T20 World Cup 2022: కొద్దిరోజులపాటు అభిమానులకు వీనుల విందైన ఆనందాన్ని అందించిన ఐసిసి టి20 మెన్స్ వరల్డ్ కప్ ముగిసింది.. ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ జట్టును మట్టి కరిపించింది. 1992 సీన్ రిపీట్ చేయకుండా రెండోసారి పొట్టి ప్రపంచ కప్ ను తమ గడ్డకు సగర్వంగా తీసుకెళ్లింది. బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ హీరోగా అవతరించాడు. సరే ఈ విషయాలు పక్కన పెడితే.. ఈసారి జరిగిన సీరిస్ లో ఏఏ రికార్డులు బద్దలయ్యాయో, కొత్త రికార్డులు ఎవరు సృష్టించారో ఒక లుక్కేద్దాం రండి.

కింగ్ కోహ్లీ: అప్పటిదాకా అతడు ఫామ్ లో లేడు. జట్టులోకి ఎందుకు తీసుకున్నారు. అతడు అవసరమా? ఇవి విరాట్ ను కోహ్లీ ఆస్ట్రేలియా లో జరిగే టి20 మెన్స్ వరల్డ్ కప్ కు ఎంపిక చేసినప్పుడు వినిపించిన వ్యాఖ్యలు. కానీ ఆ వ్యాఖ్యలను తుత్తునియలు చేస్తూ విరాట్ చెలరేగిపోయాడు. తనను కింగ్ కోహ్లీ అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు. ఈ టి20 ప్రపంచ కప్ లో అత్యధికంగా పరుగులు సాధించిన బ్యాటర్ గా రికార్డ్ సృష్టించాడు.. ఆరు ఇన్నింగ్స్ లో 296 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ ఆటగాడు మ్యాక్స్ ఓ డౌడ్ ఎనిమిది ఇన్నింగ్స్ లో 242 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ ఆరు ఇన్నింగ్స్ ల్లో 239 పరుగులు చేశాడు. వీరంతా కోహ్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే అర్థ సెంచరీ ల్లోనూ కోహ్లీ ఆరు ఇన్నింగ్స్ ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు. తర్వాత సూర్య కుమార్ యాదవ్ మూడు అర్థ సెంచరీలు సాధించాడు.
హసరంగ వారెవా: టీ 20 అంటేనే బౌలర్లకు పీడకల లాంటిది. అలాంటి టోర్నీలో బాల్ తో మెరవడం అంటే అంత ఈజీ కాదు. కానీ శ్రీలంకకు చెందిన హసరంగ అనే బౌలర్ మెరుపులు మెరిపించాడు. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో ఈ టోర్నీలో 15 వికెట్లు తీశాడు.. తర్వాత స్థానాల్లో సామ్ కరణ్ 13, బాస్ డి లీడే 13 ఉన్నారు. టాప్ 10 జాబితాలో ఒక్క ఇండియన్ బౌలర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇక అర్ష్ దీప్ సింగ్ 10 వికెట్లతో 11వ స్థానంలో నిలిచాడు.

