భారతదేశం.. సర్వమతాలకు నిలయం. కులమతాలకతీతంగా సోదరుల్లా కలిసిమెలిసి ఉండే దేశం. అందరినీ అక్కున చేర్చుకునేది మన దేశం. కానీ.. ఇప్పుడు ఏపీలో మతపరమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పటికే జగన్‌ను అన్నివిధాలా టార్గెట్ చేసిన టీడీపీ.. చివరికి ఆయన మతాన్ని కూడా వదల్లేదు. ఎవరు ఏ మతం తీసుకోవాలనుకున్నా అది వారి స్వతంత్రం.
Also Read: గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలు రాసిన వాళ్లకు శుభవార్త..?
ఇటీవల తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం హోదాలో జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే.. దీనిపైనా రాద్ధాంతం చేసింది ప్రతిపక్ష టీడీపీ. అంతేకాదు.. హిందూయేతరులు ఆలయంలోకి వెళ్లే ముందు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని.. అది ఇవ్వకుండానే జగన్ ఆలయంలోకి ప్రవేశించారంటూ దుయ్యబట్టింది. అంతేకాదు.. దీనిపై గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన సుధాకర్‌బాబు హైకోర్టులో కో-వారెంటో పిటిషన్ దాఖలు చేశాడు.
తాజాగా.. పిటిషనర్ వాదనతో హైకోర్టు విభేదించింది. సీఎం జగన్ హిందువు కాదని.. క్రైస్తవుడని ఏ ఆధారంతో చెబుతారని ప్రశ్నించింది. అలాంటి ఆధారాలుంటే తమ ముందుంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఆధారాల్లేకుండా సీఎం మతం గురించి మాట్లాడడం సరికాదని పేర్కొంది. తగిన ఆధారాలుంటేనే తదుపరి విచారణను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అదేవిధంగా పిటిషన్‌లో ప్రతివాదిగా గవర్నర్ పేరును ప్రస్తావించడాన్ని ఆక్షేపిస్తూ.. దానిని సుమోటోగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
గవర్నర్‌ను ప్రతివాదిగా పేర్కొన్నప్పటికీ ఆ పిటిషన్‌కు ఎలా నంబరు కేటాయించారంటూ రిజిస్ట్రీని(జుడీషియల్)ని పిలిపించి అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..?
సుధాకర్ వేసిన పిటిషన్‌లో.. చట్టాన్ని ఉల్లంఘించిన సీఎం జగన్, మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఏ అధికారంతో ఆయా పదవుల్లో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ అభ్యర్థించారు. దీనిపై సోమవారం పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. హిందూయేతరులు శ్రీవారిని దర్శించుకోవాలంటే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని, కానీ జగన్ దీనిని పాటించలేదన్నారు. ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని ప్రభుత్వాధినేతే ఉల్లంఘించడం సరికాదన్నారు. ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రులు వెలంపల్లి, కొడాలి వ్యాఖ్యానించారని కోర్టుకు తెలిపారు. నిబంధనలు అమలు చేయడంలో టీటీడీ చైర్మన్, ఈవో విఫలమైనందున వారిని ఆ పదవుల నుంచి నిలువరించాలని కోరారు. జగన్ ఏ మతస్థుడన్నదానిపై ప్రజల్లోనూ సందేహాలున్నాయని, వాటిని కూడా నివృత్తి చేయాల్సిన ఆవశ్యకత రాష్ట్ర పాలకుడిగా జగన్‌కు ఉందని వాదించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం, టీటీడీ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో జగన్ విషయంలో ఎందుకు ఈ మత రాజకీయాన్ని ఎత్తుకున్నారన్నది తెలియకుండా ఉంది.