https://oktelugu.com/

Morning : స్మార్ట్ కు అలవాటు పడిన మనం.. మనదైన ఆనందాలు ఎన్ని కోల్పోతున్నామో తెలుసా..

Morning : ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి ఎప్పుడో పడుకునేదాకా స్మార్ట్ ఫోన్ తోనే.. తినే తిండి నుంచి మొదలు పెడితే తాగే నీరు వరకు అన్నీ క్లిక్ దూరంలోనే.. ఇంత స్మార్ట్ గా బతికేస్తున్న మనం.. సుఖాలు పొందుతున్నాం సరే.. వచ్చే రోగాల మాటేమిటి.. స్మార్ట్ కాలంలో ఉన్నాం సరే.. కోల్పోతున్న ఆనందాల మాటేమిటి..

Written By: , Updated On : February 22, 2025 / 08:51 AM IST
Morning

Morning

Follow us on

Morning : ఉదయాన్నే 5 గంటలకు కూసే కోడి.. తెల్లవారుజామున కీరవాణి రాగాలు పరిక కోయిల.. ప్రభాత సమయాన తెరలు తెరలుగా కురిసే మంచు.. అమ్మలక్కల ముచ్చట్ల మధ్య వాకిలిని తడిపే కల్లాపి.. సస్యలక్ష్మికి స్వాగతం పలికే ముగ్గు.. గారాలు పోయే గోవు.. బీరాలు పోయే గేదె.. కడివెడు నిండా అమృతం లాగా పాలు.. కట్టెలపై మీద అమ్మ చేసే వేడి వేడి చాయి.. అదే పక్కన కుండలో కాగిన నీళ్లు. కలి వేసి వండిన అన్నం.. ఇలా ఒకటా రెండా.. జీవిత పాఠాన్ని.. అద్భుతమైన జీవిత గమనాన్ని నిర్దేశించే ప్రతి జ్ఞాపకం ఈ తరానికి దూరం అవుతోంది అంటే మామూలు విధ్వంసం కాదు. ఒక సంస్కృతికి, సంప్రదాయానికి ఒక జాతి దూరమవుతోంది అంటే అది అంతరించినట్టే లెక్క. చదువుతుంటే విస్మయం కలిగిస్తున్నప్పటికీ అది మాటికి నిజం. కావాలంటే ఈ కథనం కింద ఉన్న ఇన్ స్టా గ్రామ్ లింక్ క్లిక్ చేసి చూడండి.. ఎంతటి జ్ఞాపకాలను.. ఎంతటి అనుభూతులను ఈ తరం మిస్ అవుతుందో.. స్మార్ట్ యావలో పడి.. సంపాదన వేటలో పడి ఎన్ని కోల్పోతోందో..

మూలాలు మర్చిపోవద్దు

ఒక మనిషి అభివృద్ధి చెందాలి. అంతకంతకు ఆర్థికంగా ఎదగాలి. తన కుటుంబాలను గొప్పగా చూసుకోవాలి. విలాసవంతమైన జీవితాన్ని గడపాలి. సౌకర్యమంతమైన నివాసాలను ఏర్పరచుకోవాలి.. ఇది తప్పని చెప్పడానికి లేదు. కాదని అనడానికి లేదు.. అలాగని వీటికోసం మిగతా వాటిని మర్చిపోవద్దు. ఇప్పటికే తెలుగు భాష క్రమంగా నశించిపోతోంది. ఈ తరం పిల్లలకు తెలుగు అనేది తెలియకుండా పోతోంది. మనదైన వర్ణమాల అవగతం కాకుండా పోతుంది.. ఇంగ్లీష్ మోజులో పడి తల్లిదండ్రులు తెలుగుకు దూరం చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే తెలుగు భాష అని ఇది ఒకటి ఉందని.. తెలుగు జాతి ఒకటి ఉందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రస్తుత పరిస్థితిని వెల్లడిస్తోంది. భవిష్యత్ కాలంలో ఎదుర్కోబోయేది దుస్థితిని కూడా విశదికరిస్తోంది. కాగా, ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ కాలం నాటి యువత ఏం కోల్పోతోందో స్పష్టంగా చెప్పింది.. ఉదయాన్నే కూసే కోడి.. కల్లాపి చల్లుతున్న మహిళ.. అప్పుడే తెల్లవారుతున్న తీరు.. ఆ వీడియోలో ఆకట్టుకుంటున్నది. పల్లె దృశ్యాన్ని.. పల్లెటూరు వాతావరణాన్ని ఆ వీడియో చక్కగా ఆవిష్కరిస్తున్నది. అందువల్లే ఈ వీడియో ఎక్కువ లైక్స్ సొంతం చేసుకుంది.. వీక్షణలను కూడా పొందింది. అందువల్లే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది.