తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తి దాదాపు వారం అవుతోంది. వారం రోజులుగా సైలెంట్‌గా ఉన్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు.. ఇప్పుడు హడావుడి చేస్తున్నాయి. వానలు.. వరదలు.. బురదతో ఓ వైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఇద్దరు సీఎంలూ ఇన్నాళ్లు వేచిచూశారు. ఇక మహానగరమైన హైదరాబాద్‌లో అయితే..పరామార్శలకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. అయినా.. వారిని పట్టించుకునే లేరు.
Also Read: సీఎం జగన్ మతాన్ని కూడా వదలడం లేదే?
ఈ వారం రోజులు కూడా ప్రజలు పడిన బాధలు అన్నీఇన్నీ కావు. వరదల్లో బట్టలు.. డబ్బులు.. బియ్యం.. ఉప్పులు.. పప్పులు.. ఏవి లేకుండా మొత్తం కొట్టుకుపోయాయి. అప్పటి నుంచి ఆయా కాలనీల వేలాది మంది ప్రజలు దాతలు ఇచ్చిన భోజనం మాత్రమే తిన్నారు. వారిచ్చిన నీళ్లనే తాగుతూ కాలం వెళ్లదీశారు. మరోవైపు మహానగరంలో శవాల గుట్టలు. చెరువుల కబ్జాలు.. నాలాలు ఉప్పొంగి అసలు ఎంత మంది కొట్టుకుపోయారో కూడా లెక్కలు తెలియని నిజం. ఇప్పటికే పదుల సంఖ్యలో మృతదేహాలు బయటకు వస్తూనే ఉన్నాయి. కొన్ని మృతదేహాలు దొరుకుతున్నా.. దొరకని శవాలు మరెన్నో. ఇన్ని బాధలు పడుతున్న భాగ్యనగర ప్రజలకు తక్షణ సాయం ప్రకటించాల్సిన ప్రభుత్వం.. వారం రోజులకు తేరుకుంది. ఇన్ని రోజులకు సాయం ప్రకటించింది.
హైదరాబాద్‌లో వరద ముంపునకు గురైన ప్రతి ఇంటికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని నిన్న సీఎం కేసీఆర్ ప్రకటించాడు. ఈ ఆర్థిక సాయం మంగళవారం నుంచే అందిస్తామని చెప్పుకొచ్చాడు. ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ.లక్ష చొప్పున, పాక్షికంగా కూలిపోయిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించాడు. దెబ్బతిన్న రోడ్లు, మౌలిక వసతులకు యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేపట్టి మళ్లీ మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని ఆఫీసర్లను ఆదేశించాడు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు వరదలతో ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నాడు. ‘గడిచిన వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం హైదరాబాద్‌లో కురిసింది. ప్రజలు అనేక కష్టనష్టాలకు గురయ్యారు. ముఖ్యంగా నిరుపేదలు, బస్తీల్లో ఉండేవారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు కష్టాలపాలయ్యారు. వారిని ఆదుకోవడమే ప్రభుత్వ ప్రాథమిక విధి. ఇంత కన్నా ముఖ్యమైన బాధ్యత మరొకటి ఉండదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
మరోవైపు ఏపీలో భారీ నష్టమే సంభవించింది. వరద వచ్చినప్పుడు సైలెంట్‌గా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ..ఆరు రోజుల తర్వాత ఏరియల్ సర్వే నిర్వహించారు. మూడు జిల్లాల్లో హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే చేశారు. నిజానికి ఏ సీఎం అయినా వరద తీవ్రంగా ఉన్నప్పుడే పరిశీలన చేస్తారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించి పంట నష్టం అంచనాలను కేంద్రానికి పంపుతారు. కేంద్ర సాయం అడుగుతారు. అయితే ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండానే కేసీఆర్ రూ. నాలుగు వేల నాలుగు వందల కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి లేఖ రాశారు.
Also Read: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..?
సాయంత్రం 4 గంటల సమయంలో మరో ఇరువురు మంత్రులు కొడాలి నాని, హోంమంత్రి సుచరితతో కలిసి ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణాజిల్లాలో ఏరియల్ వ్యూ నిర్వహించారు. హెలికాప్టర్‌లో మూడు జిల్లాల్లో ఏరియల్ వ్యూ ద్వారా తుపాన్ పీడిత ప్రాంతాలను పరిశీలించారు. కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడంతోపాటు వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పంట నష్టం నివేదికలను, కూలిన, దెబ్బతిన్న ఇళ్ల వివరాలను తక్షణం పంపాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇద్దరు సీఎంల వైఖరి చూస్తున్న ప్రజలు విమర్శలు చేస్తున్నారు. వరదలతో నష్టపోయిన బాధితులకు తక్షణ సాయం అందించకుండా నింపాదిగా వారానికి సర్వేలు చేయడం.. వారానికి పరిహారం ప్రకటించడం ఏంటని నిలదీస్తున్నారు. ప్రజల బాధలు వీరికి పట్టవా..? ప్రజల కష్టాలు వీరికి తెలియదా..? ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత వీరిపై లేదా..? అనే ప్రశ్నలే వినిపిస్తున్నాయి.