హైదారబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ‘ఇద్దరూ ఇద్దరే’ అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమాలో నాగేశ్వరరావు గారిది ప్రత్యేకమైన పాత్ర. ఉదయమే షూటింగ్ కోసం నటీనటులు అందరూ వస్తూ ఉన్నారు. కానీ అప్పటికే అక్కినేని మేకప్ తో రెడీగా కూర్చుని కనిపించేవారు. ఇక సెట్ లో లైటింగ్ జరుగుతున్న సమయంలో నాగేశ్వరరావుగారు ఎవ్వరికీ ఇబ్బంది ఇవ్వకూడదు అని సెట్ కి దూరంగా కూర్చునేవారు.
అయితే, ఆ సినిమా దర్శకుడు కోదండ రామిరెడ్డి వాష్ రూమ్ కు వెళ్లడానికి సెట్ బయట ఉన్న వాష్ రూమ్స్ కి వచ్చేవారు. అక్కినేని ముందునుంచే ఆయన వెళ్లాల్సి వచ్చేది. అప్పటికే అన్నపూర్ణ స్టూడియో సిబ్బందితో మాట్లాడుతూ ఉన్న నాగేశ్వరరావు గారు, కోదండ రామిరెడ్డిని చూడగానే ఠక్కున లేచి నిల్చునేవాళ్లట. కోదండ రామిరెడ్డి వెళ్లిన తరువాతే నాగేశ్వరరావు గారు మళ్లీ కూర్చునేవారట.
దర్శకుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా నాగేశ్వరరావు గారు అలాగే చేసేవారట. మహా సినీ దిగ్గజం అయి ఉండి, అప్పుడే దర్శకుడిగా ఎదుగుతున్న ఒక కుర్రాడికి అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇదే విషయాన్ని పక్కన ఉన్న మరో సీనియర్ నటుడు ప్రశ్నిస్తే.. ‘నేను దర్శకుల విలువ తెలిసినవాణ్ణి. ఇంత సీనియారిటీ ఉన్న నాలాంటి నటుడు కూడా దర్శకుడిని గౌరవించకపోతే, ఇక కొత్త తరం నటులు అసలు గౌరవించరు.
సినిమా సెట్ లో దర్శకుడనేవాడు తండ్రిలాంటి వాడు, ఒక మాస్టర్ లాంటి వాడు, నటులు పిల్లలు, స్టూడెంట్స్ లాంటి వారు అని అక్కినేని అన్నారట. నిజంగా అక్కినేనిది ఎంతో గొప్పతనం అనుకున్నారు అక్కడున్నవారంతా. ఇక ఇదంతా కోదండరామిరెడ్డి గమనించలేదు. నాగేశ్వరరావు గారు మామూలుగా లేచి నిల్చున్నారేమో అనుకున్నారట. కొన్ని రోజులు తరువాత తనని చూసి లేచి నిలబడుతున్నారని అర్థమై.. సిగ్గుతో చితికిపోయి, ఆయన నేరుగా వెళ్లి ఏఎన్నార్ పాదాల మీద పడ్డారు. ఆ తర్వాత కూడా అక్కినేని దర్శకులను అలాగే గౌరవించేవారు.