Women Stress at Home: భార్యాభర్తల జీవితం ఎంతో అందమైనది. ఇద్దరు వ్యక్తులు తమ సంతోషాలను, దుఃఖాలను పంచుకుంటూ ఒకరికి ఒకరు తోడుగా ముందుకు వెళ్తారు. ఈ ప్రయాణంలో కష్టాలు, సుఖాలు ఉంటాయి. అయితే కష్టసుఖాల్లో ఒకరికొకరు పాలు పంచుకోవడమే అందమైన జీవితం. కానీ కొందరు భర్తలు భార్యల విషయంలో పొరపాటు చేస్తూ ఉంటారు. ఈ పొరపాట్ల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరగడమే కాకుండా కొన్నిసార్లు విడాకులు తీసుకునే పరిస్థితికి ఏర్పడుతుంది. ఆ పొరపాట్లలో ముఖ్యమైనది ఇంట్లో పనులకు భార్యలకు భర్తలు సహకరించకపోవడం. ఇలా సహకరించకపోవడం వల్ల వారు తీవ్ర ఒత్తిడికి గురవుతారని ఇటీవల చేసిన అధ్యయనాల్లో తేలింది. అయితే వారు పడే ఈ ఒత్తిడి ఎలా ఉంటుందంటే?
పురుషులు బయట పనులు చేయడం వల్ల తాము స్ట్రెస్ ఎక్కువగా పడుతున్నామని భావిస్తారు. కానీ ఇంట్లో ఏమాత్రం వీక్లీ ఆఫ్ లేకుండా పనిచేస్తారు మహిళలు. ఒక్కరోజు కూడా తీరిక లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని రకాల పనులను చక్కబెడతారు. ఇలా చక్కపెట్టే క్రమంలో కలిసిపోయే అవకాశం ఉంది. అయితే కొందరు భర్తలు తాము బయట పనులు చేసి వచ్చామని ఇంట్లో ఊరికే కూర్చుంటారు. ఇంట్లో పనులతో తమకు సంబంధం లేదు అన్నట్లుగా భావిస్తారు. అలా భార్యలు పనిచేస్తుండగా.. భర్తలు ఖాళీగా కూర్చోవడం చూస్తే వారు ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడి వారు కార్యాలయాల్లో, వ్యాపారాల్లో పడే దానికంటే ఎక్కువగా ఉంటుందట. అంతేకాకుండా ఈ ఒత్తిడితో వారికి మానసికంగా అనారోగ్యం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఒత్తిడితో వారు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడడమే కాకుండా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
అందువల్ల వారిని ఇలాంటి ఒత్తిడికి గురికాకుండా చూసే బాధ్యత భర్తలదే అని కొందరు నిపుణులు అంటున్నారు. భర్తలు బయట పనులు చేసిన కూడా.. ఇంట్లో పనులకు భార్యలకు సహకరించడం వల్ల వారు ఎంతో సంతోషిస్తారు. అంతేకాకుండా తనకు సహకరించడం వల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో భార్యాభర్తలు కలిసి వారికి సేవ చేయడం వల్ల తల్లిదండ్రులపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అలా కాకుండా కేవలం భార్యలపైనే ఆ పనులను చేయించడం వల్ల పిల్లల మనస్తత్వాల్లో విభేదాలు ఏర్పడతాయి. అందువల్ల ఇంట్లో పనులకు భార్యలకు సహకరించాలి.
వీలైతే ఆదివారం వారికి విశ్రాంతి కల్పించి వంట చేసే ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో వారందరూ కొత్త రుచిని ఆస్వాదిస్తారు. అలాగే కుటుంబం అంతా కలిసి విహారయాత్రలకు వెళ్లే ప్రయత్నాలు చేయాలి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక పనులతో ఒత్తిడి ఎదుర్కొనే వారికి మనశ్శాంతిని కలిగించే పనులు చేయడం వల్ల వారి నుంచి ప్రేమ, ఆప్యాయత ఏర్పడుతుంది. ఈ ప్రభావం పిల్లలపై కూడా పడి వారికి తల్లిదండ్రులపై గౌరవం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పటికైనా ఇంట్లో పనులకు భర్తలు సహకరించాలని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు.