Roadside Tree Painting : మనిషికి చెట్టుకు అవినాభావ సంబంధం ఉంది. చెట్లు లేకుండా మానవాళి మనుగడ సాధ్యం కాదు. చెట్లు మనకు ప్రాణవాయువును అందజేస్తాయి. చెట్లు లేకపోతే కరువు తాండవిస్తుంది. పూర్వం లాగా అడవులు లేవు. ప్రస్తుతం అంతా కాంక్రీట్ జంగల్ గా మారిపోయింది. అందుకే అవకాశం ఉన్న చోటల్లా చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుకుంటున్నారు. ఆ క్రమంలోనే రోడ్లు వెంబడి చెట్లు నాటుతుంటారు. సాధారణంగా మనం ఎక్కడి కైనా ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఎత్తైన చెట్లు ఉండడాన్ని చూసే ఉంటాం. వాటిని ఎప్పుడైనా జాగ్రత్తగా పరిశీలించారా? ఈ చెట్లకు ఎల్లప్పుడూ దిగువ భాగంలో అంటే కాండం మీద తెల్లని రంగులో పెయింట్ చేసి ఉంటుంది. ఈ చెట్లకు ఒకే రకమైన పెయింట్ అంటే తెలుపు రంగు ఎందుకు వేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
రోడ్డు పక్కన ఒక గ్రీన్ బెల్ట్ తయారు చేస్తారు. దీని ముఖ్య ఉద్దేశ్యం పచ్చదనాన్ని ప్రోత్సహించడం. అంతేకాకుండా, ఈ గ్రీన్ బెల్ట్ ప్రమాదాలను కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఇప్పుడు వాటికి తెల్లని రంగు ఎందుకు వేస్తారో తెలుసుకుందాం. తెలుపు రంగు పెయింట్ ప్రధానంగా మొక్కలను రక్షించడానికి ఉపయోగిస్తారు. సున్నం సాధారణంగా రోడ్డు పక్కన చెట్ల(Road Side Trees) కు పెయింట్ చేసేందుకు ఉపయోగిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం చెట్టుకు సున్నం పూస్తే చెట్టు బెరడులలో పగుళ్లు ఏర్పడదు. ఇది చెట్టు కాండాన్ని బలపరుస్తుంది. సున్నంతో పెయింట్ చేసినప్పుడు మూలానికి చేరుకుంటుంది.
సున్నం కారణంగా కీటకాలు చెట్టు వేర్లపై దాడి చేయలేవు. ముఖ్యంగా చెదపురుగులు చెట్టు చెంతకు రావు. ఇది మొక్క జీవిత కాలాన్ని(Life Span) బాగా పెంచుతుంది. చెట్టు బయటి పొరకు రక్షణను అందిస్తుంది. కార్నెల్ యూనివర్సిటీ విధ్యార్థుల పరిశోధకుల ప్రకారం చెట్టుకు తెల్లటి పెయింట్ చేయడం వల్ల నేరుగా సూర్యకాంతి వల్ల చెట్టు దెబ్బతినే అవకాశాలను తగ్గిస్తుంది. దాని తెలుపు పెయింట్ కారణంగా చెట్టు ట్రంక్‌కు తక్కువ నష్టం ఏర్పడుతుంది. చెట్టుకు తెల్లగా రంగు వేయడం వెనుక మరో కారణం కూడా ఉంది. రోడ్డుపక్కన నాటిన చెట్లకు తెలుపు రంగు ఉండడంతో ఈ చెట్లు అటవీశాఖ పర్యవేక్షణలో ఉన్నాయన్న సంకేతాన్ని సూచిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులెవరూ ఈ చెట్లను నరకడానికి అనుమతి ఉండదు.