
ప్రతిసారి మంత్రి కేటీఆర్ సీఎం అవుతారని.. కేసీఆర్ దిగిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం జరగడం.. చివరకు వాటి రిజల్ట్స్ చూసి సీఎం కేసీఆర్ అందరి ఆశలపై నీళ్లు చల్లడం చూస్తూనే ఉన్నాం. ఎప్పటిలాగే ఈరోజు కేసీఆర్ మరోసారి టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కుండబద్దలు కొట్టారు. పదేళ్లు తానే సీఎం అని బల్లగుద్ది చెప్పారు.
కేటీఆర్ ను సీఎం చేస్తారని కొండంత ఆశలు పెట్టుకున్న కేటీఆర్ వర్గానికి కేసీఆర్ షాకిచ్చారు. మరో పదేళ్ల పాటు కేటీఆర్ ను సీఎం చేయడం కుదరదని తేల్చిచెప్పారు. కేటీఆర్ కూడా ఇన్నాళ్లు సీఎం వార్తలపై మౌనంగా ఉన్నారు. దీంతో ఆయన అవుతాడని కావచ్చు అని మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఆయన పాట పాడారు. ఇప్పుడు వారందరి ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారు.
తన కోటరీలో ఇంత తతంగం జరుగుతున్నా సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారు. మౌనం అర్థాంగికారం అనే రేంజ్ లో ఆయన ఊరకుండి పోయారు. కాగా ఇన్ని రోజుల ఆయన మౌనం వెనుక ఆంతర్యం ఏంటనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న..
దుబ్బాక ఓటమి, ఇటు జీహెచ్ఎంసీలో ఎదురుగాలి వీయడంతో టీఆర్ఎస్ పార్టీపై ప్రతిపక్షాలు పదునైన విమర్శలు సంధిస్తున్నాయి. ఇటు పార్టీ కేడర్ లోనూ సీఎం కేసీఆర్ పై విశ్వాసం సన్నగిల్లుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ గ్రహించినట్టు సమాచారం. ఈ పరిణామాలను సైడ్ ట్రాక్ చేసేందుకు మరోసారి కేటీఆర్ సీఎం అనే వాదనను తెరపైకి తెచ్చేలా ఆయన వ్యూహరచన చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ మాయలో పడి పార్టీ నాయకులు కూడా ఆ వాదాన్ని ప్రజల్లోకి మోసుకుపోగలిగారు. ఇప్పుడు కేటీఆర్ సీఎం అంశం తెరపైకి రావడంతో పాత ఓటములు అన్నీ పక్కకు పోయాయి.
ఈ ప్రచారాన్ని ఎక్కువ కాలం కొనసాగిస్తే కొత్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పటికీ సీఎం పదవికి కేటీఆర్ కన్నా ఈటల బాగా సరిపోతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహా చాలా మంది బహిరంగంగా సూచించారు. మరోవైపు బీసీ నాయకుడు బెటర్ అంటూ బీజేపీ సహా నేతలు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తేవడం కేసీఆర్ ను ఇరుకునపెట్టింది. సీఎంగా ఈటలకు మద్దతు పెరుగుతోంది. ఇలాంటి సందర్భబంలో ఈ వాదం మరికొన్ని రోజులు కొనసాగితే మరింత గందరగోళంతోపాటు కొత్త నేతలు తెరపైకి వచ్చే అవకాశాలున్నాయని కేసీఆర్ లో గుబులు పుట్టినట్టు సమాచారం. ఇదే జరిగితే పార్టీలో అంతర్గత విభేదాలు ఏర్పడి పార్టీ భవిష్యత్ నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయని టీఆర్ఎస్ అధిష్టానంలో కలవరం మొదలైనట్టు సమాచారం.
అందుకే పరిణామాలు వేగంగా మారడంతో సీఎం కేసీఆర్ ఈ ప్రచారాన్ని ఎక్కువ కాలం కొనసాగించవద్దని అనుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే పదేళ్ల వరకు నేనే సీఎం అని కేటీఆర్ సీఎం అన్న ప్రచారానికి ముగింపు పలికారని అంటున్నారు.