సెంచరీలు కొట్టే వయస్సు నాది: టెస్ట్, వన్డే.. సుదీర్ఘమైన మ్యాచులు కాబట్టి ఒకటి రెండు సందర్భాలు మినహా మిగతా అన్నిసార్లు కూడా బ్యాట్స్ మెన్ పై పెద్దగా ఒత్తిడి ఉండదు.. ఇలాంటి సమయంలో బ్యాట్ ఝళి పించి సెంచరీలు సాధించొచ్చు. కానీ టి20లో అది సాధ్యమా? దాన్ని సాధ్యం అని నిరూపించాడు రిలీ రోసోవ్. ఈ దక్షిణఆఫ్రికా ఆటగాడు బంగ్లాదేశ్ పై శతకం సాధించాడు.. 109 పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత స్కోరర్ గా నిలిచాడు.. అతడి తర్వాత స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు ఫిలిప్స్ ఉన్నాడు..ఇతడు శ్రీలంక పై 104 పరుగులు చేశాడు. ప్రపంచ కప్ లో వీరిద్దరు మాత్రమే శతకాలు బాదారు.
సామ్ కరణ్: సాధారణంగా ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా బ్యాట్స్మెన్ మాత్రమే ఎంపిక అవుతారు. కానీ ఈసారి ఆ సాంప్రదాయాన్ని ఒక బౌలర్ చెరిపేశాడు. అతడే సామ్ కరణ్. ఈ టోర్నీలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.. పది పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఆఫ్ఘనిస్తాన్ పై అతడు ఈ ఘనత సాధించాడు. అతడి తర్వాత నోకియా బంగ్లాదేశ్ పై 10 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. బౌల్డ్ శ్రీలంకపై 13 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.
మిస్టర్ 360: అత్యధిక ఫోర్ల జాబితాలో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ఇతడు ఆడిన ఆర్ ఇన్నింగ్స్ ల్లో 26 ఫోర్లు బాదాడు. ఇతడి తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ ఆరు ఇన్నింగ్స్ లో 25 బౌండరీలు సాధించాడు.. ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ ఆరు ఇన్నింగ్స్ లో 24 ఫోర్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.
సికిందర్ రాజా: ఈ భారత మూలాలు ఉన్న జింబాబ్వే ఆటగాడు ఎనిమిది ఇన్నింగ్స్ లో 11 సిక్సర్లు కొట్టాడు. ఈ సిరీస్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.. ఇతడి తర్వాత స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ ఆరు ఇన్నింగ్స్ ల్లో 10 సిక్సర్లు బాదాడు. శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండీస్ 8 ఇన్నింగ్స్ లో 10 సిక్సర్లు బాదాడు.
క్లాసెస్: టి 20 అంటేనే ధారాళంగా పరుగులు తీసే వ్యవహారం.. అలాంటి మ్యాచ్లో ఒక్క పరుగు ఇవ్వకుండా బంతిని వేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. నెదర్లాండ్స్ బౌలర్ క్లాసెస్ ఏకంగా 93 డాట్ బాల్స్ వేసి అగ్రస్థానంలో నిలిచాడు. అతడి తర్వాత స్థానంలో రిచర్డ్ ఎన్ గరవ 89 డాట్ బాల్స్ తో, పాల్ వాన్ మీకెరన్ 85 డాట్ బాల్స్ తో తర్వాతి స్థానంలో ఉన్నారు.
ఇంగ్లాండ్ జట్టు: ట్రోఫీ నెగ్గిన ఇంగ్లాండ్ జట్టు అత్యధిక విజయాలు సాధించిన టీమ్ గా అవతరించింది. ఆరు మ్యాచ్ ల్లో 5 విజయాలు, ఒక ఓటమితో 83.3 శాతం సాధించి మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్ ల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో 75%తో రెండో స్థానంలో నిలిచింది.. భారత్ ఆరు మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు, రెండు ఓటములతో 66.667%తో మూడో స్థానంలో నిలిచింది.

క్వాలిఫైయర్ మ్యాచ్లతో కలిపి శ్రీలంక ఎనిమిది మ్యాచ్ లు ఆడింది. అందులో నాలుగు విజయాలు నమోదు చేసింది.. నెదర్లాండ్స్ 8 మ్యాచ్ల్లో నాలుగేసి గెలుపు ఓటమితో నిలిచింది.. దక్షిణాఫ్రికాపై సంచలన విజయం నమోదు చేసింది. ఈ విజయమే పాకిస్తాన్ జట్టును సెమీస్ దాకా తీసుకెళ్ళింది.
ఇంగ్లాండ్ జట్టుకు 13 కోట్లు: ఇక పొట్టి ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ జట్టుకు ఐసీసీ 13 కోట్ల ప్రైజ్ మనీ అందించింది. రన్నరప్ తో సరిపెట్టుకున్న పాకిస్తాన్ జట్టుకు 6.5 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. ఇక సెమిస్ లో ఓడిపోయిన రెండు జట్లకు 3.25 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ లభించింది.