Diabetes: ఇష్టమైన తీపి తినలేం. నచ్చిన వంటకాన్ని ఎక్కువ భుజించలేం. ఎక్కువ దూరం నడిస్తే నీరసం. చెంబుడు నీళ్లు ఎక్కువ తాగినా పలుమార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సిందే. దీనికి తోడు చిన్న గాయమైనా తట్టుకోలేం. ఇక మిగతా సమస్యలు సరే సరి. మధుమేహం లేదా షుగర్.. ఒకప్పుడు కొంతమందిలో మాత్రమే కనిపించేది. ఇప్పుడు ప్రతి వంద మందిలో ఒకరు లేదా ఇద్దరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అంటే తీవ్రత ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.. ఈ వ్యాధి వల్ల ఆకాల మరణాలు సంభవిస్తాయి.. ఉన్నన్ని రోజులు నరకం చూపిస్తుంది.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. రాబోయే 10 సంవత్సరాలలో కొత్తగా 10 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని ఒక అంచనా. ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మధుమేహం వల్ల చనిపోతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఈ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉండడంతో భారతదేశాన్ని మధుమేహ రాజధానిగా చెబుతున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అధికంగా డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు.. వయసు పెరుగుతున్న కొద్దీ మధుమేహం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. ప్రస్తుతం బాల్య, కౌమార దశలోనే టైప్ 2 డయాబెటిస్ ప్రబలడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. నేడు ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవం సందర్భంగా .. షుగర్ మీ శరీరాన్ని తాకకుండా ఉండాలంటే ఏం చేయాలో అనే చిట్కాలపై ఈ కథనం.

నిశ్శబ్దశత్రువు
సాధారణంగా మధుమేహాన్ని ప్రాథమిక దశలో గుర్తించడం చాలా కష్టం. ఏళ్ల తరబడి ఎటువంటి లక్షణాలు లేకుండా ఈ వ్యాధి శరీరంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ను చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. ఆలోగా శరీరం చిక్కి శల్య మై అనేక అవయవాలు రుగ్మతలతో కునారిల్లిపోతాయి. క్రమశిక్షణతో ఆహార నియమాలను పాటించడం, సరైన మందులను క్రమం తప్పకుండా వాడటం వల్ల అనేక అనర్థాలను నివారించవచ్చు. ప్రజలకు సరైన అవగాహన కలిగించేలా ఆధునిక వైద్య పరి శోధన ఫలాలను విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇక పిల్లల్లో వచ్చే టైప్ 1 డయాబెటిస్ లో వ్యాధి లక్షణాలు త్వరగానే బయటపడతాయి. కానీ మధుమేహం చిన్నారుల శారీరక మానసిక, ఎదుగుదలకు అవరోధంగా ఉంటుంది.. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ఇన్సులిన్ తీసుకుంటూ డయాబెటిస్ ను ఏళ్ల తరబడి జయించిన వారు ఎందరో ఉన్నారు.
జీవనశైలి మార్చుకోవాల్సిందే
జీవనశైలి విధానాలను మార్చుకోవడం ద్వారా మధుమేహం రాకుండా జాగ్రత్త పడొచ్చు. అప్పటికే మధుమేహం ఉన్నవారు దాని వల్ల వచ్చే సమస్యలను కూడా నియంత్రించవచ్చు. జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే మధుమేహాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా.. నిలువరించవచ్చు.. రక్తంలో చక్కెర, కొవ్వు పదార్థాల స్థాయిలను సమతుల్యం చేసుకుంటూ, ఆహార నియమాలను సక్రమంగా పాటిస్తే మధుమేహ సంబంధ సమస్యలను అధిగమించవచ్చు. కేవలం ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా, లేదా ఆహారాన్ని కట్టడి చేయడం ద్వారా మాత్రమే వ్యాధుల నుంచి తప్పించుకోలేం. సమతులమైన మితాహారం తీసుకోవడం ద్వారా సరైన ప్రయోజనం ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగుల్లో దాదాపు సగం మంది గుండె సంబంధిత వ్యాధులతో, పక్షవాతం వల్ల అకాల మరణానికి గురవుతున్నారు. దాదాపు 10 శాతం మూత్రపిండాల వైఫల్యంతో మరణిస్తున్నారు. డయాబెటిక్ రెటినోపతి వల్ల కంటి చూపును కోల్పోతున్నారు. కాళ్లలోని రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి, పలు సందర్భాల్లో కాళ్లు తొలగించాల్సిన దుస్థితి సైతం ఎదురవుతున్నది. మద్యం, ధూమపానం వంటి అలవాట్లు అగ్నికి ఆజ్యం పోసినట్టు సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.. ఇక చిన్న వయసులో క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో అనేకులు మధుమేహ వ్యాధిగ్రస్తులే.

వ్యాయామం చేయాలి
రోజుకు కనీసం ఐదు నుంచి కిలోమీటర్లు నడవాలి. లేదా ఐదు కిలోమీటర్లు సైకిల్ తొక్కాలి. ఈత కొడితే ఇంకా మంచిది. ప్రాసెస్డ్ ఫుడ్ జోలికి అసలు వెళ్ళకూడదు. జంక్ ఫుడ్ తీసుకోకూడదు.. కూల్ డ్రింక్స్ వంటివి తాగకూడదు. మద్యపానం, ధూమపానం వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆహారం కూడా మితంగా తినాలి.. ఒంట్లో కొవ్వు స్థాయిని పెంచే ఆహారానికి దూరంగా ఉండాలి. ఒక ముక్కలో చెప్పాలంటే నోటికి తాళం వేస్తేనే మన ఒళ్ళు బాగుంటుంది. మన దరికి రాకుండా ఉంటుంది.