బీజేపీ పెద్దాయన.. ప్రధాని నరేంద్రమోడీ సొంత ఇలాఖాలో జరిగిన ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షించాయి. దేశవ్యాప్తంగా ధరలు విపరీతంగా పెరిగిన వేళ.. వరుసగా నాలుగైదు సార్లు గుజరాత్ లో బీజేపీ స్థిరంగా గెలుస్తున్న వేళ వచ్చిన ఈ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
తాజాగా జరిగిన గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రధాని మోడీయే కాదు.. దేశంలోనే నంబర్ 2 అయిన అమిత్ షా స్వరాష్ట్రం కూడా గుజరాత్ కావడం గమనార్హం. అయితే వీరిద్దరూ కూడా సొంత రాష్ట్రంలో పట్టు నిలుపుకున్నారు. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలోనూ భారీ విజయం సాధించారు.
గుజరాత్ రాష్ట్రంలోని ఆరు కార్పొరేషన్లలో మొత్తం 576 డివిజన్లకు ఎన్నికలు జరుగ్గా.. బీజేపీ ఏకంగా 466 డివిజన్లలో విజయం సాధించి సత్తా చాటింది. ప్రతిపక్షం కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపించలేదు. కేవలం 45 స్థానాలకే పరిమితమైంది.
ఈ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ బోణీ కొట్టింది. సూరత్ కార్పొరేషన్ లో 27 డివిజన్లలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకొని సత్తా చాటింది. ఎంఐఎం పార్టీ ఏడుస్థానాల్లో విజయం సాధించింది.