Tholi Ekadasi 2023: మనకు తొలి పండగ ఏకాదశి. దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజే శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటారు. అందుకే దీన్ని అలా పిలుస్తుంటారు. మన సంప్రదాయం ప్రకారం దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి మళ్లీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు. నాలుగు నెలలు నిద్రలోనే ఉంటాడు. దీన్నే చాతుర్మాసంగా చెబుతుంటారు. ఏకాదశి రోజు ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదో కూడా స్పష్టంగా చెప్పారు. అవేమిటో చూద్దాం.
ఉపవాసం చస్తే..
తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే చాలా మంచిదని అంటారు. తొలి ఏకాదశి ఉపవాస దీక్షను ఆచరించకుండా మాంసం, జంక్ ఫుడ్స్, గుమ్మడికాయ, మినుములతో చేసిన పదార్థాలు తినడం వల్ల నష్టాలు కలుగుతాయి. అబద్దాలు ఆడరాదు. చెడు పనులు చేయకూడదు. విష్ణువును ఆరాధించాలి. అప్పుడే మనకు మంచి ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతారు.
దానధర్మాలు
ఏకాదశి రోజు దానధర్మాలు చేయడం శ్రేయస్కరం. దీంతో మోక్షం కలుగుతుంది. ఈ రోజు శరీరం, మనసుపై నియంత్రణ ఉండాలి. విష్ణువును తులసి దళాలతో పూజిస్తే మంచి పుణ్యం లభిస్తుంది. ఈ రోజు తులసి చెట్టు నుంచి ఆకులు తెంచకూడదు. విష్ణు నామస్మరణలో గడపాలి. పొద్దున్నే స్నానం చేసి విష్ణువును పూజించి నైవేద్యం సమర్పిస్తే మంచిది. మరునాడు ఒక్క పొద్దు విడిచి భోజనం చేస్తే పాపాలు పోతాయి. ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
నిష్టతో ఉంటే..
తొలి ఏకాదశి రోజు మనం ఎంత నిష్టగా ఉంటే అంత పుణ్యం వస్తుంది. కానీ చాలా మందికి ఇవి తెలియవు. వారు లేచిందంటే చాలు మాంసం, మద్యం తింటూనే ఉంటారు. తాగుతూనే ఉంటారు. మన సంస్కృతి గురించి తెలుసుకుని ఏకాదశి రోజు నిష్టతో పూజలు చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. కొందరు చేస్తారు. కానీ మరికొందరు మాత్రం అలాంటి వాటిని పాటించరు.