Human Sacrifice In Kerala: మంత్రాలకు చింతకాయలు రాలవు. ఇది ఎప్పటినుంచో ఉన్న నానుడి అయినప్పటికీ.. చాలామంది ఇప్పటికి మంత్రాలను, తంత్రాలను మూఢనమ్మకాలను గట్టిగా విశ్వసిస్తూ ఉంటారు. ఆ పిచ్చిలో పడి చేయరాని పనులు చేస్తుంటారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సామెత తెలిసి కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలగంటారు. కానీ అదే సమయంలో ఒళ్ళు వంచి పని చేసేందుకు మాత్రం ఇష్టపడరు. ఇలాంటి జాబితాలో విద్యావంతులు అధికంగా ఉండడం దురదృష్టకరం. అయితే ఇలాంటి కోవకే చెందిన కేరళలోని పతినంతిట్ట లో ఓ దంపతులు అత్యంత కిరాతకానికి పాల్పడ్డారు. మానవమాత్రులు ఎవరూ చేయని దారుణానికి ఒడిగట్టారు. ఇంతకీ వారు ఏం చేశారు అంటే?

నరబలి ఇచ్చారు
కేరళలో ఇప్పుడు నరబలి ఘటన కలకలం రేపుతున్నది. మూఢనమ్మకాల పేరుతో ఓ జంట ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా హత్య చేసింది. పతినంతిట్ట జిల్లా తిరువళ్ల పట్టణంలోని ఎలంతూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది . ఒక్కసారిగా ధనవంతులు కావాలని ఆశతో నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఎర్నాకులం జిల్లాకు చెందిన రోస్లిన్, పద్మ అనే ఇద్దరు మహిళలు జూన్, సెప్టెంబర్ నెలలో కనిపించకుండా పోయారు. దీనిపై ఆ మహిళల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును అన్ని కోణాల్లో చేపట్టారు.. అయితే ఇదే క్రమంలో వారు విస్తు పోయే వాస్తవాలు ఒక్కొక్కటిగా కళ్ళకు కట్టాయి. పద్మ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఆమె హత్యకు గురైనట్టు తెలిసింది.. పోలీసులు బాధితుల ఫోన్లను ట్రేస్ చేయగా ఈ నరబలి వెలుగులోకి వచ్చింది.

ఎలంతూర్ ప్రాంతానికి చెందిన నాటు వైద్యుడు భగవల్ సింగ్, అతని భార్య లైలా పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. వారికి రాత్రికి రాత్రే ధనవంతులు కావాలని ఆశ పుట్టింది. ఇందుకు నరబలే ఉత్తమమైన మార్గమని వారు భావించారు. దీంతో మహిళలను నరబలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వీరికి పెరంబుర్ కు చెందిన షఫీ అలియాస్ రషీద్ సహాయం చేశాడు. ఇద్దరు మహిళలకు డబ్బు ఆశ చూపి కిడ్నాప్ చేశాడు. వారిని తిరువళ్లలోని నాటు వైద్యుడి ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో ఆ నాటు వైద్యుడు చేతబడి పేరుతో వారిని వివస్త్రలు చేసి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వారిని అత్యంత ఘోరంగా హత్య చేశాడు. మహిళల నాలుక కోసి, తలలు నరికి, శరీరాలను ముక్కలుగా చేసి తిరువళ్ల పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టాడు. ఇదే క్రమంలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా రోస్లిన్ అనే మహిళను కూడా అదే ఇంట్లో నరబలి ఇచ్చినట్లు అంగీకరించారు. ఆమెను కూడా ఇదేవిధంగా చిత్రవధ చేసి చంపినట్లు అంగీకరించారు. కాగా ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసినట్టు కొచ్చి పోలీస్ కమిషనర్ సిహెచ్ నాగరాజు వెల్లడించారు. సదరు మహిళలకు రషీద్ డబ్బు ఆశ చూపి ఆ నాటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లినట్టు పోలీసుల విచారణలో తేలింది. అయితే చనిపోయిన ఇద్దరు మహిళలు లాటరీ టికెట్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగించేవారు. ఇదిలా ఉండగా అక్షరాస్యత ఎక్కువగా గల కేరళలో ఇలాంటి ఘటన జరగడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
[…] […]