Canada Wildfires 2023: సాధారణంగా ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా పేద లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇబ్బంది. ఎందుకంటే ఆహారం లేదా ఇతర అవసరాలు కోసం పొరుగున ఉన్న దేశాలపై అవి ఆధారపడి ఉంటాయి. కానీ అమెరికా పరిస్థితి అలా కాదు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా స్థితిమంతమైన దేశం కాబట్టి అది ఇతర దేశాలపై ఆంక్షలు మాత్రమే విధిస్తుంది. ఫలితంగా ఆదేశాలు దేహి అంటూ తన కాళ్ల వద్దకు వచ్చే పరిస్థితులు కల్పిస్తుంది. అక్కడిదాకా ఎందుకు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి నేటి వరకు అమెరికా దేశానికి సరైన స్థాయిలో సవాల్ దేశం ఇంతవరకు లేదంటే అతిశయోక్తి కాదు. ఆర్థికంగానే కాదు రాజకీయంగాను ఇతర దేశాల్లో అనిశ్చిత పరిస్థితులను నెలకొల్పడంలో అమెరికా తర్వాతనే ఏ దేశమైనా.. అయితే అంతటి అమెరికా ఇప్పుడు వణికి పోతుంది. ఆకాశం నల్లగా మారడంతో ఆ దేశ అధ్యక్షుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందో మీరూ చదివేయండి.
అమెరికా పొరుగున కెనడా అనే ఒక దేశం ఉంటుంది. ఈ దేశంలో కొంతకాలంగా అడవి దహనం అవుతోంది. దావానలం లాగా వ్యాపించిన మంటలు చల్లారడం లేదు. ఈ మంటల తాకిడికి కనివిని ఎరగని స్థాయిలో కాలుష్యం ఏర్పడింది. కెనడా తూర్పు, పశ్చిమ భాగాల్లో ఏర్పడిన మంటల వల్ల రికార్డు స్థాయిలో 160 మిలియన్ టన్నుల కార్బన్ విడుదలైనట్టు అక్కడి వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం తెలుస్తోంది. దీంతో అటు పక్కనున్న అమెరికా కూడా ఈ పొగ వల్ల ఇబ్బంది పడుతోంది. అమెరికా గగన తలాన్ని పొగలు కమ్మేయడంతో ఆకాశం మొత్తం నల్లగా మారింది. న్యూ యార్క్, టొరెంటో నగరాల్లో ఆకాశం నలుపు రంగు పులుముకుంది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ దేశం గగనతలం కాలుష్యంలో చిక్కుకోవడంతో అమెరికా అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కెనడా దేశంలో చాలా రోజుల నుంచి అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. బ్రిటిష్ కొలంబియా, అల్బెర్టా, సస్కట్చేవాన్, తూర్పున అంటారియో, క్యూ బెక్, నోవా స్కోటియా తో సహా పలు ప్రాంతాల్లో కార్చిచ్చు వ్యాపించింది. మే నెల నుంచే ఆ దేశ అధికార యంత్రాంగం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. 490 ప్రదేశాలలో మంటలు చెలరేగగా.. 255 ప్రదేశాల్లో నియంత్రించలేని స్థాయికి అవి వ్యాపించాయి.. మిన్నేసోటా, మిన్నియా పాలిస్ లో అయితే వాతావరణం నల్లగా మారిపోయింది. గత మంగళవారం రాత్రి నుంచి ఆ ప్రాంతాల్లో 23వ గాలి నాణ్యత హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఆ దేశంలో గత జనవరి నుంచి 76,129 కిలోమీటర్లలో అటవి సంపద కాలిపోయింది. అప్పట్లో 75,596 కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. చెలరేగిన కార్చిచ్చు ఆ రికార్డును కూడా దాటిపోయింది.
కెనడాలో విస్తరిస్తున్న మంటలు అమెరికాలో వాతావరణాన్ని సమూలంగా మార్చివేశాయి. 413 వాయు నాణ్యత సూచితో అమెరికాలోని న్యూయార్క్ ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా చరిత్రకెక్కింది. స్కేల్ పై గరిష్ట వాయు నాణ్యత సూచి 500 అయితే న్యూయార్క్ నగరంలో వాయు కాలుష్యం 400 దాటింది అంటే దాని తీవ్రత అర్థం చేసుకోవచ్చు. దీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అప్రమత్తమయ్యారు. మంటలు అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.