్యలు చేశారా..? అన్న చర్చ సాగుతోంది. జీఎస్టీతో పాటు ప్రజల ఆదాయంపై 20 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వం వసూలు చేస్తూనే ఉంది. దీంతో రాష్ట్రపతి ఇలా వ్యాఖ్యలు చేయడంపై మధ్యతరగతి ప్రజల్లో తీవ్ర చర్చ సాగుతోంది.