WhatsApp Premium: సాంకేతిక పరిజ్ఞానం మనిషి మనుగడను నిర్దేశిస్తున్నది. ఒకప్పుడు అనవసరం అనుకున్నదే ఇప్పుడు అత్యవసరం అయిపోయింది. అందులో ముఖ్యమైనది స్మార్ట్ ఫోన్. మొదట్లో కేవలం సమాచారం కోసమే కనుక్కున్న ఫోన్.. ఇప్పుడు అనేక రూపాలు మారి స్మార్ట్ ఫోన్ గా ఎదిగింది.. మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ అనేక సౌలభ్యాలను మనుషులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.. అలాంటి సౌకర్యమే వాట్సప్. మొదట్లో దీనిని కొంతమంది మాత్రమే వాడేవారు. కానీ రాను రాను వాడకం పెరిగి పోతుండడంతో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఇన్ బిల్ట్ గా వాట్సప్ అప్లికేషన్ ను లోడ్ చేసి ఇస్తున్నాయి. దీంతో సమాచార విస్తృతి కోసం వాట్సప్ వినియోగం అనివార్యం అయిపోయింది. అందుకే ప్రస్తుతం భారతదేశంలో సుమారు 30 కోట్ల మంది దాకా వాట్సప్ యూజర్లు ఉన్నారని సమాచారం.. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ కావడంతో వాట్సాప్ అప్లికేషన్ ను ప్రమోట్ చేస్తున్న మెటా కంపెనీ మరింత ఆదాయం కోసం ఈసారి కొత్త ఎత్తుగడ వేసింది. ప్రీమియం పేరుతో వినియోగదారులను బాదేందుకు సిద్ధమైంది.

యూట్యూబ్ తరహాలో..
వాట్సప్ కూడా యూట్యూబ్ తరహాలో త్వరలో ప్రీమియం ఎకౌంటు సర్వీసును అందించనుంది.. ఈ ప్రత్యేక సర్వీస్ పొందాలంటే సబ్ స్క్రిప్షన్ తప్పనిసరి. ప్రస్తుతం పలువురు మెటా వినియోగదారుల పై ఈ కొత్త వెర్షన్ ను పరీక్షిస్తోంది. ఈ కొత్త సర్వీసును సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్లకు ప్రీమియం మెనూ, అదనపు ఫీచర్లు ఉంటాయి. అయితే ఈ విషయంలో సాధారణ యూజర్లు కంగారు పడాల్సిన అవసరం లేదని కంపెనీ చెబుతోంది. ఈ కొత్త వాట్సాప్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కేవలం వాట్సాప్ బిజినెస్ వెర్షన్ కోసం విడుదల చేస్తున్నట్టు కంపెనీ పేర్కొంటున్నది. కొత్తగా రాబోతున్న ఈ సర్వీసులో ప్రత్యేక పేర్లతో వాట్సాప్ కాంటాక్ట్ లిస్టును క్రియేట్ చేసుకుని అందరికీ షేర్ చేసుకోవచ్చు. అంతేకాక ఏకకాలంలో 10 డివైస్లలో లాగిన్ అయ్యే ఆప్షన్ ఉంటుంది.. ప్రీమియం వెర్షన్లో 22 మందితో వీడియో కాల్ మాట్లాడవచ్చు. అయితే వీటికి ఎంత ఛార్జ్ చేస్తారనేది ఇంతవరకు కంపెనీ చెప్పలేదు. కాగా వాట్సప్ అప్లికేషన్ ను ప్రమోట్ చేస్తున్న మెటా కంపెనీ ఇప్పటికే ఫేస్బుక్, ఇన్ స్టా గ్రామ్ ద్వారా చాలా ఆదాయాన్ని పొందుతోంది.. ఎలాంటి ప్రకటనలు లేదా సబ్స్క్రిప్షన్ ప్లాన్లు వంటి ఆదాయ వనరులు లేకుండా కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్న సేవ వాట్సాప్ మాత్రమే.. అందుకే దీని నుంచి కూడా ఆదాయాన్ని ఆర్థించాలనే ఉద్దేశంతో మెటా కంపెనీ ఈ ప్రీమియాన్ని తెరపైకి తీసుకు వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకోసమే నిర్దిష్టమైన వ్యాపారాల కోసం ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకురాబోతుందని వారు అంటున్నారు. అయితే ఈ ప్రీమియం వెర్షన్ ఒక ఆప్షన్ మాత్రమేనని, కచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం లేదని మెటా కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

మరోవైపు ఇప్పటివరకు ఉన్న గ్రూప్ సభ్యుల సంఖ్యను మరింత పెంచేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. సంఖ్యను 1200 పై చిలుకుకు చేసేందుకు ఆ కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కసరత్తు చేపడుతున్నారు. భారతదేశంలో ఇప్పటికే మెజారిటీ వినియోగదారులను కలిగి ఉన్న వాట్సాప్.. ఆ సంఖ్యను మరింత పెంచుకునేందుకు కసరత్తులు చేపడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పోలిస్తే మెటా కంపెనీకి కేవలం భారతదేశం ద్వారా సంవత్సరానికి వేలకోట్ల ఆదాయం వస్తోంది. దీనిని పెంచుకునేందుకు కంపెనీ రకరకాల ఎత్తు గడలు వేస్తోంది. ఒక సాధారణ అప్లికేషన్ గా ప్రారంభమైన వాట్సప్.. ఈ రోజున కోట్లాదిమందికి ఒక అత్యవసరమైన సమాచార వ్యాప్తి కేంద్రంగా మారింది అంటే అతిశయోక్తి కాక మానదు. వాట్సప్ సృష్టించిన ప్రభంజనం వల్ల వే టూ ఎస్ఎంఎస్ అనే కంపెనీ దెబ్బకు తన సేవలను మరో మార్గంలోకి మళ్లించాల్సిన అవసరం ఏర్పడింది. కాలానికి అనుగుణంగా వాట్సాప్ ఇంకెన్ని ఫీచర్లను అందుబాటులోకి తెస్తుందో వేచి చూడాల్సి ఉంది.