India vs Sri Lanka: తొలి ఓవర్ లో 17 పరుగులు వచ్చాయి.. ఈ జుట్టుకైనా ఇంతటి గొప్ప ఆరంభం ఏముంటుంది? కానీ ఇదే ఆరంభాన్ని భారత జట్టు కొనసాగించలేకపోయింది.. తర్వాత లంక బౌలర్లు పుంజుకోవడంతో వికెట్లు కోల్పోయింది. కీలక బ్యాట్స్మెన్ ఇలా వచ్చి అలా వెను తిరగడంతో 162 పరుగులు మాత్రమే చేసింది.. ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత బౌలర్లు సఫలీకృతం అయ్యారు. లేకుంటే భారత జట్టుకు వాంఖడే స్టేడియంలో వాచిపోయేది.

ఆరంభం అదిరింది
టాస్ గెలిచిన లంక.. భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లుగా గిల్, ఇషాన్ కిషన్ వచ్చారు. ముఖ్యంగా ఇషాన్ తన ఫామ్ కొనసాగించాడు. రజిత వేసిన తొలి ఓవర్ లో 17 పరుగులు చేసి తన ఉద్దేశం ఏమిటో చెప్పాడు. కానీ ఈ సంబరం కొద్ది సేపే అయ్యింది. లంక బౌలర్లు పట్టు సాధించడంతో తొలి పవర్ ప్లే లో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. మధ్య ఓవట్లలోనూ ఆకట్టుకోలేక పోయింది. చివర్లో హుడా, అక్షర్ బ్యాట్లు ఝళిపించడం తో పర్వాలేదనిపించే స్కోర్ సాధించింది. ఓపెనర్ గిల్(7), తన తొలి టీ 20 మ్యాచ్ ను ఫోర్ తో ప్రారంభించినా.. మూడో ఓవర్ లో అవుట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ (7) తన ట్రేడ్ మార్క్ స్కూప్ షాట్ కే అవుట్ అయ్యాడు. దీంతో భారత జట్టుకు అతి పెద్ద షాక్ తగిలింది. అలాగే అంచనాలతో దిగిన సంజూ శాంసన్(5) పూర్తిగా నిరాశ పరిచాడు. ఇక కెప్టెన్ హార్దిక్(29) కొద్దీ మేర ఆకట్టుకున్నాడు. ఇక ఇషాన్ తన జోరు సాగించాడు. పదో ఓవర్ లో 6,4తో బ్యాట్ ఝళిపించాడు. ఇదే క్రమంలో హసరంగ గూగ్లీని స్వీప్ షాట్ ఆడిన ఇషాన్ క్యాచ్ అవుట్ అయ్యాడు. నాలుగో వికెట్ కు హార్దిక్, ఇషాన్ 31 పరుగులు చేసింది..అప్పటికి భారత్ స్కోర్ 77/4. హార్దిక్ కు హుడా జత కలిసినా పరుగుల్లో వేగం పెరగలేదు. సింగిల్స్ కు మాత్రమే పరిమితమయ్యారు. 15 వ ఓవర్ లో పాండ్య లేట్ కట్ షాట్ కు బంతి ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతిలో పడింది.
చివరిలో…
నిస్సారంగా సాగుతున్న మ్యాచ్ లో డెత్ ఓవర్లలో ఊపు వచ్చింది. హుడా, అక్షర్ జోడీ ఎదురు దాడికి దిగింది. 16 వ ఓవర్ లో హుడా ఏకంగా 17 పరుగులు సాధించాడు. హసరంగ ఓవర్ లోనూ భారీ సిక్సర్ సాధించాడు. కానీ తర్వతా బౌలింగ్ చేసిన రజిత కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి రెండు ఓవర్లలో 28 పరుగులు సాధించడంతో స్కోరు 160 దాటింది. 36బంతుల్లో వీరు అజేయంగా 68 పరుగులు చేశారు.

తడబడింది
తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక అది లోనే తడబడింది. 163 పరుగులు ఈ పిచ్ పై పెద్ద కష్టం కాకపోయినా లంక ఆట అందుకు విరుద్ధంగా సాగింది. ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయింది. చివర్లో పుంజుకునేందుకు చూసింది. ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. పేసర్ శివమ్ మావీ తన వరుస రెండు ఓవర్లలో నిస్సాంక (1), ధనుంజయ (8) వికెట్లు తీసి ఆదిలోనే దెబ్బతీశాడు. ఆ తర్వాత కుషాల్ (28) నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. ఉన్న కాసేపు హసరంగ(21) సిక్సర్లతో భయ పెట్టాడు. అయితే మరోసారి బంతి చేత పట్టిన మావి హసరంగ ను ఔట్ చేశాడు. అప్పటికి శ్రీలంక స్కోర్ 108/6. ఈ దశలో లంక కెప్టెన్ శనక ఎదురు దాడికి దిగాడు. చివరి నాలుగు ఓవర్లలో 40 పరుగులు చేయాల్సి ఉండగా.. ఉమ్రాన్ వేసిన బాల్ కు శనక క్యాచ్ అవుట్ అయ్యాడు. మరో వైపు హర్షల్ 19వ ఓవర్ లో 16 పరుగులు ఇవ్వడంతో ఒత్తిడి పెరిగింది. ఆఖరి ఓవర్ లో 13 పరుగులు అవసరం పడగా… హార్దిక్ కు మరో ఓవర్ వేసే అవకాశం ఉన్నప్పటికీ బంతిని అక్షర్ కు ఇచ్చాడు. కరుణ రత్న ఓ సిక్సర్ బాదినా అటు ఒత్తిడిని అధిగమిస్తూ 10 పరుగులు ఇచ్చి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చివరి ఓవర్ లో ఇద్దరు బ్యాట్స్ మెన్ రన్ ఔట్ అయ్యారు. మ్యాన్ ఆఫ్ మ్యాచ్ గా హుడా ఎంపికయ్యాడు. వాంఖడే లో చేజింగ్ జట్టుకే విజయావకాశాలు ఉంటాయనే చరిత్రను భారత్ రెండు పరుగుల తేడా తో గెలిచి దాన్ని బ్రేక్ చేసింది.