https://oktelugu.com/

Children: పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే తల్లిదండ్రులు ఏం చేయాలి?

పొద్దున్నే లేవడం కంటే మంచి అలవాటు మరొకటిలేదు. పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా ఉదయమే నిద్ర లేవాలి. మీరు ఎంత ధ్యానం చేస్తున్నారో లేదా ఎంత వ్యాయామం చేస్తారో...

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 21, 2024 2:50 pm
    Parenting

    Parenting

    Follow us on

    Children: పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. కానీ వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే. వారి జీవితం కోసం ఎంతో కష్టపడతారు తల్లిదండ్రులు. రాత్రి పగలు తేడా లేకుండా ఉద్యోగాలు, ఇతరత్ర పనులు చేస్తుంటారు. కానీ వారి విషయంలో తగిన విధంగా నడుచుకోరు. కొన్ని సార్లు వారికి ఏది అందివ్వాలో తెలియకపోవచ్చు. అయితే మీ పిల్లలు చురుగ్గా, జీవితంలో ఏదైనా సాధించేలా ఉండాలి అంటే మీరు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

    ఉదయం లేవడం
    పొద్దున్నే లేవడం కంటే మంచి అలవాటు మరొకటిలేదు. పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా ఉదయమే నిద్ర లేవాలి. మీరు ఎంత ధ్యానం చేస్తున్నారో లేదా ఎంత వ్యాయామం చేస్తారో దాని కంటే ఉదయాన్నే నిద్రలేవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయాన్నే లేచేవారి మైండ్ చురుకుగా ఉంటుంది. వారు అన్ని విషయాల్లో ముందు ఉంటారు. ప్రతీ విషయాన్ని చురుకుగా వింటారు.

    సంగీతం
    సంగీతం గురించి పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. సంగీత పరికరాలను వాయించడం నేర్చుకోవాలి. ఇది మీ పిల్లల దృష్టిని మెరుగుపరుస్తుంది. వినూత్న ఆలోచనను కూడా ప్రోత్సహిస్తుంది. క్రియేటివిటీ పెరుగుతుంది.

    ధ్యానం
    తగినంత మనశ్శాంతిని ఇవ్వడం, ధ్యానం సాధన చేయడం వల్ల రోజంతా చురుకుగా ఉండేందుకు శక్తి లభిస్తుంది. రోజు 15 నిమిషాల ధ్యానం వల్ల మీ పిల్లలు చాలా ధైర్య వంతులు అవుతారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇలా చేస్తే పిల్లలకు ఏకాగ్రత అనేది బాగా పెరుగుతుంది. ఒక లక్ష్యంపై ఫోకస్ చేస్తారు.

    చర్చలు
    వ్యక్తులతో సహజంగా మాట్లాడటం, వారితో విషయాలు చర్చించడం వంటి కార్యక్రమాలలో పాల్గొనేలా పిల్లలను ప్రోత్సహించండి. ఇది వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. నలుగురిలో మాట్లాడే ధైర్యం వస్తుంది. ఏ విషయంలోనూ భయపడకుండా ఉంటారు. అన్ని విషయాలూ మీకు ధైర్యంగా చెబుతారు.

    గార్డెనింగ్
    గార్డెనింగ్ అనేది శరీరం, మనస్సును చురుకుగా ఉంచడం చేస్తుంది. మొక్కలు పెరిగే విధానం, వాటి ఉపయోగం తెలుసుకోమని చెప్పాలి.ఇలా చేయడం వల్ల కొత్త ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి. ప్రకృతిపై ప్రేమ పెరుగుతుంది. ఇది మనసును ప్రశాంతంగా ఉంచేలా చేస్తుంది.

    శారీరక శ్రమ
    పుస్తకం చదవడం మాత్రమే మెదడు కార్యకలాపాలు పెంచదు. శారీరక శ్రమ కూడా అవసరం. రోజువారీ క్రీడలు, వ్యాయామంలో పిల్లలను చేర్చండి. ఇలా చేయడం వలన పిల్లలు ఆరోగ్యంగా కూడా ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించేందుకు మానసికంగానూ శక్తి వస్తుంది.

    రాయడం
    ప్రతిరోజూ ఒక పేజీలో ఏదైనా రాయమని పిల్లలను అడగండి. పిల్లలు రాసిన వాటిని ఇతరులకు చెప్పి సంతోషపెట్టండి. వారిని వ్యాసాలు రాసేలా ప్రోత్సహించండి. ఎందుకంటే ఇలా చేస్తే సృజనాత్మకత పెరుగుతుంది.

    పుస్తక పఠనం
    మీ బిడ్డను పుస్తకాలు చదివేలా చేయండి. దీని వల్ల వారు ప్రతిరోజూ ఒక పేజీ చదివినా, వారి మెదడు శక్తి మెరుగుపడుతుంది. పుస్తకాలు చదివితే చాలా నాలెడ్జ్ వస్తుంది. ప్రతి సబ్జెక్ట్ పైన కూడా వారికి అవగాహన ఉంటుంది.