Marriage Tips: కాలం మారుతున్న కొద్దీ కల్తీ వస్తువులతో పాటు కల్తీ మనుషులు కూడా సమాజంలో ఉంటున్నారు. వీరు కేవలం డబ్బు కోసమే పని చేస్తూ మనుషుల ఎమోషన్తో ఆడుకుంటున్నారు. అయితే కొందరు మోసపోవడానికి వారు ఎంచుకున్న మార్గం సరైంది కాదని నిపుణులు తెలుపుతున్నారు. అంటే మోసానికి మనమే దారి చూపిస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఉదాహరణకు పెళ్లి సంబంధాల విషయానికి వస్తే.. ఒకప్పుడు ఒక పెళ్లి చేయాలంటే దగ్గరి బంధువులను.. తెలిసినవారిని తమ ఇంట్లో అమ్మాయి లేదా అబ్బాయి ఉందని.. పెళ్లిళ్లు చేయాలని అనుకుంటున్నామని.. మంచి సంబంధాలు చూడమని చెప్పేవారు. అలా ఒకరి నుంచి మరొకరి ద్వారా ఆ సమాచారం చేరవలసిన చోటుకు చేరి మంచి సంబంధం వచ్చేది. అలా జరిగిన పెళ్లిళ్లు కూడా కలకాలం బాగుండేవి. కానీ ఇప్పుడు మ్యాట్రిమోనీ, ఇతర మార్గాల ద్వారా పెళ్లిళ్లు కుదురుతున్నాయి. కానీ ఎక్కువ కాలం నిలవడం లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది?
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెత అందరికీ తెలిసిన విషయమే. మనుషుల మధ్య ఒకప్పుడు సత్సంబంధాలు ఉండేవి. దీంతో ఒకరి అవసరాలు మరొకరు తీర్చుకునేవారు. ఒకరికి మరొకరు సాయం చేసుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఇగో అడ్డు వస్తుంది. దీంతో ఒకరు మరొకరితో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులతో.. బంధువులతో కూడా మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. దీంతో వారి మనసులో ఏముందో తల్లిదండ్రులు గాని ఇతరులు గాని తెలుసుకోలేకపోతున్నారు. ఫలితంగా ఒకరికి సాయం చేయడానికి మరొకరు ముందుకు రావడం లేదు.
ప్రస్తుత కాలంలో యువత పెళ్లిళ్లు చేసుకోవడానికి ఒక కార్యక్రమం లాగా భావిస్తున్నారు. తమ కెరీర్ సెట్ చేసుకున్నాక.. సగం వయసు గడిచాక పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకుంటున్నారు. కొందరు తల్లిదండ్రులు సైతం పిల్లల ఇష్టాన్ని కాదనలేక వారి కెరీర్ పైనే ఫోకస్ పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు. సరైన సమయంలో వివాహం కాలేక.. సగం వయసు గడిచిన తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు దొరకక అవస్థలు పడుతున్నారు. అయితే కొందరు తల్లిదండ్రులు మ్యాట్రిమోనీ.. పెళ్లిళ్ల పేరయ్య వంటి వాళ్లను ఆశ్రయించి సంబంధాలను చూస్తున్నారు. ఈ సంబంధాలు తాత్కాలికంగా బాగానే అనిపిస్తున్నాయి. కానీ ఆ తర్వాత అమ్మాయి లేదా అబ్బాయి గురించి పూర్తిగా తెలిసిన తర్వాత మోసపోయామని బాధపడుతున్నారు.
అయితే పెళ్లిల సంబంధాల విషయంలో ఇలా ఇతరులను సంప్రదించకుండా.. తమ బంధువులను లేదా స్నేహితులకు తమ ఇంట్లో పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి, అబ్బాయి ఉన్నాడని చెప్పి.. సంబంధాలు చూడమని చెబితే.. నిజమైన బంధువులు అయితే కచ్చితంగా చూడగలుగుతారు. ఎందుకంటే ఒక పెళ్లి చేయడం ఎన్నో జన్మల చేసుకున్న పుణ్యం. అయితే అందరి బంధువులు ఒకలా ఉండకపోవచ్చు.. అలాగే అనుకున్న సమయానికి సంబంధాలు దొరకకపోవచ్చు. కానీ ఇలా స్నేహితులు, బంధువుల ద్వారా వచ్చే సంబంధాలు మ్యాట్రిమోనీ, పెళ్లిళ్ల పేరయ్య వంటి వారి నుంచి వచ్చే వాటికంటే బాగానే ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైనా తమకు తెలిసిన వారిని మోసం చేయడానికి ఇష్టపడరు. అయితే మ్యాట్రిమోనీ, ఇతర సంస్థలు మాత్రం కేవలం డబ్బు కోసం పనిచేస్తాయి కాబట్టి.. వారు మంచి, చెడు ఎక్కువగా ఆలోచించకపోవచ్చు. అందువల్ల పెళ్లిళ్లు చేసే తల్లిదండ్రులు ఇలా తమ బంధువుల ద్వారా సంబంధాలు చూడడం మంచిదని కొందరు చెబుతున్నారు.