కేంద్రం ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణ పేరిట ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కొత్తగా మూడు బిల్లులను తీసుకొచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ గడిచిన 11రోజులుగా పంజాబ్.. హర్యానా.. యూపీకి చెందిన రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్నారు. కేంద్రంపై రైతులు చేస్తున్న పోరాటానికి అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు లభిస్తుండటంతో ఇదికాస్తా దేశవ్యాప్త ఉద్యమంగా మారింది.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ బిల్లుపై రైతులకు.. కేంద్రానికి మధ్య పలుసార్లు చర్చలు జరిగాయి. అయితే ఎలాంటి ఫలితం లేకుండా చర్చలు ముగిశాయి. ఓవైపు చర్చలు కొనసాగుతుండగానే రైతు సంఘాల నాయకులు డిసెంబర్ 8న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కాంగ్రెస్.. టీఆర్ఎస్, టీడీపీ సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.
రేపటి భారత్ బంద్ నేపథ్యంలో రైతు సంఘాల నేతలు పలుమార్పులు చేశారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకే బంద్ నిర్వహించనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ తాజాగా వెల్లడించారు. బంద్ వల్ల సామాన్యులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశ్యంతో కేవలం నాలుగు గంటలు బంద్ పాటించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
11గంటల నుంచి బంద్ కొనసాగనున్న నేపథ్యంలో ఉద్యోగాలకు వెళ్లేవారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యాలయాలకు వెళ్లవచ్చని తెలిపారు. ఇక అత్యవసర సర్వీసులైన అంబులెన్స్‌లు.. పెళ్లిళ్లు యథావిథిగానే జరుగుతాయని తెలిపారు. రైతులు చేపడుతున్న ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతుందని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులను మాత్రం తాము అంగీకరించేది లేదని రాకేశ్ టికాయత్ స్పష్టం చేయడం చేశారు.